Share News

మామయ్య... కుంచెతో చరిత్ర రాశారు

ABN , Publish Date - May 16 , 2024 | 04:07 AM

ఆయన కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం అపురూపమే.పురాణేతిహాసాల పాత్రలకు, చారిత్రక పురుషులకు,స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలకు కాన్వాసుపై రూపమిచ్చిన కళాస్రష్ట.చిత్రకళలో తెలుగునేల ఖ్యాతిని

మామయ్య... కుంచెతో చరిత్ర రాశారు

ఆయన కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం అపురూపమే.పురాణేతిహాసాల పాత్రలకు, చారిత్రక పురుషులకు,స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలకు కాన్వాసుపై రూపమిచ్చిన కళాస్రష్ట.చిత్రకళలో తెలుగునేల ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసినప్రఖ్యాత చిత్రకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కొండపల్లి శేషగిరి రావు శతజయంతి సంవత్సరం ముగిసింది. ఈ సందర్భంగా శేషగిరిరావు జీవన రేఖల గురించి ఆయన కోడలు కొండపల్లి నీహారిణి ‘నవ్య’తో సంభాషించారు...

‘‘మా నాన్న పెండ్యాల రాఘవరావు సామ్యవాద భావజాలానికి నిబద్ధుడు. మా మామయ్య కొండపల్లి శేషగిరిరావు నిత్యం భగవన్నామ స్మరణతో చిత్రకళకు అంకితమైన మహనీయుడు. దృక్పథాలు వేరైనా, సాటి మనుషుల పట్ల ప్రేమగా మెలగడం వారి నైజం. నాన్న నాస్తికుడైనా, మామయ్య ఆస్తికుడైనా... ఇతరుల అభిప్రాయాలను, విశ్వాసాలను గౌరవించడంలో మాత్రం ఇద్దరిదీ ఒకటే పంథా. అదే వారిని మొదట స్నేహితులను, ఆ తరువాత వియ్యంకులను చేసింది. శేషగిరిరావుగారిది ఆదర్శవివాహం. మా నాన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని బంధు, మిత్రుల ఇళ్ళకు వెళ్లి... అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఒకసారి నర్సంపేట వెళ్లినప్పుడు... తొమ్మిదేళ్ళకే వితంతువు అయిన కమలాదేవి అనే బాలికను చూసి చలించిపోయారు.ఆ అమ్మాయికి తన స్నేహితుడైన కొండపల్లి శేషగిరిరావుతో వివాహం జరిపించాడు. 1945లో వితంతు వివాహం చేయడమంటే మాటలా! అది ఆనాడు ఒక పెద్ద సంచలనం. ఒకవైపు కుటుంబం, మరోవైపు సమాజం నుంచి వచ్చిన ఒత్తిళ్ళను ఎదిరించి నిలవడం సాధారణ విషయం కాదు. సంఘ సంస్కరణ భావాల పునాదిగా ఒక్కటైన కమలాదేవి, శేషగిరిరావు దంపతుల ఇంటికి తర్వాత నేను మూడో కోడలుగా వెళ్లాను. ఆదర్శ వివాహంతో ఒక్కటైన మా అత్త, మామ చివరివరకు అన్యోన్యంగా జీవించారు.

నా చదువు కోసం కొట్లాడారు..

