Yoga : వేడిని పెంచే యోగాసనాలు
ABN , Publish Date - Nov 23 , 2024 | 06:20 AM
చలికాలంలో మనసు, శరీరం అంత ఉత్సాహంగా అనిపించవు. చలి వల్ల శరీరం ఉష్ణోగ్రతను కోల్పోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. వీటన్నింటినీ నివారించేందుకు యోగా
చలికాలంలో మనసు, శరీరం అంత ఉత్సాహంగా అనిపించవు. చలి వల్ల శరీరం ఉష్ణోగ్రతను కోల్పోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. వీటన్నింటినీ నివారించేందుకు యోగా మంచి మార్గమని ఆయుర్వేదం చెబుతోంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే యోగాసనాలు ఇవే...
సూర్య నమస్కారం
ఫ ఉదయిస్తున్న సూర్యుని ముందు నిలుచుని చేసే ఈ నమస్కారం ఎంతో విశిష్టమైంది. శరీరానికి సూర్మరశ్మి సోకగానే మనసు ఉత్తేజితం అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ వేగవంతమవుతుంది. కీళ్ల కదలికలు మెరుగవుతాయి. వెన్నెముక దృఢంగా మారుతుంది.
వీరభద్రాసనం
ఫ ఈ ఆసనం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. శరీరానికి చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. కాళ్లు, చేతులు, భుజాల్లో కదలికలను పెంచి శరీర సామర్థ్యాన్ని స్థిరపరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.
నటరాజాసనం
ఫ ఇది ప్రత్యేకమైన ఓ నృత్య భంగిమ. ఈ ఆసనం వేయడం వల్ల చలి కారణంగా బిగుసుకున్న కండరాలు వదులుగా మారతాయి. భుజాలు, పాదాలు, వేళ్లకు రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. శరీరానికి చురుకుదనం లభిస్తుంది.
భుజంగాసనం
ఫ చలికాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. భుజంగాసనం వేయడం వల్ల జీర్ణాశయంలో జఠరాగ్ని ఏర్పడుతుంది. ఇది ఆహారం తేలికగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఛాతి, ఊపిరితిత్తులు, ఉదర కండరాల్లో కూడా ఈ ఆసనం వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తీవ్ర స్థాయిలో వేధించకుండా ఉంటాయి.
ఉత్కటాసనం
ఫ శీతాకాలంలో చలి వల్ల శరీరం బిగుసుకుపోతుంది. ఉత్కటాసనం వేయడం వల్ల శరీరంలోని కండరాలు, రక్తం వేడెక్కుతాయి. ముఖ్యంగా తుంటి, తొడలు, మోకాళ్లకు తగిన ఉష్ణం అంది సులభంగా కదులుతాయి.
అధోముఖ స్వనాసనాసనం
ఫ ఈ ఆసనం వేయడం వల్ల శరీరం మొత్తం సాగినట్లవుతుంది. ముఖ్యంగా వీపు, భుజాలు, కాళ్లలో రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. రక్తం ఎగువకు ప్రవహించడం వల్ల తలకు, మెదడుకి తగినంత వేడి రక్తం అందుతుంది. దీనివల్ల బద్దకం, నీరసం, నిద్రించాలనే భావనలు మాయమవుతాయి.
వృక్షాసనం
ఫ ఈ ఆసనం శరీరాన్ని సమతాస్థితిలో ఉంచుతుంది. చల్లని వాతావరణం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గాలి పీల్చుకునే వేగాన్ని క్రమబద్దీకరిస్తుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మోతాదుకు మించి తగ్గకుండా ఉంటుంది.