NRI: ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన కరోనా!
ABN , Publish Date - Oct 19 , 2024 | 07:50 PM
గల్ఫ్‌లో కరోనా తీసుకొచ్చిన విపత్కర పరిస్థితుల్లో తను పనిచేస్తున్న కంపెనీకి బాకీపడ్డ ఓ ఎన్నారై జీవితం తలకిందులైంది. అప్పు తీరిస్తే కానీ ఇండియాకు వెళ్లేందుకు అనుమతివ్వమని సంస్థ చెప్పడంతో అతడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడు.
నాలుగేళ్ళుగా సహాయానికై హైదరాబాదీ నిరీక్షణ
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: కరోనా మహమ్మరి కనుమరుగయినా అది సగటు మనిషిని, అందునా ఎడారిలోని అనేక మంది ప్రవాసీయుల దైనందిన జీవితాన్ని కకావికలు చేయగా దాని సుడిగుండంలో ఇరుక్కొన్న కొందరు ఇప్పటికీ బయటపడలేక విలవిల్లాడుతున్నారు.
కరోనా కష్టకాలంలో అనేక చిన్నా చితకా వ్యాపారాలు మూతపడ్డాయి. కొందరు తమ దుకాణాలు మూసుకొని వెళ్ళిపోయారు. మరికొందరు నష్టాలతో వదిలిపెట్టగా వీరికి సరుకులు సరఫరా చేసిన వివిధ కంపెనీల సేల్స్ మాన్లు మాత్రం అడ్డంగా ఇరుక్కుపోయారు. గొలుసు చిక్కుల కంటే క్లిష్టతరమైన న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కొని స్వదేశానికి వెళ్ళలేక అలాగని ఇక్కడ ఉండలేక తినడానికి సైతం తిప్పలు పడుతున్నారు. వీరు ప్రతి నెలా పంపే డబ్బుపై ఆధారపడ్డ కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడ్డాయి.
NRI: కాన్సుల్ జనరల్‌తో సమావేశమైన తెలుగు చర్చి ప్రతినిధి బృందం
ఈ రకంగా కరోనా కాటు నుండి తేరుకోలేక పకృతి రమణనీయ అందాల సౌదీలోని తబూక్ ప్రాంతంలో జోర్డాన్ సరిహద్దు సమీపంలో నిరాశ నిస్పృహలతో నిట్టూరుస్తూ తనను తాను శాపనార్థాలు పెట్టుకొనే ఒక తెలుగు ప్రవాసీయుడ్ని చూస్తే జాలి కల్గుతుంది. అహ్మద్ షరీఫ్ అనే అతను రియాధ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఒక మంచి నీళ్ళ బాటిళ్ళ కంపెనీలో సేల్స్ మాన్‌గా తబూక్ నగరంలో పని చేసేవాడు.
కరోనా క్లిష్టసమయంలో అనేక దుకాణాలు మూతపడటం లేదా అందులో పని చేసే సేల్స్‌మాన్లు స్వదేశాలకు వెళ్ళిపోవడంతో సరఫరా చేసిన సరుకు డబ్బు అందలేదు. ఈ క్రమంలో తనకు దుకాణాల నుండి డబ్బు అందకపోవడంతో తాను కంపెనీకు చెల్లించలేదని అహ్మద్ షరీఫ్ వాదన.
Mahatma Gandhi Memorial: అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
తబూక్ నుండి కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న 1300 కిలో మీటర్లు దూరంలోని రియాధ్‌కు వెళ్ళిన అహ్మద్ తన వాదనను వినిపించాడు. తనను మళ్ళి ఉద్యోగంలో తీసుకొని ప్రతి నెలా మొత్తం జీతం తీసుకోవడం ద్వారా బకాయి రాబట్టుకోవాలని కూడా ప్రాధేయపడినా కంపెనీ కనుకరించలేదని అతను వాపోయాడు.
రియాధ్‌లో కొన్ని రోజులు నివాసం ఇచ్చిన కంపెనీ ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళగొట్టడంతో తిరిగి తబూక్‌కు వచ్చాడు. రియాధ్ నగరంలో ఉన్న కొద్ది రోజులు అక్కడ కొందరికి వంటావార్పు చేసి తనకు తినడానికి తిండి ఉండడానికి స్థలం సాధించుకొన్నా ఆ తర్వాత వెనక్కి వచ్చాడు.
