NRI: దుబాయి తెలుగు సంఘానికి విఘ్నాలు తొలగేనా?
ABN , Publish Date - Sep 03 , 2024 | 02:14 PM
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ (టి.ఏ)లో నలుగురు సభ్యులు అనువంశిక విధానాన్ని అడ్డదారిన ప్రవేశపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా సంఘంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మిరాశీ అంటే అరబ్బీ భాషలో వారసత్వం. దీని ఆధారంగా మొఘల్ పాలకులు పాటించిన వారసత్వ విధానం ఆధారంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నాలుగు కుటుంబాలు అనాదిగా అనువంశిక అర్చక సేవలందిస్తున్నాయి. వీరి కొనసాగింపుపై వివాదం అత్యున్నత న్యాయస్థానాల వరకు వెళ్ళిన విషయం అందరికి విదితమే. ఇప్పుడు అదే తరహాలో తమకు కూడా జీవితాంతం, అ తర్వాత తమ వారసులు లేదా సూచించిన వారికి పదవులు ఇవ్వాలంటూ దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ (టి.ఏ)లో నలుగురు సభ్యులు అనువంశిక విధానాన్ని అడ్డదారిన ప్రవేశపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా సంఘంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది (NRI).
NRI: ఏపీ వరద బాధితుల సహాయనిధికి భారీ విరాళం ఇచ్చిన గుత్తికొండ శ్రీనివాస్
గంపెడు ఆశలతో ఆరంగేట్రం చేసిన దుబాయిలోని తెలుగు సంఘం (తెలుగు అసోసియెషన్ – టి.ఏ) కార్యవర్గ గడువు సమీపిస్తుండడంతో నిరాశానిస్పృహాలతో నిట్టూరుస్తున్నారు. గత సంవత్సరం రసకందాయ రాజకీయాల మధ్య జరిగిన ఎన్నికలలో తెలుగు అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగి హైదరాబాద్ నగరానికి చెందిన బాలుస వివేకానంద అధ్యక్షతన కార్యవర్గం కొలువు దీరినా పట్టుమని ఒక్క పని కూడా చేపట్టలేదు.
తెలుగు ప్రజలకు సేవ పేరిట సంఘాన్ని నెలకొల్పినా ఆరంభంలో అది కేవలం కొందరు వ్యాపారస్తుల చేతిలో బందీగా మారి అనంతరం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. సామాజిక సేవే తమ ప్రధాన ధ్యేయమని చెప్పడంతో ఉమ్మడి రాష్ట్రాల నుండి అనేక మంది ఔత్సాహిక యువకులు ఎనలేని ఆసక్తితో పోటీ చేసి ఎన్నికలలో విజయం సాధించారు. కళలు, సంస్కృతి, సేవ రంగాలలో వీరికి ఆసక్తి ఉండి ఆ దిశగా ముందుకెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నా దానికి తగినట్లుగా పరిస్థితులు లేవు.
అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండడంతో నూతన సభ్యుల్లో ఆసక్తి సన్నగిల్లింది. ఇతర భారతీయులతో పోల్చితే తెలుగు సమాజం సాముహిక సేవ, సంస్కృతి కార్యక్రమాల పరంగా పూర్తిగా వెనుకబడింది. వీసా నిబంధనలను ఉల్లంఘించి విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్ళడానికి యు.ఏ.ఇ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీలో తమ తమ రాష్ట్రాలకు చెందిన వారికి సేవలందించడానికి ఇతర రాష్ట్రాల సంఘాలు మొదటి వరుసలో ఉన్నారు. కానీ, వీసా నియమ నిబంధనల ఉల్లంఘనలో అగ్రభాగాన తెలుగు ప్రవాసీయులు ఉన్నా తెలుగు అసోసియెషన్ ఆ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. అదే విధంగా, తెలుగు భాషా దినోత్సవం, వినాయక చవతి మొదలగు కార్యక్రమాల జాడ కూడా లేదు.
ఎన్నికలు, కార్యవర్గంతో సంబంధం లేకుండా తాము జీవిత కాలమంతా కూడా శాశ్వతంగా కీలక పదవులలో ఉంటామని నలుగురు సభ్యులు మోండికేస్తుండడంతో ప్రతిష్ఠంబన సంవత్సరం తరబడి కొనసాగుతుంది. అనువంశీక అర్చకులు, ధర్మకర్తలు లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపై హక్కు ఉన్నట్లుగా వీరి వ్యవహార శైలీ ఉండటంతో అందరూ ముక్కున వేలేసుకొంటున్నారు.
ఈ ఎన్నికలు నిమిత్త మాత్రం, కార్యవర్గం వస్తూపోతుంటుంది కానీ తాము మాత్రం శాశ్వతమంటూ కొందరు పెద్దలు సంఘ పురోగతికి అవరోధాలు సృష్టిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. చీటికీ మాటికీ తమ ఇష్టానుసారంగా తీర్మానాలు చేస్తూ అయోమయం సృష్టిస్తున్నారు. సభ్యులు ఎవరు, ఏ ప్రతిపాదికన ఎప్పుడు చేరారు, సభ్యత్వ రుసుం చెల్లింపు తేది వగైరా అనే సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా ఆడింది ఆట పాడింది పాటగా కొందరు చేస్తుండడంతో విరక్తి కల్గుతోందని కొందరు వాపోతున్నారు.
దుబాయిలోని స్థానిక నియమాలకు అనుగూణంగా ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి ఎన్నిక చెల్లదంటూ ఒక వర్గం వాదిస్తోంది. అధ్యక్ష పదవి గడువు సగ భాగాన్ని ఓడిపోయిన అభ్యర్థికి కూడా కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల నియమాల ప్రకారం ఓడిపోయిన అభ్యర్థికి అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఏ మేరకు నియమాలకు అనుగూణమని మరో వర్గం ప్రశ్నిస్తోంది. ఎవరయినా ఎదురు ప్రశ్నిస్తే స్థానిక అరబ్బుల బూచిని చూపిస్తూ పరోక్ష బెదిరింపులకు దిగుతున్నారనే అరోపణలు కూడా ఉన్నాయి.
స్థానికంగా సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలను చేపడుతూ ఇతర సంఘాలతో అనుబంధం ఉన్న కొందరు కూడా తమ అనుభవం, ఆసక్తి కారణంగా టీఏలో ముఖ్య భూమిక వహించగా వారిని నిరోధించడానికి మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర సంఘాల వారికి ఇందులో ఏం పని అని ఒక వర్గం ప్రశ్నిస్తుండగా తెలుగు వారిగా తమ హక్కు మరియు తమ అనుభవం వలన తెలుగు సమాజానికి మేలు జరుగుతుందని ప్రత్యర్థి వర్గం చెబుతోంది.
సౌమ్యుడు, వివాదరహితుడు, మృధుస్వభావి అయిన వివేకానంద బలమైన ఇరు వర్గాలను నొప్పించకుండా వ్యవహరిస్తుండడం ఒక ఎత్తయితే, ఏ వర్గాలతో సంబంధం లేని యువ కార్యవర్గం కూడా ఒక దృఢ నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తూ తమ గడువుకు సమీపిస్తుండడం మరో విచిత్రం. ఈ కారణంగా కూడా ప్రతిష్ఠంభన తొలగడం లేదనేది అనేకుల అభిప్రాయం. రానున్న వినాయక చవితి తరువాతైనా తెలుగు అసోసియెషన్‌కు ఉన్న విఘ్నాలు తొలగిపోవాలని తెలుగు సమాజం ఆశిస్తుంది.
Read Latest NRI News and Telugu News