Share News

Chinese Samosa: చైనా సమోసా! దీన్నెప్పుడైనా ట్రై చేశారా? నెట్టింట ఇప్పుడిదే హాట్ టాపిక్!

ABN , Publish Date - Jan 26 , 2024 | 03:46 PM

చైనా సమోసా బాగుండదంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Chinese Samosa: చైనా సమోసా! దీన్నెప్పుడైనా ట్రై చేశారా? నెట్టింట ఇప్పుడిదే హాట్ టాపిక్!

ఇంటర్నెట్ డెస్క్: సమోసా అంటే మనకు సాధారణంగా ఆలూ సమోసానే గుర్తొస్తుంది కానీ ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం నెట్టింట చర్చ అంతా చైనా సమోసా (Chinese Samosa) చుట్టూనే తిరుగుతోంది. దీన్ని విమర్శిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌తో పెద్ద చర్చే మొదలైంది.

ఏమిటీ చైనా సమోసా?

ఆలూకు బదులు నూడుల్స్‌తో చేసేదే చైనా సమోసా! అయితే, నూడుల్స్‌తో పాటూ ఇతర కూరగాయలు కూడా జత చేస్తారు. దీనికి తోడుగా ఘాటైన చట్నీ కూడా ఉంటే ఇక స్వర్గం అంచులను తాకినట్టే. అయితే, ఆలూ సమోసాకు వీరాభిమాని అయిన ఓ నెటిజన్ చైనా సమోసా ఫొటో ఒకదాన్ని పోస్ట్‌ చేశారు. ‘‘చివరకు ఎలాంటి రోజులు చూడాల్సి వస్తోందో!’’ అంటూ చైనా సమోసాపై తనకున్న అయిష్టతను ప్రదర్శించారు. భారతీయ వంటకాలకు ఇలాంటి మార్పులు అవసరమా? అని వ్యాఖ్యానించారు. ఇదే నెట్టింట పెద్ద దుమారాన్ని రేపింది.


అనేక మంది చైనా సమోసాకు మద్దతుగా నిలిచారు. టేస్టులో ఇది ఆలూ సమోసాకు ఏమాత్రం తీసిపోదంటూ తమ మద్దతు పలికారు. ‘‘చైనా, ఇండియా రుచుల కలయికతో చేసిన ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. నా స్కూలు రోజుల్లో కూడా దీన్ని తిన్నా, ఈ ఫొటోను చూడగానే నాటి రోజులు గుర్తొచ్చాయి. ఇది బాలేదని మీరు అనుకుంటే మీరు చాలా నష్టపోతున్నట్టే’’ అని ఓ నెటిజన్ సవివరంగా రాసుకొచ్చాడు. ఇది సాధారణ ఆలూ సమోసా కంటే 100 రెట్లు బాగుంటుందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

కాగా, అసలు సమోసా భారత్‌కు చెందని వంటకం కాదని మరో నెటిజన్ చెప్పుకొచ్చారు. ‘‘చైనా సమోసాపై చర్చే అనవసరం. ప్రస్తుతం మనం చూస్తున్న సమోసా మూలాలు పర్షియా వంటకంలో ఉన్నాయి. అప్పట్లో బంగాళదుంపకు బదులు మాంసాన్ని వాడేవారు’’ అని సదరు నెటిజన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తన వాదనకు రుజువుగా వికిపీడియాలోని సమోసాకు సంబంధించిన వ్యాసాన్ని కూడా పంచుకున్నాడు.

Updated Date - Jan 26 , 2024 | 05:16 PM