NRI: రియాద్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు
తన తరహా అనేక మంది భారతీయులకు కంపెనీ అరబ్బి భాషలో కొన్ని కాగితాలు ఇచ్చి సెటిల్మెంట్లు అని చెప్పి సంతకాలు తీసుకోవడంతో తాను కూడా సంతకం చేశానని అతను వెల్లడించాడు. ఆ కాగితాల ఆధారంగా కంపెనీ తనకు రావాల్సిన బకాయి మొత్తం14,350 రియాళ్ళను చెల్లించవల్సిందిగా కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ డబ్బును చెల్లించవల్సిందిగా న్యాయస్థానం అహ్మద్ షరీఫ్‌ను ఆదేశించింది. ఈ డబ్బు చెల్లించే వరకూ అతన్ని దేశం విడిచి వెళ్ళకుండా కూడా కోర్టు ఆంక్ష విధించింది.
తబూక్ తిరిగి వచ్చిన అహ్మద్ షరీఫ్ నగరంలోని అన్ని హోటళ్ళలో కనీసం క్లీనర్ పని అయినా ఇవ్వండంటూ కోరినా తనఖీల భయం కారణాన ఎవరు ఇవ్వలేదు. అప్పుడప్పుడు భవన నిర్మాణ కూలీగా పని లభిస్తే సంతోషంగా వెళ్ళి పని చేసుకోనే అహ్మద్ షరీఫ్‌కు ఆ పని కూడా ప్రతి సారి దొరకదు. ప్రస్తుతం తబూక్ ప్రాంతంలో శీతాకాల పంటల కోత సమయం. భారీ వ్యవసాయ తోటలలో లోపలి వైపు పాములు, తేళ్ళ కారణాన కాయగూరలు తెంపడానికి వెనుకంజ వేస్తారు. ప్రమాదంతో కూడిన ఈ పనిని ప్రస్తుతం అహ్మద్ షరీఫ్ ఆనందంతో చేయడానికి కారణం, హైదరాబాద్‌లో తన భార్య, బిడ్డలకు తిండి పెట్టడమే. ఇంటి అద్దె చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో హైదరాబాద్‌లో ఇంటి యాజమాని ఇల్లు ఖాళీ చేయించగా మానసిక ఒత్తిడితో అహ్మద్ షరీఫ్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు. ఆసుపత్రికి వెళ్ళడానికి అఖమా లేదు, ఇన్సూరెన్స్ కూడా లేదు.
NRI: రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ
పని లేకుండా, ఒకసారి పెట్రోలు బంకు వద్ద ఏడుస్తూ కూర్చున్న అహ్మద్ షరీఫ్‌ను తబూక్‌లోని ప్రవాసీ సంఘం సాటా అధ్యక్షుడు లోకోట తిరుపతి కంటపడగా, ఆయన అతని గాధ విని చలించిపోయారు. స్వయానా చిన్నా చితక ఉద్యోగం చేసుకొనే తిరుపతి అతనికి అప్పడికప్పుడు తనకు తోచిన విధంగా సహాయం చేసి ఆ తర్వాత సాటా తబూక్ ప్రతినిధులు శ్రీనివాస్, నరేశ్, రోహాన్, హరిప్రియా, నరేష్ పావిడి, రమీజ్ రజా, సూర్య తదితరులతో చర్చించారు. గుంటూరుకు చెందిన శ్రీనివాస్ జాగర్లమూడి, అల్ హాసాలో పని చేసే కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ సురేశ్‌లు ఒక అడుగు ముందుకు వేసి స్పందించారు.
తమకు తోచిన విధంగా, అందరు అతనికి సహాయం చేయాలని అడుగు ముందుకు వేసారు. తబూక్‌లోని తెలుగు ప్రవాసీయులు అనేక మంది సహాయం చేస్తున్నారని, అందరి సహాయంతో అహ్మద్ షరీఫ్‌ను త్వరగా మాతృభూమికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా సాటా ప్రతినిధులు తెలిపారు. మరిన్ని వివరాల కొరకు 0562461603 తిరుపతి 0558053137 రమీజ్ రజా 0559651657 శ్రీనివాస్ జాగర్లమూడిలను సంప్రదించవచ్చని నిర్వహకులు సూచించారు.