Women Inspiration: వీరిది విజయ పథం
ABN , Publish Date - Dec 30 , 2024 | 03:42 AM
వైకల్యం శరీరానికే కానీ మెదడుకు కాదని నిరూపించిన వ్యక్తి శీతల్‌దేవి. చేతులు లేని విలువిద్యా క్రీడాకారిణి.
కొందరి విజయాలు లక్షల మందిలో స్ఫూర్తిని నింపుతాయి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చినా పట్టుదల ఉంటే సాధించలేనిదేమి లేదనే ఆశను రేకెత్తిస్తాయి. 2024లో ఈ విధంగా కొన్ని లక్షల మందిలో స్ఫూర్తిని నింపిన మహిళలెవ్వరో ఒక్క సారి చూద్దాం..
శీతల్‌దేవి
వైకల్యం శరీరానికే కానీ మెదడుకు కాదని నిరూపించిన వ్యక్తి శీతల్‌దేవి. చేతులు లేని విలువిద్యా క్రీడాకారిణి. 2024 సమ్మర్ పారా ఒలింపిక్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాకుండా కాంస్య పతకం కూడా గెలుచుకుంది. అతి సామాన్య కుటుంబానికి చెందిన శీతల్‌దేవి- భారతీయ సైన్యం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు- ఆమెలో ఏదో ఒకటి సాధించాలనే తపన వేళ్లూనుకుంది. అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి ప్రపంచ రికార్డు సాధించేలా చేసింది. దివ్యాంగులకే కాకుండా కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
మనూ బాకర్
ఇంటిపక్క అమాయకంగా కనిపించే అమ్మాయిలా ఉండే మనూ బాకర్ ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో మూడు మెడల్స్ సాధించింది. ఒలింపిక్స్‌లో ఒకే తరహా గేమ్‌లో ఎక్కువ మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు మహిళా క్రీడాకారిణిలు అథ్లెట్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ మొదలైన క్రీడల్లో మాత్రమే రాణించేవారు. మనూ బాకర్ ఇతర క్రీడల్లో కూడా మన వాళ్లు రాణించగలరని నిరూపించింది. ’
మోహనా సింగ్ జితర్‌వాల్
శత్రువులతో యుద్ధాలు కేవలం పురుషులకు మాత్రమే అనేది ఒకప్పటి మాట! ప్రస్తుతం భారతీయ సైనిక దళాలలో మహిళలు కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మన భారతీయ సరిహద్దుల్లోని ఇతరులు చొచ్చుకురాకుండా కాపలాకాసే ‘ఫైయింగ్ బులెట్స్’లో చేరిన తొలి ఫైటర్ ఫైలట్‌గా మోహనా సింగ్ ఈ ఏడాది చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు వైమానిక దళంలో ఫైటర్ పైలెట్స్ ఉండేవారు కారు! కేవలం పురుషులకు మాత్రమే ఆ అవకాశం లభించేది. 2016లో మోహనా సింగ్ తొలిసారి మహిళా ఫైటర్ పైలెట్ అయింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు.
రేచల్ గుప్తా
అందంతో పాటుగా సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్నవారు అతి తక్కువ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రేచల్ గుప్తా. ఈ ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషన్‌ను గెలుచుకొంది. ఈ పోటీ ఫైనల్స్‌లోని ప్రశ్నలకు రేచల్ ఇచ్చిన సమాధానాలు అనేక మందిని ఆకట్టుకున్నాయి. మోడలింగ్‌తో పాటుగా ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న రేచల్ అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది.
దివ్యా దేశ్‌ముఖ్
చెస్‌లో మన దేశానికి ప్రత్యేక స్థానముంది. దీనిని ఈ ఏడాది మరో ఎత్తుకు తీసుకువెళ్లిన వారిలో దివ్యా దేశ్‌ముఖ్ ఒకరు. ఈ ఏడాది అండర్ 20 మహిళా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకొంది. 2025లో దివ్య మరిన్ని ఛాంపియన్‌షిప్‌లు గెలుస్తుందని చెస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సాద్నా సక్సేనా నాయర్
సైనిక దళాలలో డైరక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసస్ (ఆర్మీ)కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది ఈ స్థానానికి సాద్నా సక్సేనా నాయర్ చేరుకొని చరిత్ర సృష్టించారు. సైనిక దళాల చరిత్రలో ఈ స్థానాన్ని చేరుకొన్న తొలి మహిళా అధికారి సాద్నా కావటం ఒక విశేషం.