Viral: బ్రిటన్ ప్యాలస్‌లోని బంగారు టాయిలెట్ చోరీ.. దాని విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:58 PM
బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌కు చెందిన ఓ గోల్డ్ టాయిలెట్ చోరీకి గురైంది. బ్లెన్‌హీమ్ ప్యాలెస్ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.
బ్రిటన్ (Britain)లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌కు చెందిన ఓ గోల్డ్ టాయిలెట్ చోరీకి గురైంది. బ్లెన్‌హీమ్ ప్యాలెస్ (Blenheim Palace) చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ జన్మస్థలం ఇది. ఈ ప్యాలెస్‌లోని 18 క్యారెట్ల గోల్డ్ టాయిలెట్‌ను (Gold Toilet) 2019లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఉంచారు. దీని విలువ 4.8 మిలియన్ పౌండ్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లు. ఈ విలాసవంతమైన కమోడ్‌ను ప్రఖ్యాత ఇటాలియన్ కాన్సెప్టువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ రూపొందించారు (Viral News).
వెల్లింగ్‌బరోకు చెందిన జేమ్స్ షీన్ అనే వ్యక్తి ఈ టాయిలెట్‌ను దొంగతనం చేశాడు. అనంతరం పోలీసులకు దొరికిపోయాడు. ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో దొంగతనానికి పాల్పడినట్టు, ఆ చోరీకి కుట్ర పన్నినట్లు షీన్ తన నేరాన్ని అంగీకరించాడు. గతంలో కూడా షీన్ పలు విలువైన వస్తువులను చోరీ చేశాడు. నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి 400,000 పౌండ్ల విలువైన ట్రాక్టర్లు, ట్రోఫీలతో సహా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. దానికి గాను ఇప్పటికే 17 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాడు.
కాగా, గోల్డ్ టాయిలెట్ బ్రిటన్‌లోనే కాదు.. చైనాలో కూడా ఉంది. 2019లో, షాంఘైలో జరిగిన చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్‌పోలో హాంకాంగ్ స్వర్ణకారుడు వజ్రాలు పొదిగిన బంగారు టాయిలెట్‌ను ఆవిష్కరించాడు. ఈ ప్రత్యేక టాయిలెట్‌లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో తయారు చేసిన టాయిలెట్ సీటు ఉంది. ఇందులో 40,815 చిన్న వజ్రాలు ఉన్నాయి. ఆ టాయిలెట్ కూడా అప్పట్లో చోరీకి గురైంది.