NRI: అరబ్బునాట అనాథలకు అంత్యేష్టి!
ABN , Publish Date - Feb 20 , 2024 | 07:28 PM
గల్ఫ్‌లో అనాథలుగా ప్రాణాలు విడిచిన ప్రవాసీయులకు అక్కడి ఎన్నారైలు అంత్యక్రియలు నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
బహ్రెయిన్‌లో తెలుగు వారికి దహాన సంస్కారాలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మానవుడు జన్మించక ముందు సీమంతం నుండి షోడశ సంస్కారాల వరకు ప్రతిదీ ఒక సంప్రదాయం. దురదృష్టవశాత్తు ప్రవాసంలో కొన్ని సందర్భాలలో ఈ సంప్రదాయాలు పాటించలేని పరిస్థితి. మానవుడి జీవితం ఎక్కడ ఏ విధంగా గడిచినా చివరకు చావు అతడిని తన కుటుంబం దగ్గరకు చేరుస్తుంది. తండ్రి మరణిస్తే కుమారులు చివరగా చేసే సంస్కారం అంత్యేష్టి. వేదమంత్రాల మధ్య కొడుకు కొరివితో నిప్పంటించి గౌరవించే సంస్కారం మనది. సంప్రదాయంగా అంతిమ సంస్కారాలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందని విశ్వాసం. కానీ పేదరికంలో ఎడారిలో మరణిస్తే ప్రతి చోటా మోక్ష పట్ణణమే.. ప్రతిదీ వైకుంఠమే!
NRI: అనేక మందికి ఆపన్నహస్తం అందించి.. చివరకు అచేతనంగా మాతృభూమికి..!
మరి మృతుడిని అతడి కుటుంబమే మాకొద్దంటూ నిరాకరిస్తే ఏమి చేయాలి? అందునా జీవితంలో ఎక్కువ భాగం ప్రవాసంలో గడిపి దయనీయ పరిస్థితులలో మరణస్తే దిక్కెవరు? ఈ పరిస్థితులలో పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపూడి మండలానికి చెందిన మేడపాటి శ్రీను.. బహ్రెయిన్‌లో జనవరి 6న తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడు తన కంపెనీ నుండి పారిపోయి వీసా గడువు ముగిసి అక్రమంగా ఉంటుండడంతో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. మొత్తానికి మృతుడి కుటుంబ వివరాలు సేకరించి సమాచారం పంపించినా కుటుంబం మృతదేహాన్ని స్వీకరించడానికి ఆసక్తి ప్రదర్శించలేదు. మృతుడు శ్రీను గత 16 సంవత్సరాలుగా ఇంటికి రాలేదని, బహ్రెయిన్‌కు రాక ముందు కువైత్, సౌదీ అరేబియా దేశాలలో పని చేసాడని కానీ ఇంటికి మాత్రం రాలేదని కుటుంబం తెలియజేసింది.
భారతీయ ఎంబసీ పక్షాన బహ్రెయిన్‌లోని ప్రముఖ సామాజిక సేవకుడు డి. వి. శివకుమార్ కుటుంబంతో మాట్లాడగా మృతదేహాం తెప్పించుకోనే ఆర్థిక స్థోమత తమకు లేదని చేతులెత్తేసింది. భారతీయ ఎంబసీ ఖర్చుతో పంపిస్తామని నచ్చచెప్పినా కొన్ని కారణాల వలన మృతదేహాం తమకు అవసరం లేదని చెప్పి బహ్రెయిన్‌లోనే అంత్యక్రియలు జరపవల్సిందిగా కోరింది. దీంతో ఇటీవల శ్రీనుకు బహ్రెయిన్‌లోని హిందూ స్మశానవాటికలో సంప్రదాయరీతిలో శివకుమార్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
సుదీర్ఘ కాలంగా బహ్రెయిన్‌లో నివాసముంటున్న కోనసీమ వాసి శివకుమార్ బహ్రెయిన్‌లో ఇప్పటి వరకు ఒక డజనకు పైగా తెలుగు ప్రవాసీయులకు హిందూ సంప్రదాయబద్ధంగా అంత్యేష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. బహ్రెయిన్‌లోని ఈ హిందూ స్మశానవాటిక నిర్వహణను స్థానిక శివమందిరం పర్యవేక్షిస్తోంది. దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత అస్తికలను కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఇవ్వడంతో పాటు విమానంలో తీసుకు వెళ్ళే విధంగా స్థానిక ప్రభుత్వం సర్టిఫికేట్ కూడా జారీ చేస్తుంది. కానీ ఇక్కడ దహాన సంస్కారం చేసే అస్ధికలను ఇతరులు తీసుకెళ్ళి మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వడం అతి అరుదు. ఎందుకంటే ప్రయాణం అనేది శుభకార్యం. అందులో సామాను మధ్యలో మనకు తెలియని వాళ్ళ అస్తికలను తీసుకెళ్ళడం అశుభమనే భావన ఒక కారణమని శివకుమార్ అభిప్రాయపడ్డారు.
అనివార్య కారణాల వలన చనిపోయిన వారు స్వదేశానికి తమ సొంతవాళ్ళ వద్దకు వెళ్ళలేకపోతే, గౌరవంగా అంతిమ విడ్కోలు పలుకడానికి కన్న కొడుకు అవసరం లేదని శివకుమార్ పెర్కొన్నారు. ఎవరు దిక్కులేని ఎడారిలో మానవ సంబంధం రక్తసంబంధం కంటే కూడా గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
సంప్రదాయంగా అంతిమ సంస్కారాలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందని విశ్వాసం. అందునా మోక్ష పట్టణాలలో చేస్తే పుణ్యం మరీ ఎక్కువ అని కూడా భావిస్తారు. కానీ పేదరికంలో ఎడారిలో మరణిస్తే ప్రతి చోటా మోక్ష పట్ణణమే, ప్రతిదీ వైకుంఠమే!
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి