NRI: డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ‘గాంధీ శాంతి నడక – 2024’
ABN , Publish Date - Oct 11 , 2024 | 07:47 AM
ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఐఏఎన్టీ నిర్వహణలో “గాంధీ శాంతి నడక – 2024” పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
డాలస్, టెక్సాస్: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఐఏఎన్టీ నిర్వహణలో “గాంధీ శాంతి నడక – 2024” పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు (NRI) ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐఏఎన్టీ అధ్యక్షులు రాజీవ్ కామత్, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎం.జి.ఎం.ఎన్.టి) కార్యదర్శి రావు కల్వాల అతిథులకు స్వాగతం పలికారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మహాత్మాగాంధీ స్మారకస్థలి నిర్మాణంలో సహకరించిన తోటి కార్యవర్గ సభ్యులకు, ప్రజలకు, సంస్థలకు, దాతలకు, ఇర్వింగ్ నగర అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ మాట్లాడుతూ “నేను ఎక్కడకు వెళ్ళినా, విదేశాలలో సైతం మీది మహత్మాగాంధీ విగ్రహం నెలకొనియున్న ఇర్వింగ్ నగరమేనా అని అడుగుతున్నప్పుడు ఆశ్చర్యంతోపాటు గర్వం కలుగుతోంది. కేవలం మహత్మాగాంధీ విగ్రహ నిర్మాణమేగాక, ఈ 18 ఎకరాల సువిశాలమైన పార్క్ సుందరీకరణలో కూడా భాగమైన ఎం.జి.ఎం. ఎన్.టి నాయకత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు’’ అని అన్నారు.
NRI: పోటాపోటీగా సాగిన తానా పికిల్ బాల్ టోర్నమెంట్
హ్యుస్టన్ నగరం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ మాట్లాడుతూ “మహాత్మాగాంధీ ఆలోచనలు, ఆశయాలు సర్వత్రా అన్నివేళలా సజీవంగా ఉంటాయి. శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహత్మాగాంధీ విగ్రహాన్ని ఇర్వింగ్ నగరంలో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.
ఈ వేడుకలలో ప్రత్యేక అతిథులుగా హాజరైన - ఈ మహత్మాగాంధీ విగ్రహశిల్పి బుర్రా శివ వరప్రసాద్ విజయవాడ నుండి, ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోని గుజరాత్ నుండి, కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన భారత సంతతికి చెందిన బిజు మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్‌లను, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులు రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడులను డా. ప్రసాద్ తోటకూర, ముఖ్య అతిథులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలసి ఘనంగా సన్మానించారు. దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాతలపేర్లతో కూడిన శిలాఫలకాన్ని కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి. సి మంజునాథ్ ఆవిష్కరించారు.
“గాంధీ శాంతి నడక – 2024” ను ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ ప్రారంభించే ముందు శాంతికి సంకేతంగా 10 తెల్లటి పావురాలను అందరి హర్ష ధ్వానాలు, కేరింతలమధ్య గాలిలోకి విడుదలజేశారు. నడక పూర్తయిన తర్వాత, మహాత్మాగాంధీ విగ్రహానికి అందరూ పుష్పాంజలి ఘటించి అల్పాహారం ఆరగించి, ఫోటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు.
ఈనాడు దినపత్రిక (ఆంధ్రప్రదేశ్, న్యూ ఢిల్లీ, కర్ణాటక) సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ఈ విగ్రహనిర్మాణ సాకారంలో అవిరళ కృషి చేసి సాధించిన వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, కార్యవర్గ సభ్యులందరినీ ప్రశంసించారు. ఇది ప్రవాసభారతీయులు ఐకమత్యానికి చిహ్నం అని అన్నారు. ప్రవాస భారతీయుడుగా ఉన్న గాంధీ దక్షిణఆఫ్రికా దేశం నుండి మాతృదేశానికి తిరిగివచ్చి భారతదేశపు స్వాతంత్ర్య సముపార్జనలో దశాబ్దాలుగా సాగించిన శాంతియుత పోరాటం చరిత్ర మరువలేని సత్యం అన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారి పర్యటనలో భాగంగా ఉన్న ప్రవాస తెలుగుదేశంపార్టీ నాయకులు జయరాం కోమటి, సతీష్ వేమన, సినీ నిర్మాత ఎం.ఎల్ కుమార్ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త రాం గుళ్ళపల్లి, మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.
ఈ వేడుకలలో – ఎం.జి.ఎం.ఎన్.టి వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డ్ సభ్యులు రావు కల్వాల, మురళి వెన్నం, రాజీవ్ కామత్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, షబ్నం మాడ్గిల్, కుంతేష్, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు, రాజేంద్ర వంకావాల, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడు వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.