NRI: దేశ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర కీలకం: సీపీఐ నేత నారాయణ
ABN , Publish Date - Dec 08 , 2024 | 10:00 AM
దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, దానికి అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి..
ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు అవసరమని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్‌లో ఆయన పాల్గొన్నారు. తమ పోరాటాలతో పేద ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలను ఆకర్షించలేకపోయామని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని అన్నారు, భారత్‌లో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహారిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాజకీయాల స్వరూపం మారిందని, ఎన్నికల సమయంలో డబ్బులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. గతంలో పార్టీల సిద్ధాంతాలు, ప్రజాప్రతినిధి వ్యక్తిత్వం చూసి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి నుంచి ఓట్లను రాజకీయ నాయకులు కొనుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ స్థితికి కొన్ని రాజకీయ పార్టీలు, నాయకుల వ్యక్తిగత స్వార్థమే కారణమన్నారు. ఓట్లను కొనుక్కుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు చేసిన డబ్బులను సంపాదించుకోవడంపై ఉన్న దృష్టి.. ప్రజలపై ఉండటంలేదని ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రజా చైతన్యంతోనే ఇలాంటి పరిస్థితికి స్వస్తి పలకవచ్చన్నారు. దేశంలో తాజా రాజకీయాలపైన ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో వామపక్ష పార్టీలు బలమైన శక్తిగా మారాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రయత్నం జరుగుతోందన్నారు.
అదానీ వ్యవహారంపై
అదానీ ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టులో నమోదైన అభియోగాలపై నారాయణ స్పందించారు. అమెరికాలోని న్యాయస్థానంలో కేసు నమోదు కావడం, దీనిలో గత ఏపీ ప్రభుత్వానికి ముడుపులు అందాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ ఈ విషయంపై అధ్యయనం చేసి అసలు విషయాలను వెలుగులోకి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు లంచాలు తీసుకుంటే ఆ కంపెనీ ప్రజాసంపదను కొల్లగొట్టినా చర్యలు తీసుకునే సహసం చేయదన్నారు. వామపక్షాలు ప్రజా పోరాటాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి కృష్ణమోహన్, లెనిన్ వేముల, శ్రీధర్ నంబూరి, సురేష్, శిరీష మోదుమూడి, వంశీ కొరటాల, వీర లెనిన్, శ్రీనివాస్ రావూరి, నగేష్ ఆచంట, మాధవరావు, దశరద్ కనపర్తి, రత్న భూషణ్, భూపేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here