Share News

Texas: జానపద సాహిత్యం విశిష్టత తెలిపేలా సాహిత్య సదస్సు..

ABN , Publish Date - Oct 24 , 2024 | 06:43 AM

తొలుత సాహితీ ప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 78 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక 'మనతెలుగుసిరిసంపదలు' శీర్షికగా చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుంచి..

Texas: జానపద సాహిత్యం విశిష్టత తెలిపేలా సాహిత్య సదస్సు..
NRI

జానపద సాహిత్యం విశిష్టతను తెలిపేలా డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ''నెలనెల తెలుగువెన్నెల'' తెలుగు సాహిత్య వేదిక 207 వ సాహిత్య సదస్సు టెక్సాస్‌లోని లూయిస్ విల్‌లో నిర్వహించారు. సదస్సు ప్రారంభ సూచికగా నారాయణ తీర్థుల విరచిత 'జయ జయ దుర్గే' కీర్తనను లెనిన్ వేముల పాడి స్వాగతోపన్యాసం చేశారు. తొలుత సాహితీ ప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 78 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక 'మనతెలుగుసిరిసంపదలు' శీర్షికగా చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుంచి సరైన సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండిని పలువురు ప్రశంసించారు. ఆ తర్వాత ఆస్టిన్ నగర వాసులైన కవి రామ్ డొక్కా తాను అద్భుతంగా రాసిన స్వీయకవితలను పంచుకున్నారు. మననం 2019, ఊపిరి కవితలు సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తరువాత చంద్రహాస్ గారు ఈమాట వ్యాస సంపుటి గా వెలువడి నూతనంగా ప్రచురింపబడిన 'మనకు తెలియని మన త్యాగరాజు' పుస్తకాని సభలో పరిచయం చేశారు. ఈ గ్రంథ రచయిత బ్రహ్మానందం బహుముఖ ప్రజ్ఞాశాలి అని, వారి రచనలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని వక్తలు పేర్కొంటూ ఈ పుస్తకం అందరూ చదువదగిన పుస్తకంగా అభివర్ణించారు.


ఆకట్టుకున్న సదస్సు..

ప్రముఖ కవయిత్రి కాశీనాధుని రాధ ''మాసానికో పద్య సుగంధం''లో ఆదికవి నన్నయ విరచిత మహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసములోని పద్యాలను పాడి సందర్భ సహిత వ్యాఖ్యను జోడించి సాహితీప్రియుల ప్రశంసలు అందుకున్నారు. సురేష్ కాజా 'కథ అంటే ఏమిటి 'అనే శీర్షికపై వివరణాత్మకంగా మాట్లాడారు. గ్రామదేవతల పుట్టుక గురించి జానపద కవి అందెశ్రీ వ్రాసిన 'కొమ్మ చెక్కితే బొమ్మరా..కొలిచి మొక్కితే అమ్మరా' కవితను లెనిన్ వేముల రాగయుక్తంగా పాడి సాహితీ ప్రియులను అలరించారు.


రచయిత, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు బూర్గుల రామకృష్ణారావు మనుమరాలు డాక్టర్ లక్కరాజు నిర్మల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. 'జన పథం ..జానపద కవిత్వం' ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తాము నివసిస్తున్న సమాజంలో తెలుగు జాతి జనుల పథ గమనాన్ని వర్ణిస్తూ సాగినప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మిల్లేట్ల వాడుక, హైదరాబాద్ లైఫ్ స్టైల్ పై కవితతో పాటు బతుకమ్మ పాటలు, ,మహబూబ్ నగర్ ప్రాంతంలో ప్రసిద్ధమైన నీటి ఆవకాయ, ఇంకా ఆధునిక చలన చిత్ర గీత రచనలు మొదలుకొని ''పంచభూతాలు''వంటి లౌకిక , ఆధ్యాత్మిక రచనా ధోరణులపై జానపదుల పదాల ప్రభావాన్ని వివరిస్తూ అనేక అంశాలను ఆమె ప్రస్తావించారు. కాలమానప్రాంత ,సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తూ మాండలిక వ్యత్యాసాలను సంభాషణ ల రూపంలో అభినయించారు. తన ప్రసంగంలో జానపద వికాసానికి కృషి చేసిన కవులతో పాటు ప్రసిద్ధ జానపద సాహిత్య పరిశోధకులను ఓసారి గుర్తుచేసుకున్నారు. నైతిక విలువలను బోధిస్తూ తాను రాసిన గ్రామీణ జానపద సాహిత్య కవితల్ని తెలంగాణా యాసలో ఆమె పాడిన తీరు సాహితీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.


ముఖ్య అతిథికి సత్కారం..

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు సతీష్ బండారు పాలక మండలి సభ్యులు, కార్యక్రమ సమన్వయకర్త దయాకర్ మాడా ముఖ్య అతిథి డాక్టర్ నిర్మలకు సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను సమర్పించి శాలువాతో సత్కరించారు. ఎంతోమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని డాక్టర్ నిర్మల పేర్కొన్నారు.


ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు మాట్లాడుతూ.. సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్థికంగా తోడ్పడుతున్న దాతలకు , కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, రాజారెడ్డి, వీర్నాపు చిన్న సత్యం, వంశీ చిట్లూరు, కిశోర్ నారే, నాగార్జున నలజుల, లెనిన్ బందా, నవీన్ గొడవర్తి , శ్రీధర్ నంబూరు, ఏ వీ రామ్ జోగారావు , మూలింటి రాజశేఖర్, శివ దొంగల, వెంకట్ జట్టుకొండ, మహా లక్ష్మి పసుమర్తి పాల్గొన్నారు. అలాగే గోవర్ధన రావు నిడిగంటి , కె ఏ మూర్తి , నగేష్‌తోపాటు డల్లాస్, హ్యూస్టన్,ఆస్టిన్ నగరాలనుండి అనేక మంది సాహితీ ప్రియులు ఈ సాహితీ సదస్సులో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు వేదికను ఇచ్చిన కుంభం తిరుమల్ రెడ్డికి నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. దయాకర్ మాడా వందన సమర్పణతో సదస్సు ముగిసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 24 , 2024 | 06:44 AM