Share News

Canada: భారతీయుల్లో కెనడాపై తగ్గుతున్న ఆసక్తి?

ABN , Publish Date - Jan 02 , 2024 | 10:29 PM

భారతీయుల్లో కెనడాపై ఆసక్తి తగ్గుతోందా అంటే అవుననే అంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, 2022 జులై-అక్టోబర్ మధ్య కాలంతో పోలిస్తే 2023 ఏడాది ఇదే కాలంలో చాలా తక్కువ భారతీయుల వీసా దరఖాస్తులను కెనడా ప్రభుత్వం పరిశీలించింది.

Canada: భారతీయుల్లో కెనడాపై తగ్గుతున్న ఆసక్తి?

ఎన్నారై డెస్క్: భారతీయుల్లో కెనడాపై ఆసక్తి తగ్గుతోందా అంటే అవుననే అంటున్నాయి తాజా గణాంకాలు. 2022 జులై-అక్టోబర్ మధ్య కాలంతో పోలిస్తే 2023 ఏడాది ఇదే కాలంలో చాలా తక్కువగా భారతీయుల వీసా దరఖాస్తులను కెనడా ప్రభుత్వం ప్రాసెస్ చేసింది. అప్లైబోర్డు అనే సంస్థ లెక్కల ప్రకారం , 2022 జులై- అక్టోబర్ మధ్య కాలంలో మొత్తం 146,000 భారతీయుల స్టడీ పర్మిట్ దరఖాస్తులను ప్రాసెస్ చేశారు. కానీ 2023లో ఇదే కాలానికి దరఖాస్తుల సంఖ్య 41 శాతం మేర తగ్గింది.

భారత్ కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలు ఈ పరిణామానికి కారణమనే భావన ఉన్నప్పటికీ అంతకంటే ముఖ్యమైన కారణాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. కెనడాలో ఉంటున్న వివిధ దేశాల విద్యా్ర్థులు తాము ఎదుర్కొంటున్న కష్టాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అనేక మంది భారతీయుల్లో విముఖత పెరిగినట్టు పరిశీలకులు భావిస్తున్నారు (Canada may be losing its shine, study permits for Indians down over 40%) .


ఈ పరిణామాలను ప్రతిబింబించేలా కెనడా సంబంధిత ప్రతికూల వార్తల సంఖ్య కూడా పెరిగింది. 2023 ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో కెనడాలో ఇళ్ల కొరతకు సంబంధించిన వార్తల సంఖ్య అంతకుమునుపు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా ఐదు రెట్ల మేర పెరిగింది. కెనడాకు సంబంధించి నెగెటివ్ కంటెంట్ కూడా 12 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. కెనడాలో జీవన వ్యయాలు, ఇతర ఖర్చులు అంతర్జాతీయ విద్యార్థులకు భారంగా మారాయని తెలుస్తోంది.

అయితే, పరిశీలన జరిగిన దరఖాస్తుల సంఖ్య తగ్గినా కూడా భారతీయులకు జారీ అయిన వీసాలు మాత్రం పెరిగాయి. 2023 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో భారతీయులకు జారీ అయిన వీసాల సంఖ్య అంతకుమునుపటి ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32 వేల మేర పెరిగింది.

Updated Date - Jan 02 , 2024 | 10:36 PM