Share News

Skin Care: మెరిసే చర్మం కోసం పండ్ల రసాలు

ABN , Publish Date - Dec 09 , 2024 | 03:12 AM

చలికాలంలో చర్మం ఎక్కువగా తేమను కోల్పోతుంది. దీని వల్ల చర్మం పొడిబారి పగులుతుంటుంది.

Skin Care: మెరిసే చర్మం కోసం పండ్ల రసాలు

చలికాలంలో చర్మం ఎక్కువగా తేమను కోల్పోతుంది. దీని వల్ల చర్మం పొడిబారి పగులుతుంటుంది. చర్మంపై తెల్లని పొరలు ఏర్పడి నిర్జీవంగా మారుతుంది కూడా. ఇలా కాకుండా చర్మం మృదువుగా నిగనిగలాడాలంటే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్ల రసాలు తాగాలి.

క్యారట్‌-నారింజ రసం

క్యారట్‌లో బీటా కెరోటిన్‌ సమ్మేళనాలు, ఎ విటమిన్‌ అధికంగా ఉంటాయి. ఎ విటమిన్‌ చర్మంలో కొత్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. నారింజలో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్‌ వృద్ది పొందేలా చేస్తుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడుతుంది. మిక్సీ గిన్నెలో రెండు క్యారట్‌లను చిన్న ముక్కలుగా కోసి వేయాలి. అందులో ఒక నారిజ పండును తొక్క, గింజలు తీసి వేయాలి. ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీనిని అలాగే గ్లాసులో పోసి ఒక చెంచా తేనె కలిపి తాగాలి. ఈ రసం చర్మానికి తేమను, కాంతిని అందిస్తుంది. ముడతలను పోగొడుతుంది.

బీట్‌రూట్‌-యాపిల్‌ రసం

బీట్‌రూట్‌లో ఐరన్‌, సి విటమిన్‌ ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. చర్మానికి పోషకాలను, ఆక్సిజన్‌ని అందిస్తాయి. యాపిల్‌లో విటమిన్లు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం నుంచి విషపదార్థాలను తొలగిస్తాయి. మిక్సీ గిన్నెలో ఒక చిన్న బీట్‌రూట్‌ను తొక్కతీసి ముక్కలుగా కోసి వేయాలి. అందులోనే ఒక యాపిల్‌ను ముక్కలుగా కోసి వేయాలి. అర గ్లాసు నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి. దీనిని గ్లాసులో పోసి రెండు చెంచాల నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఈ బీట్‌రూట్‌-యాపిల్‌ రసం చర్మానికి పోషణను, మెరుపుని ఇస్తుంది.


దానిమ్మ రసం

దానిమ్మలో ఆంథోసియానిన్స్‌, పాలీఫెనాల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి. చర్మం మీద గీతలు, ముడతలు రాకుండా చేస్తాయి. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి నష్టం కలుగకుండా చేస్తాయి. ఒక పెద్ద దానిమ్మ పండును ఒలిచి గింజలను మిక్సీ గిన్నెలో వేయాలి. అందులో అరగ్లాసు నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి. ఈ రసాన్ని గ్లాసులో పోసి ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. ఈ రసం చర్మానికి రక్తం పట్టేలా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.

బొప్పాయి-అనాస రసం

బొప్పాయిలో పపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. అనాసలో సి విటమిన్‌ ఉంటుంది. ఇది ముఖం మీద మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను పోగొడుతుంది. మిక్సీ గిన్నెలో ఒక కప్పు బొప్పాయి ముక్కలు, అర కప్పు అనాస పండు ముక్కలు వేసి అర గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఇందులో రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే చర్మానికి తగినంత తేమ అంది నున్నగా మెరుస్తుంది.


కీరా-నిమ్మ రసం

కీరాలో 95 శాతం నీళ్లు, సిలికా మినరల్స్‌ ఉంటాయి. ఇవి చర్మానికి తేమ, పోషణ అందిస్తాయి. నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మిక్సీ గిన్నెలో ఒక కప్పు కీరా ముక్కలు, రెండు చెంచాల నిమ్మరసం, కొన్ని పుదీనా ఆకులు వేసి అరగ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీనిని గ్లాసులో పోసి ఒక చెంచా తేనె కలుపుకుని తాగాలి. ఈ రసం చర్మానికి మంచి రంగుని మృదుత్వాన్ని అందిస్తుంది.

Updated Date - Dec 09 , 2024 | 03:13 AM