పెరుగన్నం, ఉల్లిపాయలు... రోజూ తింటే?
ABN , Publish Date - Aug 25 , 2024 | 10:27 AM
నాకు రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రెండు పూటలా పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు. ఇలా తినడం మంచిదేనా? ఉల్లి వల్ల ప్రయోజనాలు తెలపండి.
నాకు రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రెండు పూటలా పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు. ఇలా తినడం మంచిదేనా? ఉల్లి వల్ల ప్రయోజనాలు తెలపండి.
- లత, మధిర
పెరుగన్నంలో లేదా పెరుగు పచ్చడిలో ఉల్లిని తినడం ఆరోగ్యప్రదమే. ఉల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ కాంపౌండ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వంద గ్రాముల ఉల్లిపాయల్లో కేవలం నలభై క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఉల్లి బరువులో తొంభై శాతం నీళ్ళే ఉంటాయి.
వీటిలో ఉండే ఫ్రూక్టాన్స్ అనే ఓ రకమైన పీచుపదార్థాల వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు ఉల్లి సహాయపడుతుంది. ఈ పీచుపదార్థం పెద్దపేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఇవే ఫ్రూక్టాన్ల వల్ల కొంతమందికి ఉల్లి తీసుకుంటే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనట్టయితే ప్రతి పూటా ఉల్లి తీసుకోవడం వల్ల ఇబ్బందేమీ ఉండదు. రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ సి పచ్చి ఉల్లిలో అధికం. వండినప్పుడు విటమిన్ సి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కానీ, ఫోలేట్, విటమిన్ బీ 6, పొటాషియం మాత్రం పచ్చి ఉల్లిలోనూ, వండిన ఉల్లిలో కూడా ఒకే విధంగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అంటే ఏమిటి? ఎటువంటివి తప్పనిసరిగా రోజూ తినాలి? ఎలాంటివి తినకూడదు? సమతుల ఆహారం గురించి వివరించండి.
- అభినవ్, సికింద్రాబాద్
సమతుల ఆహారం అంటే మన శరీరానికి అవసరమయ్యే పోషకపదార్థాలను తగు పాళ్ళలో అందించే ఆహారం. సమతులాహారం మనకు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, నీరు మొదలైన పోషకాలను అందించాలి. ఆహారం నుండి వచ్చే పోషకాలు, క్యాలరీలు మన శరీరంలోని అన్ని జీవవ్యవస్థలు సక్రమంగా పని చేయడానికి అవసరం. సగటు వ్యక్తికి రోజూ సుమారు 2,000 క్యాలరీలు అవసరం, అయితే ఈ మొత్తం వారి వయస్సు, జెండర్, శారీరక శ్రమ స్థాయిని బట్టి ఉంటుంది. మగవారికి ఆడవారి కంటే ఎక్కువ క్యాలరీలు అవసరమవు తాయి.
ఇంకా వ్యాయామం చేసేవారికి ఎక్కువ క్యాలరీలు అవసరం. అలాగే, గర్భిణులకు, బాలింతలకు అధిక క్యాలరీల ఆవశ్యకత ఉంటుంది. బాగా ఆటలాడే వారికి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా అవసరం. అదే శారీరక శ్రమ తక్కువగా ఉండి, ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారికి క్యాలరీలు, కార్బోహైడ్రేట్ల అవసరం కూడా తక్కువే. ఎదిగే పిల్లలకు ప్రొటీన్లు, క్యాల్షియం ఇంకా పలు రకాల విటమిన్లు అత్యవసరం. టీనేజీ దాటిన ఆడపిల్లలకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం అవసరం. ప్రత్యేకించి ఒక పోషకపదార్థం కోసం, అంటే కేవలం ప్రొటీన్ కోసం ప్రొటీన్ షేక్స్ తీసుకోవడం, విటమిన్ల కోసం కేవలం సప్లిమెంట్ల మీద ఆధారపడడం కాకుండా వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలపదార్థాలు దినసరి ఆహారంలో భాగం కావాలి.
నాకు 22 ఏళ్ళు. ఎప్పుడూ కాళ్ళు లాగుతూ ఉంటాయి. కడుపులో మంటగా కూడా ఉంటుంది. ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకొంటే మంచిది?
- సోను, హైదరాబాద్
సమయానుసారం ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలికంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, కొన్ని రకాల పోషక లోపాలు ఉండడం మొదలైన కారణాల వల్ల మీరు చెప్పే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారంలో ప్రొటీన్లు తగినన్ని లేనప్పుడు కండరాల్లో తగినంత శక్తి ఉండదు. అటువంటప్పుడు కాళ్ళ నొప్పులు రావడం, నీరసంగా అనిపించడం జరుగు తుంది. ప్రొటీన్ల కోసం మాంసాహారులైతే చికెన్, చేప, గుడ్లు మొదలైనవి తరచూ తీసుకోవాలి. శాకా హారులు పాలు, పాల పదార్థాలు, సెనగలు, రాజ్మా, అలసందలు, సోయా చిక్కుడు గింజల వంటివి తప్పని సరిగా రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. డి విటమిన్ తగ్గినపుడు కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. తగినంత డి విటమిన్ ఉత్పత్తి
కావాలంటే రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటు ఎండలో గడపాలి. రక్త పరీక్షల ద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయి తెలుసుకొని వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు వాడాల్సి రావొచ్చు. కడుపులో మంట ఎసిడిటీ వల్ల వచ్చినదైతే మసాలాలు, వేయించిన ఆహారం, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి పూర్తిగా దూరం ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే పడుకోకుండా కొద్ద్దిసేపు నడవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఒకే సారి ఎక్కువ ఆహారం తీసుకోలేకపోవడం వల్ల మీ బరువు ఉండవలసిన దానికంటే తక్కువ ఉన్నట్టయితే నిపుణుల సలహాతో ఈ సమస్యను కూడా అధిగమించవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)