Oxford University: బ్రిటన్‌లో ఎన్నారై మహిళకు షాక్! పీహెచ్‌డీ కోసం రూ.కోటి ఖర్చు పెడితే..
ABN , Publish Date - Oct 26 , 2024 | 06:14 PM
బ్రిటన్‌లోని ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి ప్రయత్నిస్తున్న ఓ భారతీయ యువతి తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. పీహెచ్‌డీ నాలుగో సంవత్సరంలో ఉన్న తనను బలవంతంగా మాస్టర్స్ కోర్సుకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లోని ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి ప్రయత్నిస్తున్న ఓ భారతీయ యువతి తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. పీహెచ్‌డీ నాలుగో సంవత్సరంలో ఉన్న తనను బలవంతంగా మాస్టర్స్ కోర్సుకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను మోసపోయానన్న భావన కలుగుతోందని పేర్కొంది (NRI).
Iphone 16 ban: ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం! పర్యాటకుల్లో టెన్షన్!
బీబీసీ మీడియా సంస్థ కథనం ప్రకారం, తమిళనాడుకు చెందిన లక్ష్మీ బాలకృష్ణన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ సాహిత్యంలో పీహెచ్‌డీ కోసం ప్రయత్నిస్తున్నారు. నాలుగేళ్లుగా అక్కడ ఉంటున్న ఆమె ఇప్పటివరకూ రూ.1.09 కోట్ల వరకూ పైచదువులపై ఖర్చు చేశారు. అయితే, తన పరిశోధన పత్రానికి పీహెచ్‌డీ స్థాయి లేదంటూ యూనివర్సిటీ అధ్యాపకులు 4వ ఏడాదిలో మాస్టర్స్ కోర్సుకు బదిలీ చేశారని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
లక్ష్మీబాలకృష్ణన్ పరిశోధన పత్రాన్ని ఇద్దరు అధ్యాపకులు వేర్వేరుగా పరిశీలించి పీహెచ్‌డీ స్థాయి లేదని తేల్చారు. ఆ అధ్యాపకుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీలు చేసుకోగా అక్కడ కూడా చుక్కెదురైంది. తొలి ఏడాది, ఆ తరువాత అప్లికేషన్ దశలో తన థీసెస్‌ను స్వీకరించినా నాలుగో సంవత్సరంలో ఫాకల్టీ ఆమె పరిశోధనను తిరస్కరించారని ఆమె ఆరోపించింది. ‘‘నా అనుమతి లేకుండా వాళ్లు బలవంతంగా నన్ను పీహెచ్‌డీ కోర్సు నుంచి తొలగించి మాస్టర్స్‌కు బదిలీ చేశారు. నన్ను మోసం చేశారన్న భావన కలుగుతోంది. ఎంతో ఉన్నతంగా భావించిన విశ్వవిద్యాలయం నన్ను నిరాశ పరిచింది. ఇప్పటికే ఇండియాలో నేను రెండు సార్లు మాస్టర్స్ చేశా. మరో మాస్టర్స్ నావల్ల కాదు. రకరకాల అప్పీల్స్‌తో నాకు విసుగొచ్చి చివరకు పీహెచ్‌డీపై ఆశ వదులుకునేలా చేయడమే యూనివర్సిటీ వ్యూహం లా ఉంది ’’ అని ఆమె బీబీసీ సంస్థకు తెలిపింది.
Travel Trends: లాంగ్ వీకెండ్‌కు పోదాం చలోచలో..!
లక్ష్మీ బాలకృష్ణన్ చదువుకుంటున్న క్వీన్స్ కాలేజీ కూడా ఈ విషయంపై స్పందించినట్టు బీబీసీ తన నివేదికలో పేర్కొంది. అధ్యాపకుల పరిశీలనలో ఆమె పరిశోధన పత్రం ఆమోదం పొందకపోయినప్పటికీ టర్మ్ రిపోర్ట్స్‌లో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం కాలేదని కాలేజీ వారు పేర్కొన్నారట. అంతేకాకుండా, ఇద్దరు షేక్స్‌పియర్ సాహిత్య అధ్యయనకారులు కూడా ఆమె రీసెర్చ్‌కు ఆమోదముద్ర వేశారని, పీహెచ్‌డీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారని తెలిపింది. అయితే, ఆఫీస్ ఆఫ్ ది ఇండిపెండెంట్ అడ్జుడికేటర్ మాత్రం యూనివర్సిటీ నిర్ణయానికే మద్దతు తెలిపినట్టు బీబీసీ తన నివేదికలో పేర్కొంది.