Share News

Viral: చనిపోయాడంటూ డెత్ సర్టిఫికెట్.. బతికున్నానని నిరూపించుకోవడానికి..

ABN , Publish Date - Jul 25 , 2024 | 07:24 PM

బాలీవుడ్‌లో 2021లో ‘కాగజ్’ అనే ఒక సినిమా వచ్చింది. తాను చనిపోయినట్లు చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలుసుకున్న ఓ వ్యక్తి, తాను బతికే ఉన్నానని ప్రూవ్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల..

Viral: చనిపోయాడంటూ డెత్ సర్టిఫికెట్.. బతికున్నానని నిరూపించుకోవడానికి..
Viral News

బాలీవుడ్‌లో 2021లో ‘కాగజ్’ (Kaagaz) అనే ఒక సినిమా వచ్చింది. తాను చనిపోయినట్లు చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలుసుకున్న ఓ వ్యక్తి, తాను బతికే ఉన్నానని ప్రూవ్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల నేపథ్యంతో ఆ సినిమా తెరకెక్కింది. ఇది నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇప్పుడు అలాంటి సంఘటనే తాజాగా మరొకటి రాజస్థాన్‌లో వెలుగు చూసింది. కాకపోతే.. తన ఉనికిని నిరూపించుకోవడం కోసం ఈ వ్యక్తి ఓ భిన్నమైన మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కకపోవడంతో నేరాలకు పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..


డెత్ సర్టిఫికెట్

ఆ వ్యక్తి పేరు బాబురామ్ భిల్. రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లా, మిథోరా గ్రామంలో అతను నివాసముంటున్నాడు. కొంతకాల క్రితం బాబురామ్ తన పేరిట ఒక డెత్ సర్టిఫికెట్ అందుకున్నాడు. అది చూసి అతని ఫ్యూజులు ఎగిరిపోయాయి. తాను బతికుండానే డెత్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందంటూ ఖంగుతిన్నాడు. ఇక అప్పటి నుంచి తాను బతికే ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. అధికారులు చెప్పినట్లు చేశాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చట్టబద్ధంగా ఎంత పోరాటం చేసినా అతనికి న్యాయం దక్కలేదు. దీంతో.. బాబురామ్ తన రూటు మార్చాడు. నేరాలు చేసి వార్తల్లో నిలిస్తే.. అప్పుడైనా తాను బతికే ఉన్నానని నిరూపితం అవుతుందని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. నేరమార్గంలో అడుగులు వేయడం మొదలుపెట్టాడు.

కొన్ని రోజుల క్రితం బాలోత్రా జిల్లాలోని ఓ పాఠశాలలో కత్తులు, పెట్రోల్ బాటిల్‌తో బాబురామ్ భీభత్సం సృష్టించాడు. ఆ తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి తండ్రిపై మారణాయుధాలతో దాడి చేశాడు. అంతకుముందు కూడా పలు నేరాలకు పాల్పడ్డాడు. అతని పేరిట డజనుకుపైగా కేసులు నమోదు అయ్యాయి. చివరిసారిగా అతను ఓ ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసినప్పుడు.. పోలీసులకు చిక్కాడు. విచారణలో భాగంగా.. ఈ దాడులన్ని ఎందుకు చేశావని ప్రశ్నించగా, అతడు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం తన పేరిట ఓ డెత్ సర్టిఫికెట్ వచ్చిందని, తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడం కోసం ఎంతో ప్రయత్నించానని సమాధానం ఇచ్చాడు. కానీ.. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో, ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నానని తెలిపాడు.


ఆస్తులు దోచుకోవడానికే..

తన ఆస్తిని లాక్కోవడం కోసమే తాను చనిపోయినట్లుగా ఈ దొంగ సర్టిఫికెట్‌ని సృష్టించారని బాబురామ్ తెలిపాడు. పోలీసులు తనని అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే.. స్కూల్‌లో చొరబడి దాడులకి పాల్పడినట్లు సమాధానం ఇచ్చాడు. ఇలా చేస్తే.. ప్రభుత్వ రికార్డుల్లో తాను సజీవంగానే ఉన్నానని రుజువు అవుతుందని చెప్పుకొచ్చాడు. కాగా.. బాబురామ్ చేసిన కత్తి దాడిలో హరదయాళ్, సురేష్ కుమార్‌ అనే ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం.. వారిని జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 07:24 PM