Share News

Indian Railways: రైల్వేనే హడలెత్తించిన ప్రయాణికుడు.. అసలు ఏం చేశాడో తెలుసా?

ABN , Publish Date - Feb 18 , 2024 | 10:28 PM

రైళ్లలో ప్రయాణం చేసేవారికి అప్పుడప్పుడు కొన్ని అసౌకర్యాలు కలుగుతుంటాయి. లోపల సేవలు సరిగ్గా లేకపోవడమో, సీట్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకోవడమో వంటివి జరుగుతుంటాయి. ఓ ప్రయాణికుడికి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. దీంతో.. అతడు రైల్వేకే చుక్కలు చూపించాడు.

Indian Railways: రైల్వేనే హడలెత్తించిన ప్రయాణికుడు.. అసలు ఏం చేశాడో తెలుసా?

రైళ్లలో ప్రయాణం చేసేవారికి అప్పుడప్పుడు కొన్ని అసౌకర్యాలు కలుగుతుంటాయి. లోపల సేవలు సరిగ్గా లేకపోవడమో, సీట్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకోవడమో వంటివి జరుగుతుంటాయి. ఓ ప్రయాణికుడికి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. దీంతో.. అతడు రైల్వేకే చుక్కలు చూపించాడు. తనను ఇబ్బంది పెట్టినందుకు గాను.. న్యాయపోరాటం చేసి మరీ రైల్వేపై ప్రతీకారం తీర్చుకున్నాడు. తనకు జరిగిన అన్యాయానికి వారి చేత జరిమానా వసూలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన పునీత్ జైన్ అనే వ్యక్తి 2018 ఆగస్టులో తనకు, తన కుటుంబానికి.. వైష్ణో దేవి నుంచి చండీగఢ్‌కి ‘శ్రీ వైష్ణో దేవి - కల్కా ఎక్స్‌ప్రెస్‌’లో సెకండ్ ఏసీ టిక్కెట్‌లను కొనుగోలు చేశాడు. ఒక్కో టికెట్‌కి రూ.2,560 చొప్పున వెచ్చించాడు. అయితే.. తన కుటుంబంతో కలిసి 2018 అక్టోబర్ 20న కట్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు అతని ఊహించని షాక్ తగిలింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వారి బెర్త్‌ను థర్డ్ ఏసీకి డౌన్‌గ్రేడ్ చేశారు. ఈ సమస్యని టీటీఈ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పరిష్కరించలేదు. దీంతో మరో దారి లేక వాళ్లందరూ థర్డ్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లోనే ప్రయాణించారు. తమకు సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సెకండ్ ఏసీ టిక్కెట్‌లను కొనుగోలు చేస్తే.. థర్డ్ ఏపీ కంపార్డ్‌మెంట్లో సీట్లు ఇవ్వడంతో వాళ్లు ఇబ్బందులు పడ్డారు.


సరే.. అయ్యిందేదో అయిపోయింది కాబట్టి.. సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ టిక్కెట్ మధ్య టికెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసానికి అనుగుణంగా తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని పునీత్ జైన్ కోరాడు. ఈ విషయంలో అతనికి తిరస్కరణ ఎదురవ్వడంతో.. సబ్ డివిజనల్ మేనేజర్‌కు ఈ-మెయిల్ చేశాడు. మొత్తం విషయాన్ని వివరించి.. తనకు న్యాయం చేయాలని కోరాడు. అప్పటికే చాలాకాలం అవ్వడంతో, ఈ సమస్యని పరిష్కరించలేమంటూ మేనేజర్ సైతం చేతులెత్తేశాడు. ఇలాగైతే ఈ ఇష్యూ తేలదని గ్రహించిన జైన్.. నేరుగా కమిషన్‌ని సంప్రదించాడు.

పునీత్ జైన్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్.. బెర్త్‌లను ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేసినందుకు గాను అతనికి రూ.10,000 మొత్తాన్ని చెల్లించాలని నార్తన్‌ రైల్వే, ఐఆర్‌సీటీసీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇది నార్తన్ రైల్వే, ఐఆర్‌సీటీసీల తప్పని తీర్పునిస్తూ.. రూ.1,005లను 2018 అక్టోబర్ 20 నుండి 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని కమిషన్ పేర్కొంది. అలాగే.. రూ.5,000 నష్ట పరిహారంతో పాటు మరో రూ.4,000 వ్యాజ్యం ఖర్చులు చెల్లించాలని తెలిపింది.

Updated Date - Feb 18 , 2024 | 10:28 PM