Share News

ద్విముఖం

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:01 AM

మేనేజర్‌ రూమ్‌లోంచి వస్తూనే ఫైల్‌ టేబుల్‌ మీద పడేసి కుర్చీలో కూర్చుండి పోయింది వెన్నెల. ఆయన అన్న మాటలకు ఎదురు చెప్పలేకపోయినందుకు ఆమెకు తనమీద తనకే కోపం వచ్చింది. మిగిలినవాళ్లు తననే చూస్తుంటారని అనిపించి ఫైలు తెరిచి ముందేసుకుని కూర్చుంది కానీ అవమానంతో మనసు భగ్గున మండుతోంది.

ద్విముఖం

జి. లక్ష్మి

మేనేజర్‌ రూమ్‌లోంచి వస్తూనే ఫైల్‌ టేబుల్‌ మీద పడేసి కుర్చీలో కూర్చుండి పోయింది వెన్నెల. ఆయన అన్న మాటలకు ఎదురు చెప్పలేకపోయినందుకు ఆమెకు తనమీద తనకే కోపం వచ్చింది. మిగిలినవాళ్లు తననే చూస్తుంటారని అనిపించి ఫైలు తెరిచి ముందేసుకుని కూర్చుంది కానీ అవమానంతో మనసు భగ్గున మండుతోంది.

చిన్న తప్పుకే ‘ఏమ్మా ఎన్నాళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నావు? నీ సర్వీసెంత?’ అని అడుగుతున్నాడు. చెప్పేవరకూ వదిలిపెట్టలేదు. ఆయనకి తెలియదా తన సర్వీసు ఎంతో! ఆఫీసులో తను చేస్తున్న పని ఎంతో?!


అసలా ఫైలు పెట్టింది నీలిమ. తప్పు జరిగింది ఆమె దగ్గర. తర్వాత భాస్కర్‌కి, తర్వాత తన దగ్గరికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంకా ఒక గంట టైముందనగా ఫైలు అర్జెంటన్నారు. ఎప్పుడూ అంతే. ఫైవ్‌డేస్‌ వీక్‌ అని పేరేగానీ శుక్రవారం మధ్యాహ్నం నాలుగైదు ఫైళ్ళు పంపి ‘అర్జెంటు సోమవారం పొద్దుటికల్లా అయిపోవాలం’టారు. అంటే శనివారం ఆఫీసుకన్నా రావాలి. లేకపోతే ఫైళ్ళన్నా ఇంటికి పట్టుకెళ్ళాలి.

అంతకుముందు సెక్షన్‌లో పదిమంది ఉండేవారు. కొందరు రిటైరై, కొందరికి ప్రమోషన్‌ వచ్చి ఇప్పుడు నలుగురు మిగిలారు. ఆ పదిమంది చేసే పని ఇప్పుడు నలుగురు చేయాలి. ఒక్కళ్ళకి సెలవు ఇచ్చినా వర్కు పెండింగులో పడిపోతుంది.


అందుకని సెలవు కూడా అతి కష్టంమీద కానీ ఇవ్వరు.

ఉన్న నలుగుర్లో నీలిమ కబుర్లు చెప్పడం, ఫోన్‌లో కాలక్షేపం చెయ్యడం తప్ప సరిగా పనిచెయ్యదు. చేసిన పనిలో కూడా ఏదో ఒక తప్పు ఉంటూనే ఉంటుంది. నీలిమ భర్త ఏదో పేపరులో రిపోర్టరుగా చేస్తుంటాడు. నీలిమని మేనేజరైనా, ఎవరైనా చిన్న మాట అంటేచాలు... ఆయన ఆఫీసుకి వచ్చి గొడవ పెట్టేసుకుంటాడు. అందుకని నీలిమ జోలికి ఎవరూ వెళ్లరు.

భాస్కర్‌ ఎవరో రాజకీయ నాయకుడు తనకు దగ్గరి బంధువంటాడు. అది నిజమో కాదో ఎవరికీ తెలీదు. ఏదన్నా తేడావస్తే ఆయనతో మేనేజరుకి ఫోన్‌ చేయిస్తుంటాడు. పని బాగా చేయగలడు కానీ ఒళ్ళు వంగదు. ఆనంద్‌కు ఇరవై నాలుగ్గంటలూ మేనేజరును కాకాపట్టడం, ఆయన ఇంటికి సరుకులు, కూరగాయలు చేరవేయడంతోనే సరిపోతుంది.


