NRI: సింగపూర్‌లో ఎన్నారై యువకుడికి ఆరు కొరడా దెబ్బలు..నాలుగేళ్ల జైలు శిక్ష!
ABN , Publish Date - Jan 21 , 2024 | 08:28 PM
నైట్ క్లబ్‌లో బ్రిటీష్ మహిళను వేధించిన కేసులో భారతీయ యువకుడికి సింగపూర్ న్యాయస్థానం నాలుగేళ్ల జైలు, ఆరు కొరడా దెబ్బల శిక్ష విధించింది.
ఎన్నారై డెస్క్: నైట్ క్లబ్‌లో బ్రిటీష్ మహిళను వేధించిన కేసులో భారతీయ యువకుడికి సింగపూర్ న్యాయస్థానం నాలుగేళ్ల జైలు, ఆరు కొరడా దెబ్బల శిక్ష విధించింది (Indian In Singapore Gets 6 Cane Strokes Jail For Harassing Women). 2022లో జరిగిన ఈ ఘటనలో న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, స్టూడెంట్ పాస్‌తో సింగపూర్‌లో ఉంటున్న ఇరుగుల ఈశ్వర్ రెడ్డి 2022 ఆగస్టులో టర్ఫ్ క్లబ్ రోడ్ రెస్టారెంట్‌లో బాధితురాలికి ఎదురుపడ్డారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న బాధితురాలు తన స్నేహితుల కోసం ఎదురు చూస్తోంది.
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న నిందితుడు, మహిళను కుర్చిలోంచి లేపి ఎత్తుకుని రెస్టారెంట్ సమీపంలోనే ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తనను వదలిపెట్టమని మహిళ చెబుతున్నా అతడు లక్ష్య పెట్టలేదు. అక్కడ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను నేలపై పడుకోబెట్టి తన షర్టు తొలగించాడు. ఈలోపు మహిళ కోసం వెతుకుతున్న ఆమె స్నేహితుడు బాధితురాలి అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు దుస్తులు లేకుండా కనిపించాడు. బాధితురాలు కన్నీటిపర్యంతమవుతుండటం అతడి కంట పడింది. దీంతో, వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ‘‘ఒంటరిగా ఉన్న బాధితురాలు మద్యం మత్తులో ఉన్న విషయాన్ని నిందితుడు గుర్తించి అవకాశంగా తీసుకుని ఉంటాడు. అందుకే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు’’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.