Republic Day: గణతంత్ర దినోత్సవంలో ప్రధాని మోదీ జెండా ఎగరేయరు! ఇలా ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:55 PM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దీని వెనుక దశాబ్దాలుగా సాగుతున్న ఆనవాయితీ ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: మనం ఆగస్టు15న స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day), జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) జరుపుకుంటాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని కూడా అందరికీ తెలుసు. అయితే, ఆగస్టు15న ప్రధాని మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తే జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జాతీయ జెండా ఎగరేస్తారు. ఇలా ఎందుకనేది చాలా మందికి అంతుపట్టని అంశం. అయితే, దీని వెనకాల దశాబ్దాల నాటి ఆనవాయితీ ఉంది (Why Prime Minister Narendra Modi does not unfurl national flag on republic day).
స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత దేశ ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేస్తారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత భారీ పరేడ్ జరుగుతుంది. ఇక జెండా ఆవిష్కరణలోనూ కొన్ని మౌలిక తేడాలు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా కర్రకు దిగువభాగంలో కట్టిన త్రివర్ణ పతాకాన్ని తాడుతో పైకి లాగి ఆవిష్కరిస్తారు. వలస పాలన నుంచి భారత్ విముక్తి పొందిందనడానికి ఇది సంకేతం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కర్రకు ఎగువన కట్టిన ఉన్న పతాకాన్నే రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. అప్పటికే స్వాతంత్ర్యం పొందిన దేశంలో రాజ్యంగం అమల్లోకి వచ్చిందనేందుకు ఇది సంకేతం.
భారత దేశ స్వాతంత్ర్యోద్యమంలో జనవరి 26వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1930లో సరిగ్గా ఇదే రోజున తొలిసారిగా కాంగ్రెస్..పూర్తి స్వాతంత్ర్యమే తమ లక్ష్యమని ప్రకటించింది. దీంతో, స్వాతంత్ర్యం పోందాక రాజ్యాంగకర్తలు జనవరి 26న రాజ్యాంగాన్ని తొలిసారిగా అమల్లోకి తెచ్చారు.