ఇంక మిగిలింది తను. ఇక అన్నిటికీ తనే కనబడుతోంది ఆయనకి.

పనిచేయడానికి, విసుక్కోడానికి కూడా. అంతకు ముందు మైత్రి ఉన్నప్పుడు ఇదే పని చేస్తున్నా అంత బాధ అనిపించేది కాదు. ఇద్దరూ పని షేర్‌ చేసుకుని చేసుకుపోయేవాళ్ళు. కష్టం, సుఖం మాట్లాడుకోడానికి మైత్రి ఉండేది. మనసుకి ఏది బాధ కలిగించినా తనతో పంచుకునేది. మైత్రి ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్ళిపోయినప్పటి నుంచీ వెన్నెల ఒక రకంగా ఒంటరిదైపోయింది. ఆమెకు ఆఫీసుకి రావడం అంటే ఆసక్తి పోయి ఒకరకంగా విసుగు మొదలయింది.

శుక్రవారం ఇంటికి వెళ్ళబోయేముందు ఫైలు అర్జెంటంటే చిరాకు వస్తుంది. ఆ చికాకులో తనూ ఫైలు సరిగ్గా చూడలేదు. చిన్నతప్పు. దానికే ఎలా మాట్లాడుతున్నాడో!


వెన్నెలకు మనసంతా గజిబిజిగా చికాగ్గా అనిపించింది.

ఇంటికి వెళ్ళిన తర్వాత కిరణ్‌తో ఏమన్నా చెబుదామనుకుంటే ఏం చెబుతున్నా ఏంటో విచిత్రంగా చూస్తాడు. అంతా విని ‘ఉద్యోగం అంటే అంతే. అట్లాగే ఉంటుంది’ అని ఊరుకుంటాడు. ఇన్నేళ్ళ బట్టీ చూస్తున్నా కిరణ్‌ని ఎలా అనుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో అనేది కూడా అంతుబట్టని బ్రహ్మపదార్థంలానే ఉండిపోయింది వెన్నెలకి.

భర్తలు మూడు రకాలు. మంచివాళ్ళు, మధ్యస్థులు, అధములు. మొదటిరకం, చివరి రకంతో ఎలాంటి పేచీ లేదు. ఇక పేచీ అల్లా మధ్యరకంతోనే. వీళ్లు అటు మంచీకాదు, ఇటు చెడ్డాకాదు. సర్దుకుపోగలిగిన వాళ్లూ కాదు. అలాగని సర్దుకుపోలేని వాళ్ళూ కాదు. సగం అమావాస్య, సగం పౌర్ణమి. సగం చీకటి, సగం వెన్నెల.


అలాంటివాళ్ల కోవలోకి వస్తాడు కిరణ్‌. కిరణ్‌ని పెళ్ళి చేసుకున్నప్పటి నుంచీ అలాంటి వెన్నెలలూ చీకట్లూ చాలానే వచ్చి పోయాయి వెన్నెల జీవితంలోకి.

వెన్నెల నాన్న ఆమెకి ఏమంటూ ఆ పేరు పెట్టాడో కానీ వెన్నెలలాగానే ఆమె జీవితంలో కూడా వెన్నెల సగమే ఉండిపోయింది.

పెళ్ళయిన కొత్తలోనే ఆమెకి ఒక విషయం అర్థమయింది. కిరణ్‌ స్వతహాగా భయస్తుడు. ఏదీ గట్టిగా మాట్లాడలేడు. అడగలేడు. ఏదైనా కొనడానికి వెళితే తగ్గించి ఇమ్మని అడగడానికి కూడా మొహమాటం.

చివరికి అరటిపళ్ళు బేరం ఆడడానికి కూడా భయపడతాడు. అతనికి గొడవలంటే భయం. గొడవల కారణంగా వచ్చే అశాంతి, అభద్రత అంటే భయం. జీవితం ఎప్పుడూ భద్రంగా కోటగోడలా ఉండాలి.


ప్రశాంతమైన సరస్సులా ఉండాలి.

