Share News

కరువు నుంచి కాపాడే ‘మండూక్‌’ మందిర్‌

ABN , Publish Date - Aug 25 , 2024 | 10:45 AM

వర్షాలు కురవకపోతే కప్పలను పూజించడం, వాటికి పెళ్లి చేసి ఊరేగించడం లాంటి ఆచారం గురించి అప్పుడప్పుడు వింటుంటాం... చూస్తుంటాం. కరువు కాటకాలతో సతమతమయ్యే కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. అయితే ఏకంగా కప్ప కోసం గుడి కట్టిన సందర్భం మాత్రం కచ్చితంగా విశేషమే.

కరువు నుంచి కాపాడే ‘మండూక్‌’ మందిర్‌

వర్షాలు కురవకపోతే కప్పలను పూజించడం, వాటికి పెళ్లి చేసి ఊరేగించడం లాంటి ఆచారం గురించి అప్పుడప్పుడు వింటుంటాం... చూస్తుంటాం. కరువు కాటకాలతో సతమతమయ్యే కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. అయితే ఏకంగా కప్ప కోసం గుడి కట్టిన సందర్భం మాత్రం కచ్చితంగా విశేషమే.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ జిల్లాలో ఓల్‌ అనే పట్టణం ఉంది. ఇక్కడే ‘మండూక్‌ మందిర్‌’ ఉంది. ఈ ఆలయం 200 ఏళ్ల పురాతనమైనదిగా చెబుతారు స్థానికులు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కరువు విలయతాండవం చేసేదట. వరదలు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను రక్షించేందుకు గానూ చహమనా రాజవంశానికి చెందిన రాజా భక్ష్‌ సింగ్‌ సాంప్రదాయబద్ధంగా కప్పలకు పూజలు చేసేవాడు. ఆ తర్వాత ఏకంగా వాటి కోసం ‘మండూక్‌ మందిర్‌’నే నిర్మించాడు.


ఈ పురాతన ఆలయం ముందే భారీ ఆకారంలో ఒక కప్ప ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే గుడిలోపల మాత్రం శివలింగం ఉంటుంది. నర్మదాకుండ్‌ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. అది ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉండడం ఈ గుడి మరో ప్రత్యేకత. అంతేకాదు... సాధారణంగా అన్ని ఆలయాల్లో శివుడి వాహనమైన నంది కూర్చున్న విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం నంది నిలబడి ఉంటుంది.

vari2.jpg

‘మండూక్‌ మందిర్‌’ను వంద అడుగుల ఎత్తులో అష్టాదళ తామర ఆకారంలో నిర్మించడం విశేషం. కప్ప సంతాన సాఫల్యానికి గుర్తు. సంతానాన్ని కోరుకునేవారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుందని విశ్వసిస్తారు. అలాగే మంచి ఆరోగ్యాన్ని, సంపదను పొందుతారంటారు. ప్రతీ ఏడాది శ్రావణమాసంతో పాటు దీపావళి, మహా శివరాత్రికి తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.


ఇది దేశంలోనే ఏకైక కప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వెళ్లాలనుకుంటే ముందుగా లఖింపూర్‌కు చేరుకొని, అక్కడ నుంచి బస్సు లేదా ట్యాక్సీలో 11 కి.మీ ప్రయాణించాలి. లక్నో విమానాశ్రయం లేదా రైల్వేస్టేషన్‌ చేరుకొని, లఖింపూర్‌ మీదుగా ‘మండూక్‌ మందిర్‌’ను చేరుకోవచ్చు.

Updated Date - Aug 25 , 2024 | 10:45 AM