Share News

Women Empowerment: నిన్నటి ఘనతలు 2024, రేపటి ఆశలు 2025

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:03 AM

రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2025 మీద తమ ముద్ర వేయడానికి సిద్ధమవుతున్న ఎందరో మహిళల్లో...

Women Empowerment: నిన్నటి ఘనతలు 2024, రేపటి ఆశలు 2025

రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2025 మీద తమ ముద్ర వేయడానికి సిద్ధమవుతున్న ఎందరో మహిళల్లో... ఒకరు నెలసరి సమయంలో మహిళల ఇబ్బందులను పరిష్కరించే సాధనాన్ని దేశమంతా విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. మరొకరు ఈ ఏడాది ‘కేన్స్‌’లో పురస్కారం సాధించి... ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ రేసులో ఉన్నారు.

ఆ సంగతులివి..

ప్రముఖ అమెరికన్‌ పత్రిక ‘ఫోర్బ్స్‌’ ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయాలు, దాతృత్వం వంటి విభిన్న రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించిన వ్యక్తుల జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది విడుదల చేసిన వందమంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు.

jhu.jpg

నిర్మలా సీతారామన్‌

ఈ జాబితాలో భారత ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ 28వ స్థానంలో నిలిచారు. ఆమె 2019 మేలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎంతో క్లిష్టమైన ఆర్థిక శాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల తరవాత తిరిగి అదే శాఖకు నియమితురాలయ్యారు. ఆమె సారథ్యంలో భారత్‌ దాదాపు నాలుగు ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే అయిదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2027 నాటికి దేశ జీడీపీ జర్మనీ, జపాన్‌లను దాటి... భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆమె గర్వంగా చెబుతున్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం అక్షరాస్యత, వ్యవస్థాపకత కార్యక్రమాలు రూపొందించి విజయవంతంగా అమలు చేశారు. నిర్మలా సీతారామన్‌ రాజకీయాల్లోకి రాకముందు యూకెలోని అగ్రికల్చరల్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వహించారు. భారత జాతీయ మహిళా మిషన్‌ సభ్యురాలిగా కూడా పనిచేశారు.

హర్షనిశా పరేజన్‌

ఆరోగ్యంతోనే సాధికారత సాధ్యం... ఇది హర్షనిశా పరేజన్‌ నినాదం. ఆమె బెంగళూరు కేంద్రంగా ‘టక్కిన్‌’ అనే సంస్థను స్థాపించి... మహిళల రుతుక్రమ సమస్యలకు పరిష్కారాలను చూపడానికి కృషి చేస్తున్నారు. ‘‘మా కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్‌ను నేనే. పేదరికం కారణంగా ఎదురయ్యే సవాళ్ళను ప్రత్యక్షంగా చూశాను. చదువు పూర్తి చేసుకొని, ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టిన తరువాత... సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించడానికి నా వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ‘టక్కిన్‌’ను ఏర్పాటు చేసి, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను అంటున్నారు హర్షనిశా. ‘‘మహిళలు సాధికారత సాధించాలంటే.. ఆరోగ్యంగా ఉండాలి. ప్రత్యేకించి రుతుసంబంధమైన ఇబ్బందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు... మహిళల పురోగతికి కూడా అవరోధాలు నిలుస్తాయి. అందుకే ఈ క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను’’ అని చెబుతున్నారు. సైకాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమెకు నిధుల సేకరణ, విద్యా కార్యక్రమాల రూపకల్నన తదితరాల్లో అనుభవం ఉంది. పలు అంతర్జాతీయ సంస్థల్లో, పలు ఐక్య రాజ్య సమితి ప్రాజెక్టుల్లో పని చేశారు. ఆ తరువాత ‘టక్కిన్‌’ను ఏర్పాటు చేసి... మహిళలకు, బాలికలకు నెలసరి ఆరోగ్యం, పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తున్నారు. సురక్షితమైన పద్ధతులు పాటించేలా చేస్తున్నారు. ప్రతి ఒక్కరితోనూ స్వయంగా సంభాషించి వారి సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని నివారించుకొనే మార్గాలు చూపడానికి ఈ సంస్థ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 5 వేల మందికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు... అట్టడుగు వర్గాలకు చెందిన సుమారు 2 వేల మందికి ‘మెన్‌స్ట్రువల్‌ కప్స్‌’ ఉచితంగా అందజేసింది. 2025ను తన ప్రయాణంలో ప్రతిష్టాత్మకమైన సంవత్సరంగా హర్షనిశా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ లాంటి దీర్ఘకాలికంగా వినియోగించగలిగే, చవకయిన, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాల గురించి మరింత విస్తృతంగా ప్రచారం చెయ్యడం, అవసరమైనవారికి అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘‘నెలసరి గురించి ధైర్యంగా మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ చాలా చోట్ల లేదు. ఈ పరిస్థితిలో మార్పు కోసమే నా ప్రయత్నం’’ అంటారు హర్షనిశా.


hljk.jpg

రోష్నీ నాడార్‌ మల్హోత్రా

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ మల్హోత్రా ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో 81వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈఓ కూడా! తండ్రి శివ్‌ నాడార్‌ స్థాపించిన 12 బిలియన్‌ డాలర్ల వ్యాపారాన్ని పర్యవేక్షిస్తూ, అంచెలంచెలుగా అభివృద్ధి చేసి... తనకు సాటిలేదనిపించుకున్నారు. ఎంఎస్‌ మల్హోత్రా- శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ధర్మకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఎడ్యుకేషన్‌ ఆవశ్యకతను చాటిచెబుతూ ఎన్నో సంస్థలు స్థాపించారు. స్వదేశీ జాతుల పరిరక్షణకు ‘ది హాబిటాట్స్‌ ట్రస్ట్‌’ను నెలకొల్పారు. కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన రోష్నీ నాడార్‌కు జర్నలిజంలో కూడా ప్రవేశం ఉంది.