పొద్దున్నే లేచి కాసేపు వాకింగ్‌ చేసి, ‘టీ’ తాగి, ప్రశాంతంగా పేపరు చదువుకునే లాగా ఉండాలి. ఈ దినచర్యకు భంగం కలిగించేది ఏదీ కూడా అతనికి నచ్చదు. ఇరుగూ పొరుగుతో గొడవలు, పనివాళ్ళతో గొడవలు, ఆఫీసులో గొడవలు, బంధువులతో గొడవలు .. ఇవన్నీ కూడా ఆ దినచర్యకు భంగం కలిగించేవే.

అందుకే గొడవలన్నా, తగాదాలన్నా, అభిప్రాయభేదాలన్నా అతనికి భయం. భర్తలోని ఆ పిరికితనాన్ని, బలహీనతని వెన్నెల తేలిగ్గానే కనిపెట్టింది.

ఎప్పుడూ సరళరేఖలాగా, ఎలాంటి ఒడుదొడుకులు, వాగ్వాదాలు లేకుండా ఉండడం ఎలా సాధ్యం? అలా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది?

అతని మూలంగా నిజానికి ఆమెకి ఏ సమస్యా లేదు. అలాగని ఏ ఉపయోగమూ లేదు. అతను ఉన్నట్టూ కాదు, లేనట్టూ కాదు. ఈ ఉండీలేనితనమే ఆమెకి సమస్య. అదే ఆమెను కూడా పిరికిదాన్ని చేస్తోంది.


అతను ఎవరితో దేనికీ గొడవపడడు. గొడవ పడాల్సిన విషయాలకు కూడా గొడవపడడు. వెన్నెలను కూడా దేనికీ గొడవ పడనివ్వడు. ఎందులో జోక్యం చేసుకోనివ్వడు. అన్నిటికీ సర్దుకుపోవడమే. ఆఫీసులో మేనేజరు నీలిమని ఏమన్నా అంటే నీలిమ భర్త వచ్చి ఆయనతో గొడవ పెట్టుకుంటాడని అందుకే మేనేజరు నీలిమని ఏమీ అనడని, ఆమెని అనాల్సినవి కూడా తననే అంటాడని ఒకసారి చెప్పింది.

‘‘ఛీఛీ ఇదేమన్నా బడా! టీచరు తిట్టాడని కొట్టాడని అమ్మా నాన్నల్ని వెంటపెట్టుకు రావడానికి. నీలిమ తరఫున అతను వచ్చి పోట్లాడడం ఏంటి అసహ్యంగా? ఆ అమ్మాయికి ఆ మాత్రం ఇండివిడ్యువాలిటీ లేదా? ఆఫీసుల్లో చికాకులు ఇంటివరకూ తీసుకురావటం ఏంటి?’’ అంటూ చికాకుపడ్డాడు.


వినగానే మొదట అది నిజమేనని తనకూ అనిపించింది. కానీ ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నట్టు దాని వెనుక అతని ముందు జాగ్రత్త అర్థమై తర్వాత నవ్వొచ్చింది. ఆ తర్వాత అతనికి ఆఫీసు విషయాలు చెప్పడం తగ్గించింది.

అంతకుముందు ఒకసారి మేనేజరుతో ఇలానే చిన్న గొడవ అయింది. అది కిరణ్‌తో చెబితే ‘నేను చెబుతూనే ఉన్నానుగా ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని. ఇప్పుడు చూడు ఎవళ్లో ఒకళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుని అడుక్కోవాలి. నీకు ఎంత చెప్పినా అర్థంకాదు’ అంటూ విసుక్కున్నాడు.


జరిగిన దానిలో తన తప్పులేదు.

అతను ఆ విషయం గ్రహించకుండా ఎదురు తననే తప్పుపట్టడంతో వెన్నెలకు ఒక విషయం అర్థమయింది. ఆఫీసులో ఏదైనా గొడవ అయితే దానికి కిరణ్‌ సపోర్ట్‌ ఉండదు. అది తనకు తనే పరిష్కరించుకోవాలి అని. ఆఫీసులో చికాకులు తెచ్చి కిరణ్‌ నెత్తిన వేయాలని వెన్నెలకూ ఉండదు. తను చెప్పేది ప్రశాంతంగా విని ..

