Share News

కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు...

ABN , Publish Date - Dec 15 , 2024 | 07:30 AM

ఈనాడే... బాపూ, నీ పుట్టిన రోజూ... చిత్రజగతికే కొత్త సొగసు వచ్చిన రోజూ..’’ అని పాడుకోవాల్సిన రోజు! చిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు బాపు డిసెంబర్‌ 15, 1933 పశ్చిమగోదావరి జిల్లా.. నరసాపురం దగ్గర కంతేరులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ మద్రాసులో పెరిగినా.. స్థిరపడినా.. ఇంగ్లీషు నవల్లూ, సినిమాలూ, చూస్తూ ఎదిగినా.. తెలుగుదనాన్ని మరువలేదు బాపుగారు.

కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు...

‘ఈనాడే... బాపూ, నీ పుట్టిన రోజూ... చిత్రజగతికే కొత్త సొగసు వచ్చిన రోజూ..’’ అని పాడుకోవాల్సిన రోజు! చిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు బాపు డిసెంబర్‌ 15, 1933 పశ్చిమగోదావరి జిల్లా.. నరసాపురం దగ్గర కంతేరులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ మద్రాసులో పెరిగినా.. స్థిరపడినా.. ఇంగ్లీషు నవల్లూ, సినిమాలూ, చూస్తూ ఎదిగినా.. తెలుగుదనాన్ని మరువలేదు బాపుగారు. తెలుగుదనానికి పటం కట్టి, పట్టంకట్టి చూపెట్టిన సౌందర్యారాధకుడాయన! ఆయన చూపు.. సునిశితం! ఆయనభాష .. చమత్కారం! కనపడుతున్న వ్యక్తులలో అవకతవకల్ని అవహేళన చేయకుండా చమత్కారంగా గీసి విసిరిన చిత్రమే ఆరుద్రగారు పేరు పెట్టిన ‘కొంటె బొమ్మ’ - అదే ‘మన తెలుగు’లో .. కార్టూన్‌!


కార్టూన్‌ రంగంలో బాపు వేయని సబ్జెక్ట్‌ లేదు. కార్టూనింగులో ఆయన ముట్టుకోని అంశంగానీ చూడని కోణం గానీ లేవు అంటే.. ఏమాత్రం అతిశయోక్తి కాదు. నాబోటి కార్టూనిస్ట్‌ ఎవడైనా మంచి ఐడియా వచ్చిందనుకుని, బొమ్మ వెయ్యాలని కూర్చుంటే.. అది పెద్దాయన ఇంతకుముందు ఎప్పుడో వేసిందే అని తెలిసి దణ్ణం పెట్టేయడమే.. ఇది స్వానుభవమే!

బాపు ఎవరితోనైనా మాట్లాడుతుంటే వారు అడిగిన ప్రశ్నకి జవాబుగా రెండు మూడు భావాలు జవాబులుగా పుట్టుకొస్తాయి. వాటిని అణచుకొని అవసరమైన ఒక్క భావాన్నే పైకి ప్రకటించేవారు. మిగిలిన రెండూ వెటకారమో చమత్కారమో అయి ఉంటాయి. అంత స్పాంటేనియస్‌గా జోకులు ఆయనకి బుర్రలో ఎలా తట్టేస్తుంటాయో ఆశ్చర్యం వేస్తుంది. బాపు ఒకసారి వేసిన బొమ్మ