మామయ్యకు మహిళలంటే ఎనలేని గౌరవం. పెళ్లి అయ్యాక భార్యను చదువుకోమని ప్రోత్సహించారు. అలా మా అత్తమ్మతో పాటు పల్లా దుర్గయ్య గారి భార్య, బిరుదురాజు రామరాజుగారి భార్య కలిసి ఆంధ్ర సారస్వత పరిషత్‌లో హిందీ ప్రాథమిక వరకు చదివారు. మా అత్తమామలకు ఆరుగురు మగపిల్లలు, ఒక అమ్మాయి. మా ఆరుగురు కోడళ్ళనూ కూతురుతో సమానంగా చూశారు. కాకతీయ యూనివర్సిటీలో బీఏ రెండవ సంవత్సరం పూర్తయిన వెంటనే నాకు పెళ్లి అయింది. మరుసటి ఏడాది హైదరాబాద్‌లో చదువు కొనసాగిద్దామని మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ అడిగితే ఇవ్వడం కుదరదన్నారు. ఆ సంగతి తెలిసి మామయ్య ఉద్యోగానికి సెలవు పెట్టి, కాకతీయ యూనివర్సిటీకి వెళ్లి, కొట్లాడి మరీ ఆ సర్టిఫికెట్‌ తీసుకొచ్చారు. ఆయనే స్వయంగా నన్ను రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో చేర్పించారు. డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నా నెంబరు మొదట పేపర్లో కనిపించలేదు. ఆ సమయంలో నేను కాన్పు కోసం చిన్నపెండ్యాలలోని మా పుట్టింట్లో ఉన్నాను. ‘‘జీవితంలో ఆటుపోట్లు సహజం. ఈ సమయం పోతే తిరిగిరాదన్నది అవాస్తవం. మళ్లీ మనం సమయాన్ని చేజిక్కించు కోవచ్చు. పరీక్షలో ఫెయిల్‌ అయినంత మాత్రాన అధైర్యపడకు. మున్ముందు మరెన్నో అవకాశాలు ఉంటాయి’’ అని నాకు ధైర్యం చెబుతూ మామయ్య ఉత్తరం రాశారు. ఇది ఆయన మంచితనానికి నిదర్శనం. నన్ను సొంతబిడ్డలా ఆదరించిన మామయ్య జీవిత చరిత్రను 2009లో ‘చిత్రకళా తపస్వి డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావు’ పేరుతో రాశాను. అది చదివి ఆయన చాలా సంతోషించారు.

శాంతినికేతన్‌లో చదువు...

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మామయ్య కడు పేదరికాన్ని అనుభవించారు. ఆయన తల్లి రామచూడమ్మ... బంధువుల ఇళ్ళల్లో వంటచేసి తన కొడుకును చదివించారు. మామయ్యకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అయినా, పరమత సహనానికి ప్రతీక ఆయన జీవితం. చిన్నతనంలో మజరుద్దీన్‌ మాస్టారి ప్రోత్సాహంతో 1937లో ముంబాయిలో డ్రాయింగ్‌ హయ్యర్‌గ్రేడ్‌ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. నిజాం రాజ్యంలోని ‘స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌’ (ఇప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం)లో చదివేందుకు మొదట అవకాశం లభించలేదు. అప్పుడు మా నాన్నతో పాటు మందుముల నర్సింగరావు, వట్టికోట ఆళ్వారు స్వామి ఆయనను నిజాం రాష్ట్ర పాలనాధికారి మెహదీనవాజ్‌ జంగ్‌ దగ్గరికి తీసుకెళ్లారట. అతను మా మామయ్యను స్వయంగా ‘స్కూల్‌ ఆఫ్‌ ఆర్‌’్టకు కారులో తీసుకువెళ్లి మరీ చేర్పించారట. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లాంటి ప్రఖ్యాత వ్యక్తులు విడిది చేసిన మెహదీ నవాజ్‌ జంగ్‌ ఇంట్లో కొన్నాళ్ళు శేషగిరిరావు గారికి ఆశ్రయం ఇచ్చారు. నవాబు గారి భార్య తనను సొంత తల్లిలా ఆదరించారని మామయ్య చెబుతుండేవారు. ఐదేళ్ల కోర్సు పూర్తయిన తర్వాత మెహదీ సాబ్‌ సూచనతో 1947లో శాంతినికేతన్‌లో చేరారు. అక్కడ నందలాల్‌బోసుగారి లాంటి మహనీయుల శిష్యరికం ఆయన గొప్ప చిత్రకారుడిగా రూపొందడానికి తొలి అడుగు అయింది. ఏడాది తర్వాత తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా రైల్లో మామయ్యమీద రజాకార్ల మూక దాడిచేయబోతే... అందులోని మీర్జా అనే కుర్రాడు గుర్తుపట్టి వదిలేయమన్నారట. అలా మామయ్యది భిన్న దృక్పథాలు, విభిన్న విశ్వాసాలతో కలగలిసిన జీవితం.


