Viral News: రైల్వే వీఐపీ లాంజ్‌లో భోజనం చేస్తున్న వ్యక్తికి షాక్.. మజ్జిగ గ్లాస్‌లో..
ABN , Publish Date - Oct 22 , 2024 | 06:28 PM
రైల్వేలలో ఆహార పదార్థాల నాణ్యత ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు పలు లోపాలు బయటపడగా తాజా ఇదే తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఐఆర్‌సీటీసీకి చెందిన ఓ వీఐపీ లాంజ్‌లో భోజనం చేయగా.. రైతా అనే మజ్జిగ పానియంలో బతికి ఉన్న జెర్రి కనిపించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అతడి పోస్ట్ వైరల్‌గా మారింది.
ఐఆర్‌సీటీసీకి (IRCTC) చెందిన ఒక వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో భోజనం చేసిన ఓ వ్యక్తికి ఒళ్లంతా వెగటు పుట్టించే అనుభవం ఎదురైంది. ‘రైతా’లో (మజ్జిగ తయారు చేసిన పానియం) బతికి ఉన్న జెర్రిని గుర్తించి అతడు షాక్‌కు గురయ్యాడు. ఆరాయన్ష్ సింగ్ అనే వ్యక్తికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రైల్వేలో ఆహార భద్రత సమస్యను ప్రస్తావించాడు. భారతీయ రైల్వేలలో ఆహార నాణ్యత మెరుగుపడిందన్న వాదనలను ఖండిస్తున్నానని ఆరాయన్ష్ సింగ్ చెప్పాడు. ‘‘అవును, భారతీయ రైల్వే ఆహార నాణ్యత నిజంగానే మెరుగుపడింది. ఇప్పుడు ఎక్కువ ప్రోటీన్లతో రైతాను అందిస్తున్నారు’’ అని వ్యంగ్యంగా క్యాప్షన్ ఇచ్చాడు.
కాగా అతడు షేర్ చేసిన ఫొటోలో డిస్పోజబుల్ గ్లాస్‌లోని పానియంలో జెర్రి అటు ఇటు కదులుతూ కనిపించింది. ఓ ఐఆర్‌సీటీసీ వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో తనకు ఈ షాకింగ్ అనుభవం ఎదురైందని, ఈ ఘటన ఆహార నాణ్యతపై భయానకమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని ఆరాయన్ష్ సింగ్ పేర్కొన్నాడు. వీఐపీ లాంజ్‌లోనే ఇలా ఉంటే ఇక సాధారణ రైళ్లు, ప్యాంట్రీ కార్లలో ప్రమాణాలు ఎలా ఊహించుకోవచ్చంటూ విచారం వ్యక్తం చేశాడు. కలుషిత ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని తోటి ప్రయాణికులను అతడు హెచ్చరించాడు.
కాగా ఆరాయున్ష్ సింగ్ ట్వీట్ వైరల్‌గా మారడంతో ఈ పోస్టుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది. ‘‘సార్, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకునేందుకుగానూ మీ బుకింగ్ వివరాలు, స్టేషన్ పేరు, మొబైల్ నంబర్‌ను దయచేసి షేర్ చేయండి’’ అని ఐఆర్‌సీటీసీ కోరింది.
కాగా భారతీయ రైల్వేలలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని ఆరాయున్షు సింగ్‌కు పలువురు సూచించారు. అమ్మానాన్నలు అందుకే ఎప్పుడూ ఇంటి దగ్గర చేసిన ఆహారాన్నే తీసుకెళ్తారని, ఈ విషయంలో ఆశ్చర్యమేమీ కలగడంలేదని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
మరొక వ్యక్తి స్పందిస్తూ.. రైల్వే ప్రయాణికుల పరిశుభ్రత ప్రధాన సమస్యగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంకో అతను స్పందిస్తూ.. ‘‘అయ్యో దేవుడా.. ఇది మరీ దారుణం. రైల్వేలలో ఆహారాన్ని తీసుకునేటప్పుడు జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. సర్వింగ్ చేసేవాళ్ల నుంచి ఆశించకుండా మీరు తెలుసుకొని జాగ్రత్త వహించాలి’’ అని సూచించాడు. చివరిగా మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘ డ్యూడ్!.. ఇంతకీ మీరు పూర్తి చేశారా?. గ్లాస్ దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. ఈ ఫొటో చూసి నేను ఇక్కడ పుక్కిలించాను’’ అని పేర్కొన్నాడు.