Positive Thinking: ఏదో చేద్దామనుకుంటారు.. ఏమీ చేయకుండానే నిరాశపరుస్తారు.. అసలు కారణం అదేనా
ABN , Publish Date - Dec 08 , 2024 | 09:49 AM
ప్రతి రోజు లేదా గంటకో కల కంటుంటారు. మరుసటిరోజు మరో కల కంటారు. వారి జీవితమంతా ఇలా కలలు కనడమే అవుతుంది. అటువంటి వారి జీవితాలనే చరిత్రలో ఫెయిల్యూర్ స్టోరీస్ అంటుంటారు. నేటి సమాజంలో సక్సెస్ స్టోరీస్‌తో పాటు ఎన్నో ఫెయిల్యూర్ స్టోరీస్ చూస్తుంటాం. రెండింటి నుంచి ప్రతి వ్యక్తి కొన్ని అనుభవాలను..
ప్రతి వ్యక్తి లేదా సమూహం ఏదో చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొందరు వ్యక్తులు కలలు కంటుంటారు. ఆశలను, కలలను నెరవేర్చుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. ఎవరైతే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధనలో విజయం సాధిస్తారో వారి గురించి ఈ సమాజం చర్చించుకుంటుంది. అటువంటి వారి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. కొందరు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. వాటిని సాధించడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు. ప్రతి రోజు లేదా గంటకో కల కంటుంటారు. మరుసటిరోజు మరో కల కంటారు. వారి జీవితమంతా ఇలా కలలు కనడమే అవుతుంది. అటువంటి వారి జీవితాలనే చరిత్రలో ఫెయిల్యూర్ స్టోరీస్ అంటుంటారు. నేటి సమాజంలో సక్సెస్ స్టోరీస్‌తో పాటు ఎన్నో ఫెయిల్యూర్ స్టోరీస్ చూస్తుంటాం. రెండింటి నుంచి ప్రతి వ్యక్తి కొన్ని అనుభవాలను నేర్చుకుంటూ ఉంటారు. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని సరైన మార్గంలో లక్ష్య సాధన కోసం ప్రయత్నించే వ్యక్తులు విజేతలైతే.. ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా అవతలివారి జయపజయాలను ఎగతాళి చేసే వ్యక్తులు చేతకానివారిగా ముద్ర వేయించుకుంటారు. ఓ వ్యక్తి తన సామర్థ్యాన్ని ఎక్కువుగా అంచనావేసుకుని కొన్నిసార్లు విఫలమైతే మరికొన్నిసార్లు తన సామర్థ్యాన్ని తక్కువుగా అంచనా వేసుకుని విఫలమవుతూ ఉంటారు. తన సామర్థ్యాన్ని సక్రమంగా అంచనా వేసుకోవడమే ప్రతి వ్యక్తి జీవితానికి అసలు సిసలు పరీక్ష.
అవతలి వ్యక్తిపై అంచనాల విషయంలో..
ఓ వ్యక్తి విజయం అతడి సాధన, ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో అదృష్టం అనేది కొంతమేరకు ప్రభావం చూపిస్తుంది. కేవలం అదృష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు జీవితంలో సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఉదాహరణకు క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాడి ఆటతీరుపై టీవీలో లేదా మైదానంలో మ్యాచ్ చూస్తున్న వ్యక్తులు ఓ అంచనా వేస్తుంటారు. పలాన జట్టు ఎంత స్కోర్ చేస్తుందనేదానిపై అంచనాలు వేసి కొందరైతే బెట్టింగ్ కడతారు. మైదానం యొక్క స్థితిగతులు, ఆ సమయంలో ఆటగాళ్ల ఆత్మస్థైర్యం, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఓ అంచనాకు వస్తుంటారు. ఓ జట్టు ఎంత స్కోర్ చేస్తుంది, ఏ జట్టు గెలుస్తుందనేది ఆటగాళ్ల యొక్క సామర్థ్యం, ఆ సమయంలో వారి యొక్క ఆటతీరుపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు అపజయాన్ని విజయంగా మార్చుకున్న జట్లు ఎన్నో ఉన్నాయి. అంచనా వేసే వ్యక్తి అదృష్టాన్ని నమ్ముకుని మాత్రమే అంచనా వేస్తారు. ఆడే వ్యక్తులు మాత్రమే తమ జయపజయాలను నిర్ణయించుకోగలుగుతారు. అందుకే ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు, అనవసర సవాలు చేయడం జీవితంలో మంచిది కాదని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు.
సంకల్ప బలం..
ఓ వ్యక్తి విజయపజయాలు ఆ వ్యక్తి సంకల్ప బలంపై ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా తాను అనుకున్నది సాధించాలనే పట్టుదల, దానికి తగిన కృషి తప్పనిసరి. సరైన సంకల్పం లేకుండా ఏదో ఒకటవుతుందిలే అనే ధీమాతో ఉండేవారు విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో సంకల్పం అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏదో సాధిస్తా అంటూ మాటలు చెప్పి.. సంవత్సరాలు గడుస్తున్నా ఏమి చేయని వ్యక్తులు ఎందరో కనిపిస్తుంటారు. అందుకే సామర్థ్యానికి మించిన మాటలు మంచిది కాదనే విషయాన్ని గ్రహించడం తప్పనిసరి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here