NRI: ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు!
ABN , Publish Date - Oct 08 , 2024 | 09:57 AM
ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నాడు దుబాయిలోని ఆల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి.
ఎన్నారై డెస్క్: ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నాడు దుబాయిలోని ఆల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి (NRI). సుమారు 5000 మంది భారీ జన సందోహం నడుమ తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించేలా సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు ఎంతో అట్టహాసంగా పండుగ వేడుకలు జరిగాయి.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గౌరవ అతిథిగా ఇండియన్ కాన్సులేట్ దుబాయ్ కార్యాలయం నుంచి హెడ్ అఫ్ చాన్సరీ శ్రీ బిజేందర్ సింగ్ (కాన్సిల్ వెల్ఫేర్ అండ్ ప్రోటోకాల్), కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వర్థమాన సినీ నటి కుమారి అనన్య నాగళ్ల, ప్రముఖ తెలంగాణ జానపద గాయని వరం, ప్రముఖ షార్ట్ ఫిల్మ్ కమెడియన్ సదానందం (సదన్న), కార్యక్రమానికి హోస్ట్‌గా సోనీ పటేల్, తెలుగు రాష్ట్రాల నుండి వివిధ సంఘాల ప్రతినిధులు , ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ముందు కళాకారులు డప్పు వాయిద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొనగా, మహిళలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాల నడుమ వేడుక ప్రాంగణం పులకించింది. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆడపడుచుల పాటలు, చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది. సప్తవర్ణాల శోభితమైన పూల దొంతరల బతుకమ్మలు చూడ ముచ్చటగా నిలిచాయి. ఉదయం నుండే ఆడపడుచులు వాటిని ఎంతో అందంగా అలంకరించి రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు వేడుక అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
NRI: తానా, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ విజయవంతం!
ఈ సందర్భంగా ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి క్రమం తప్పకుండా యూఏఈ గడ్డ మీద వందల మందితో ప్రారంభమైన మొదటి బతుకమ్మ ఈ రోజు వేలాది మంది తెలంగాణ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉన్నారు. ఇలాంటి వేడుకలు మన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను పాటించడానికి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియ చెప్పేలా ఇలాంటి వేడుకలు దోహద పడుతాయని చెప్పారు. ఈటీసీఏ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ యూఏఈలో ఉన్న తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, ఆపదలో ఉన్న తెలంగాణ బిడ్డలకు చేతనైనంత సహాయాన్ని అందించటం ఈటీసీఏ ముఖ్య ఉద్దేశ్యాలని అన్నారు.
గల్ఫ్ సంక్షేమం కోసం 13 సంవత్సరాల నుంచి పోరాటం చేశామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తరువాత గల్ఫ్ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అడుగులు పడటం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మరణించిన కార్మికులకు 5 లక్షల మృతధన పరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అలోచించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మరణించిన పేద కార్మికులందరికి వర్తించేలా చర్యలు చెప్పట్టాలని, విధి విధానాలతో కూడిన ప్రభుత్వపరమైన సంక్షేమ విధానానికి రూపకల్పన చేసి పారదర్శకంగా గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ చేయాలని విజ్ఞప్తి చేసారు .
NRI: దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అనంతరం కార్యక్రమనికి విచ్చేసిన ముఖ్య అతిథి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈటీసీఏ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించిన సంబరాలు చూసి 14 సంవత్సరాలు క్రమం తప్పకుండా బతుకమ్మను నిర్వహిస్తున్న ఈటీసీఏ కార్యవర్గ సభ్యులను వారి కృషిని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు జీవో విడుదల చేసిందని అన్నారు. దాని ప్రకారం గల్ఫ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి మరణించిన కుటుంబానికి 5 లక్షల సాయం చేస్తామని, ఇది భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మహత్మ జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌లో ప్రత్యేక అధికారిణి ఏర్పాటు చేసి ప్రవాసీ దివస్ కింద సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. వివిధ గల్ఫ్ సంఘాల సలహాలు సూచనలు తీసుకొని గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వారిని, అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. అరబ్ దేశంలో బతుకమ్మ పండుగను నిర్వహించడం చాల సంతోషాన్ని కలిగించిందని, ఇలాంటి సాంస్కృతిక పరమైన వేడుకలు భావితరాలకు మన ఆచార సంప్రదాయాలను తెలియచేయడానికి దోహదపడుతాయని పలువురు కొనియాడారు.
TANA: తానా వైద్యశిబిరం విజయవంతం.. 550 మందికి చికిత్స
యూట్యూబ్ స్టార్ కమెడియన్ సదన్న చేసిన కామెడీ స్కిట్స్ నవ్వులు పూయించాయి. జానపద గాయిని వరం పాడిన బతుకమ్మ పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసాయి. చిన్నపిల్లలు సైతం సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చప్పట్లతో హుషురూగా ఆడిపాడటం అందరిని ఆకట్టుకుంది .
కార్యక్రమానికి హాజరైన మహిళలందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ తలమానికమైన బతుకమ్మ సంబరాలను గొప్పగా జరుపుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు తీసుకొచ్చిన రంగు రంగు పూల బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. నిర్వాహకులు అందమైన బతుకమ్మలను ఎంపిక చేసి, బతుకమ్మ పాటల పోటీలు, సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈటీసీఏ మహిళా సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ కోలాటాలు, జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెళ్లి రావమ్మ బతుకమ్మ అంటూ గౌరమ్మను తలుస్తూ బతుకమ్మలను ఏర్పాటు చేసిన కొలనులో నిమ్మర్జనం చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ ప్రసాదాన్ని అందజేశారు.
ఈ వేడుకకు పీఎమ్ ఫైనాన్షియల్ ప్రధాన స్పాన్సర్ కాగా, ఎమ్ఏసీ ఇంటర్నేషనల్, నీతి గ్రూప్ గోల్డ్ స్పన్సర్‌గా, ఎల్ఎస్‌పీఎమ్‌కే, ఎస్ఆర్ఆర్, బ్లూమార్క్, యూనీఫోర్స్ కాంట్రాక్టింగ్ కంపెనీలు కో స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ నిర్వాహకులు బతుకమ్మ జ్ఞాపికను అందచేశారు.
ఈ సంబరాల్లో ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర,అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చీటీ జగదీష్ రావు, ప్రధాన కార్యదర్శి వినోద్ ఆచార్యులు, మాజీ అధ్యక్ష్యులు రాధారపు సత్యం, తిరుమల్ రావు, చైతన్య చకినాల, శ్రీనివాస్ అలిగేటి, సురేష్ రెడ్డి, రఘు అలిగేటి, రాజేష్ పోలంపల్లి, తిరుపతి రెడ్డి, ఎస్ పి కస్తూరి, సామ శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ కుమార్, రామ్ కందుకూరి, ఈటీసీఏ మహిళా సభ్యులు రాణి కోట్ల, అన్నపూర్ణ, మౌనిక, విపుల, సారిక, దీపిక, మమత, సరోజ, సుధ , సంధ్య , సుమజ , రణీశ, , స్వప్న, శ్వేత , రమ్య , తదితర సభ్యులు పాల్గొన్నారు.