నచ్చక మరోసారి మళ్లీ మళ్లీ వేస్తుంటారు. మరోసారి వేస్తే బాగా వస్తుందేమో అని - అతి శ్రద్ధగా ప్రతీ లైను పట్టి పట్టి వేస్తారు. వేగంగా వచ్చే గీతని కూడా శ్రద్ధగా జారవిడుస్తారు. బొమ్మంతా అద్భుతంగా పూర్తి చేసినా అసంతృప్తిగా ‘ఇంతకన్నా రాదు’ అని కాంప్రమైజ్‌ అవుతారు. అలా

book2.3.jpg

బుడుగు ప్రతి ఎడిషన్‌కి బొమ్మలు మారుస్తూ మూడు నాలుగుసార్లు వేశారు. పౌరాణిక బొమ్మలు వేసేటప్పుడు అయితే ఆగమ శాస్త్రానికి సంబంధించిన శిల్పకళా దర్పణం, ప్రతిమా సముచ్ఛయం, లాంటి గ్రంథాలు రిఫర్‌ చేసి అతి శ్రద్ధగా బొమ్మ వేసేవారు. రాముడు శివ ధనుర్భంగం చేస్తున్న బొమ్మ రకరకాల సందర్భాలకి అనేక వందల సార్లు చిత్రీకరించారు. పట్టాభిషేకం లాంటి పెద్ద కంపోజింగ్‌లు కూడా చాలాసార్లు వేశారు. వేసిన ప్రతిసారి కొత్త అందాలతో కొత్త స్టైల్‌తో వీక్షకులని ఆశ్చర్యపరిచారు.


జనార్ధనాష్టకం, తిరుప్పావై, బొమ్మలు సన్‌ నెట్‌ లైన్లతో కలంతో వేశారు. శ్రీశ్రీ మహాప్రస్థానానికి వేసిన బొమ్మలు వాష్‌ అండ్‌ లైన్‌ టెక్నిక్లో అద్భుతంగా ఉంటాయి. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి ‘శివతాండవా’నికి బొమ్మలు బోల్డ్‌ బ్రష్‌ స్ట్రోకులుతో వేశారు. ముళ్ళపూడి వెంకటరమణగారి కథల పుస్తకాలకి దాదాపుగా ప్రతి ఎడిషన్‌కి కొత్త స్టైల్‌లో అట్ట మీద బొమ్మలు వేశారు. బాపుగారు బ్రష్‌ని ఎంత అందంగా నడిపిస్తారో కలంతో కూడా అంత కళనీ కురిపిస్తారు. అడిగినవారికి బొమ్మ వేసి పోస్ట్‌ చేసేసినా మర్నాడు మరో బొమ్మ వేసి ‘నిన్న వేసినబొమ్మ బాగోలేదు ఇది వేసుకోండి’ అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు డ్రైవర్‌ పెట్టుకున్న ఎఫ్‌ఎం రేడియోలో ‘అమ్మలాల బాపు బొమ్మలాల’ అనే సినిమా పాట వస్తోంది. డ్రైవర్‌ కూడా పాడుతున్నాడు. ఆ బొమ్మలు వేసిన బాపు తన పక్కనే కూర్చున్నారని ఆ డ్రైవర్‌కి తెలియదు. వెనకాల కూర్చున్న ఓ శిష్యుడు అడిగాడు.. ‘ఆ పాట విన్నప్పుడు మీకేమనిపిస్తుందండి’ అని! ‘‘టీవీ న్యూస్‌ లోలాగా స్పందన ఏమిటి అంటారా... (అని నవ్వి) కోపం రాదు నా పేరు వాడేస్తున్నారని వాళ్ళ మీద..!’’ అన్నారు నవ్వేస్తూ.

బాపుగారి లైఫ్‌ యాంబిషన్‌ కాఫీ టేబుల్‌ బుక్‌. అది తయారుచేస్తున్నప్పుడు నన్ను ముందు మాటలుగా నాలుగు లైన్లు రాయమంటే నేను రాసిన వాక్యాలివి... ‘‘బాపుగారు ఇంత గొప్పవారు కావడానికి కారణం... ఆయన లాప్టాప్‌/ కంప్యూటర్‌ వాడకపోవడం... ఆయనకి ఫొటోషాప్‌ రాకపోవడం... ఈ కటింగ్‌ పేస్టింగ్‌లు తెలియకపోవటం ...’’

- బ్నిం, 83414 50673

Updated Date - Dec 15 , 2024 | 07:30 AM