‘అయితే ఇట్లా చేయి, పోనీ అట్లా చేద్దాం’ అనే సలహా, సపోర్టు ఉంటే చాలు అనేది ఆమె ఆశ.

అదే ఆమెకు దొరకడం లేదు.

కొత్త మేనేజరు వచ్చినప్పుడు అతను అంత మంచివాడు కాదని పాతబ్రాంచీలో ఇద్దరు ముగ్గుర్ని సస్పెండ్‌ చేయించి వచ్చాడంట అని చెప్పినప్పుడు ‘ఎందుకైనా మంచిది వాడితో జాగ్రత్తగా ఉండు. ఏదైనా అయితే ఆ తిప్పలు మనం పడలేం’ అని కిరణ్‌ అనడం చూసి ఆమెకు విరక్తిగా అనిపించింది. ఆ క్షణంలో అతని మొహం చూస్తే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దానిని సరిచేసుకోవడానికి తను మేనేజరుతో ఒకరాత్రి గడపాల్సి వచ్చినా అతనికి అంత అభ్యంతరం ఉండకపోవచ్చని ఆమెకు ఎందుకో అనిపించింది.


కిరణ్‌ గురించి దుర్మార్గంగా ఆలోచిస్తున్నానా అని ఒక్క క్షణం అనిపించినా అందులో ఎంతోకొంత నిజం లేకపోలేదని గుర్తించాల్సి రావడం కూడా ఆమెకు బాధనిపించింది.

వెన్నెలకు హఠాత్తుగా చిన్నప్పుడు తమ ఇంటిపక్క ఉండే అబ్బాయి గుర్తుకువచ్చాడు. అతను కాలేజీలో చదువుకుంటూ గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. విద్యార్థుల్ని పోగుచేసి రోడ్లమీద నినాదాలు చేస్తూ తిరగడం, గోడలమీద పోస్టర్లు అంటించడం చేస్తుండేవాడు. ఒకసారి వాళ్ళతో పాటు తనూ వస్తానని వెంటపడింది. చేతికి ఏదో జెండా ఇచ్చి పట్టుకోమన్నాడు.

‘దున్నేవాడిదే భూమి’

‘తిరగబడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్ళు తప్ప’

అంటూ వాళ్లు నినాదాలు చేస్తుంటే అదేమిటో తెలియకపోయినా తనూ ఉత్సాహంగా గొంతుపోయేలా నినాదాలు చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చీపురుకట్ట పట్టుకుని ‘నీకు ఇదేంపోయేకాలమే. ఆడపిల్లవి అయి ఉండీ రోడ్లమీద జెండాలు పట్టుకుని తిరుగుతావా? మీ నాన్నకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా?’’ అంటూ చితకబాదింది.


తర్వాత అతన్ని ఒకసారి అడిగింది ‘అట్లా జెండాలు పట్టుకుని రోడ్లమీద అరుస్తూ తిరిగితే ఏం వస్తుంది మామా?’ అని.

‘మీ అమ్మ నీకు నచ్చని పని ఏదన్నా చేసిందనుకో. ఆ పని నచ్చలేదని చెబుతావా? చెప్పవా? ఇది కూడా అంతే. ఆ పని నచ్చలేదని చెప్పడం. నీకు నచ్చనిది నచ్చలేదని చెప్పగలగాలి పాపా’ అన్నాడు. అప్పుడు అతను చెప్పింది ఎందుకో అలా గుర్తుండిపోయింది.

అమ్మ ఎప్పుడూ ఒక మాట అంటుండేది ...

‘ప్రపంచంలో మన పక్కన ఎవరున్నా లేకపోయినా ఫరవాలేదు. ఒక్క భర్త సపోర్టు ఉండి అతను మన వెంట ఉంటాడనుకుంటే ఈతరాకపోయినా సముద్రాన్ని ఈదగల శక్తి వస్తుంది ఆడవాళ్లకి’ అని. అమ్మకి ఆ ఆశ లేదు.

నాన్నకు విపరీతమైన కోపం. ఎందుకు వస్తుందో దేనికి వస్తుందో తెలీని పిచ్చి కోపం. ఎప్పుడూ ఎవళ్ళతో ఒకళ్ళతో గొడవలు, తన్నులాటలు.