కిరణ్‌ మజుందార్‌ షా

ఫ బయోకాన్‌ బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా 82వ స్థానంలో నిలిచారు. 1978లో ఆ సంస్థ స్థాపన నుంచి దాని అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తూ ఎన్నో విజయాలు సాధించారు, అంతర్జాతీయ మార్కెట్లో స్థానం సంపాదించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్‌ తయారీ కేంద్రాన్ని మలేసియాలో నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం వయాట్రిస్‌ గ్లోబల్‌ హెల్త్‌ కంపెనీకి 3.3 బిలియన్‌ డాలర్లు చెల్లించి బయోసిమిలర్స్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలోని బికారా థెరప్యూటిక్స్‌ విలువ నాస్డాక్‌లో 362 మిలియన్‌ డాలర్లకు చేరడం ఆమె సాధించిన ఘన విజయంగా చెప్పవచ్చు. క్యాన్సర్‌ పరిశోధనల కోసం గ్లాస్గో విశ్వవిద్యాలయానికి 7.5 మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చారు. మొదట కిరణ్‌ వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. కానీ విభిన్నమార్గాన్ని ఎంచుకుని దేశం గర్వించదగ్గ వ్యవస్థాపకురాలిగా ఎదిగారు. ప్రస్తుతం బయోకాన్‌ సంస్థ కరోనా వైరస్‌ వేరియంట్‌ల కోసం యాంటీ బాడీ థెరపీ విధానాలపై పనిచేస్తోంది. ఫోర్బ్స్‌- భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితా-2024లో కిరణ్‌ మజుందార్‌ షా 91వ స్థానంలో నిలిచారు.

పాయల్‌ కపాడియా

గోల్డెన్‌ గ్లోబ్‌... సినీ, టెలివిజన్‌ రంగాలకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ పురస్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎందరో కలలుకంటారు. 1943లో ప్రారంభమైన ఈ అవార్డులకు భారతదేశం నుంచి గతంలో ఏడుసార్లు నామినేషన్స్‌ ఆమోదం పొందగా, నాలుగు పురస్కారాలు లభించాయి. అయితే ఈ అవార్డు గ్రహీతలైన భారతీయుల్లో మహిళలు ఎవరూ లేరు. మీరానాయర్‌ రెండుసార్లు నామినేట్‌ అయినా... పురస్కారం అందుకోలేకపోయారు. 2025లో... పాయల్‌ కపాడియా ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రం ఆ లోటు తీరుస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది ‘కేన్స్‌ చలనచిత్రోత్సవం’లో... రెండవ అతి పెద్ద అవార్డ్‌ ‘గ్రాండ్‌ పిక్స్‌’ను పాయల్‌ అందుకున్నారు. చిత్రకారిణి అయిన తల్లి నళినీ మాలిని ప్రోత్సాహంతో కళలపై అభిమానం పెంచుకున్న పాయల్‌ విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రుషీ వ్యాలీ స్కూల్‌లో సాగింది. ఆ తరువాత ‘పుణే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎఫ్‌టిఐఐ)లో ఫిల్మ్‌ డైరెక్షన్‌ కోర్సు చేశారు. ప్రకటనలు, వీడియో చిత్రాలను రూపొందించారు. బిజెపి నాయకుడైన నటుడు గజేంద్ర చౌహాన్‌ను ఎఫ్‌టిఐఐకి ఛైర్మన్‌గా నియమించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన 139 రోజుల సుదీర్ఘ సమ్మెకు నాయకత్వం వహించినవారిలో ఆమె ఒకరు. దీంతో ఒక వర్గం ఆమెను ‘దేశద్రోహి’గా ముద్ర వేసింది. ఎఫ్‌టిఐఐ కేసు కూడా పెట్టింది. ఇలాంటి అవరోధాలు ఎదుర్కొంటూనే ‘ది లాస్ట్‌ మ్యాంగో బిఫోర్‌ మాన్‌సూన్‌’ చిత్రం తీశారు. అది ‘ఒబెర్హాసెన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’లో ప్రత్యేక జ్యూరీ పురస్కారం సాధించింది. తరువాత తీసిన ‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’ లఘు చిత్రం ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అలాగే మరో చిత్రం ‘...అండ్‌ వాట్‌ ఈట్‌ ది సమ్మర్‌ సేయింగ్‌’ కూడా అనేక అంతర్జాతీయచలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఆమె కొత్త చిత్రం ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ ఈ ఏడాది ‘కేన్స్‌’లో మెరిసింది. వచ్చే ఏడాది ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ను లక్ష్యంగా చేసుకుంది. అది ముంబాయిలోని ఒక నర్సింగ్‌ హోమ్‌లో పని చేస్తున్న ఇద్దరు నర్సుల కథ. వారిద్దరూ చేపట్టిన ఒక ప్రయాణంతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో పాయల్‌ ఆసక్తికరంగా మలిచారు. 82వ ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌’ కోసం బెస్ట్‌ డైరెక్టర్‌, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీల్లో రెండు నామినేషన్లు ఈ చిత్రానికి లభించాయి. 2025 జనవరి మొదటివారంలో పురస్కార వేడుక జరుగుతుంది. ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ సాధించిన తొలి భారతీయ మహిళగా పాయల్‌ చరిత్ర సృష్టిస్తారా? తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే...

Updated Date - Dec 30 , 2024 | 04:03 AM