ఆ కుంచె నుంచి కొన్ని వేల చిత్రాలు...

కొండపల్లి శేషగిరిరావుగారు కొన్ని వేల చిత్రాలు గీశారు. కాకతీయ రాజు గణపతి దేవుడు, రాణీ రుద్రమ, పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి చారిత్రక వ్యక్తులు, శకుంతల, వరూధిని, దమయంతి లాంటి ఇతిహాస వ్యక్తుల చిత్రాలు, పోతన వంటి ప్రాచీన కవుల రూపాలు మా మామయ్య కుంచె నుంచి జాలువారాయి. హైదరాబాద్‌ నగర చుట్టుపక్కల ఇవాళ కానరాని అత్యంత అద్భుతమైన రాళ్ళ గుట్టలను యాభై ఏళ్ళ కిందటే ‘సేవ్‌ రాక్‌’ పేరుతో కాన్వాస్‌ మీద ఆయన బంధించారు. ‘కాకి పడగలు’ పట చిత్రాలను వెలుగులోకి తెచ్చారు. భారత స్వాతంత్ర్యోద్యమ, నిజాం వ్యతిరేక పోరాట ఘటనలకు దృశ్యరూపమిచ్చారు. రామాయణ, భాగవత, మహాభారత ఘట్టాలను చిత్రీకరించారు. తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘తెలుగు తల్లి’కి రూపమిచ్చారు. వాషింగ్‌టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచిన టంగుటూరి ప్రకాశం పంతులు నిలువెత్తు తైలవర్ణ చిత్రం శేషగిరిరావు గారు గీసిందే. రామప్ప దేవాలయంలోని శిల్పకళా వైభవాన్ని కాన్వాసు మీద గీసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. ఇలా ఒకటా, రెండా... మామయ్య గీసిన ప్రతి చిత్రం చారిత్రకమైనదే. ఆయన తన కుంచెతో చరిత్ర రాశారు. ఎన్నో అంశాలను రంగుల్లో నిక్షిప్తం చేశారు.

చిత్రకళకే జీవితం అంకితం

మావయ్య చిత్రకళ పట్ల నిబద్ధత, సమాజంపట్ల బాధ్యత కలిగిన గొప్ప చిత్రకారుడు. తను చదివిన కళాశాలలోనే 1952లో అధ్యాపకుడిగా చేరారు. ముఫ్ఫై ఏళ్లకుపైగా బోధనారంగంలో సేవలందించి, లక్ష్మాగౌడ్‌, బి. నరసింగరావు, వైకుంఠం, సూర్యప్రకాశ్‌, సురభి వాణీదేవి లాంటి ప్రియ శిష్యులను సంపాదించుకొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం... చనిపోవడానికి అంటే 2012కు నాలుగేళ్ల ముందు వరకు పూర్తిగా చిత్రలేఖనానికే అంకితమయ్యారు. కాగితం కనిపిస్తే బొమ్మ గీసేవారు. అంతగా ఆర్ట్‌లో నిమగ్నమయ్యారు. అలాంటి గొప్ప చిత్రకారుడి సేవలను గుర్తించి... చరిత్రలో ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వకపోవడం బాధాకరం. మామయ్య పేరుతోనూ అవార్డు నెలకొల్పుతామని తొమ్మిదేళ్ళ కిందట ఒక మంత్రి ప్రకటించారు. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. శతజయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించలేదు. తెలంగాణకే కాదు తెలుగు చిత్రకళకు వన్నెతెచ్చిన కొండపల్లి శేషగిరిరావు గారి కళాసేవకు తగిన గుర్తింపు దక్కాలన్నదే మా అభిలాష.’’


ART02.jpg

జపాన్‌ చిత్రకారిణి అభిమానం...

ప్రసిద్ధ జపాన్‌ చిత్రకారిణి ఫుకూ ఆకినో ఒకసారి భారతదేశ సందర్శనకు వచ్చారు. ఆమె నాగార్జున కొండను చూడాలనుకున్నప్పుడు ‘‘అయితే హైదరాబాద్‌లోని కొండపల్లి శేషగిరిరావుగారిని కూడా కలుసుకోండి’’ అని కోల్‌కతాలోని మిత్రులు సూచించారట. అలా ఆమె మా ఇంటికి వచ్చారు. మామయ్యగారు గీసిన వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలన్నింటినీ చూసి... తన్మయత్వంతో భారతీయుల పద్ధతిలో మామయ్యకు తలవంచి నమస్కరించారు. బురదలో పొర్లాడుతున్న పందుల చిత్రంతో పాటు నల్లపిల్లి పెయింటింగ్‌ను పేరున్న ఒక కన్నడ చిత్రకారుడు అడిగి మరీ తీసుకున్నారు. ‘చనిపోయిన ఆవ ుకన్నును పొడుస్తున్న కాకి బొమ్మ’ లాంటి కొన్ని చిత్రాల ద్వారా ఆయన మానవ స్వభావాన్ని కూడా ఎత్తిచూపారు. శిల్పకళ మీద లోతైన అధ్యయనంతో రాసిన వ్యాసాలను ‘చిత్రశిల్ప కళారామణీయకము’ పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఊరూరా తిరిగి, వాకిళ్లలో మహిళలు వేసే రకరకాల ముగ్గులను సేకరించారు. ముగ్గుల చరిత్రను, వాటి విశేషాలను ‘రూపరుచి’ పేరుతో రాశారు. దీన్ని త్వరలోనే పుస్తకంగా తీసుకొస్తాం.

ఆ గుర్తింపు ఇచ్చేది లేదన్నారు

కొండపల్లి శేషగిరిరావు గారు, స్వాతంత్య్ర సమరయోధుడు హీరాలాల్‌ మోరియా కలిసి వార్ధా వెళ్లి... మహాత్మాగాంధీని కలిశారు. ‘‘ఈ దేశ యువతగా స్వాతంత్ర్యోద్యమంలో మీరు భాగం కావాలి’’ అంటూ బాపూజీ వారికి ఉపదేశించారు. ఆ స్ఫూర్తితో ప్రతినిరసన కార్యక్రమంలోనూ మామయ్య పాల్గొన్నారు. ఒక దశలో ఆయన చిన్నమ్మ కుమారుడు చకిలం యాదగిరిరావు ఆచూకీ చెప్పమని పోలీసులు నిర్బంధించి మరీ హింసించినా, మామయ్య నోరు మెదపలేదు. నిజాం దాష్టీకాలను ఎండగడుతూ కార్టూన్లు గీశారు. అయితే, ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను గుర్తిస్తున్న క్రమంలో... కొండపల్లి శేషగిరిరావు గారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నట్టు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు రెండూ సర్టిఫికేట్లు ఇచ్చాయి. ఇరుపార్టీలు ఎలా ఇస్తాయంటూ ప్రభుత్వ అధికారులు మొదట మామయ్య పేరును గుర్తింపు జాబితా నుంచి పక్కనపెట్టారు. ‘‘కళాకారులకు సామాజిక ప్రయోజనాలే ముఖ్యం కానీ రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు’’ అని దీటుగా బదులిచ్చారు మామయ్య. తర్వాత ప్రభుత్వం ఆయనను స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించింది.

సాంత్వన్‌

ఫొటోలు - రాజ్‌కుమార్‌

Updated Date - May 16 , 2024 | 04:07 AM