అమ్మ భయపడుతూ భయపడుతూ ఇంట్లో కూడా ఎప్పుడూ ఏదో పోలీస్‌స్టేషనులో ఉన్నట్టే ఉండేది. నాన్న కోపం పుణ్యమాని రెండు మూడు నెలలకోసారన్నా పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కాల్సి వచ్చేది. మామయ్య వస్తే మామయ్య, మామయ్యకి కోపం వచ్చి రానంటే అమ్మా, తనూ... పోలీస్‌స్టేషను వరండాలో గబ్బిలాల్లా వేలాడుతూ ఉండాల్సి వచ్చేది.

హాస్పిటళ్ల వరండాల్లో, కోర్టుల వరండాల్లో, పోలీస్‌ స్టేషన్ల వరండాల్లో వేలాడే వాళ్ళందరి మొహాలు అదేంటో చిత్రంగా ఒకేలా ఉంటాయి. దీనంగా దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్టు, దిక్కుతోచనట్టు, సాలెగూటిలో చిక్కుకున్న పురుగుల్లా గిలగిలలాడుతున్నట్టు ఉంటాయి. అంతకన్నా శ్మశానాలు నయం. అక్కడ ఏదో ఒక క్లారిటీ ఉంటుంది.

పోలీస్‌స్టేషన్లు, హాస్పిటళ్ళు, కోర్టులు .. అక్కడ చావూ ఉండదు, బతుకూ ఉండదు. బతుకు భయం ఒక్కటే ఉంటుంది. త్రిశంకుస్వర్గంలో వేలాడడం ఒక్కటే ఉంటుంది. ఏదీ తెగడం ఉండదు. ఊరగాయ పచ్చడిలా ఏదైనా ఊరి ఊరి నానడం ఒక్కటే ఉంటుంది. నాన్న బతుకు సగం పోలీస్‌స్టేషన్లలోనే నాని నాని ఉబ్బిపోయింది.


నాన్న ఉన్నంతవరకూ అమ్మ మొహం ఏదో దేన్నో బలవంతంగా అణచిపెట్టుకున్నట్టు అలజడిగా ఉండేది. నాన్న చనిపోయినందుకు అమ్మ సంతోషించకపోయినా చిత్రంగా అమ్మ మొహంలో ఆ అలజడి పోయి తేటపడింది. కానీ బతుకు భయం పట్టుకుంది.

‘ఎందుకైనా మంచిది’ అనేది ఆమె ఊతపదమైపోయింది.

‘ఎందుకైనా మంచిది. అసలే నాన్న కూడా లేడు. ఎవ్వరితో గొడవలు పెట్టుకోకు.’

‘ఎందుకైనా మంచిది కాలేజీ వదలగానే తిన్నగా ఇంటికి వచ్చెయ్‌.’

‘ఎందుకైనా మంచిది మీ ఆయనకు ఎదురు చెప్పకు’

పెద్ద బాలశిక్షలా ఈ ‘ఎందుకైనా మంచిది’ వినివిని వెన్నెలకు విసుగు పుట్టిపోయింది.

‘ఎందుకైనా మంచిది’ అనే పదం వెనుక ఉన్న పిరికితనం, బానిసత్వం అర్థమయింది.

పెళ్ళయి ఇప్పటికి పదేళ్లు. పిల్లలు పుట్టడం లేదని ఆ మధ్య డాక్టరు దగ్గరికి వెళితే ‘ఇష్టం లేని పని ఏమన్నా చేస్తున్నారా? జాబ్‌లో టెన్షన్‌ కానీ వత్తిడి కానీ ఉంటుందా?’ అని అడిగింది.


ఇష్టం లేని పని ఏం చేస్తోంది తను? అప్పుడు గుర్తొచ్చింది. సప్రెషన్‌, అణచివేత, తన కోపాన్ని, వ్యతిరేకతని అణచిపెట్టుకుంటోంది. ఆ కారణంగా టెన్షన్‌ పడుతోంది. డాక్టరుకి ఆ విషయం చెబితే అది తగ్గించుకోవాలని చెప్పింది. చెప్పినంత తేలికా తగ్గించుకోవడం?

‘ఎదవ సచ్చినోడు. ఎదవ సచ్చినోడు. ఆడి జిమ్మడ, ఆడి చేతులిరగ’ ఒక్కో తిట్టుకి ఒక్కో అంట్ల గిన్నెను నేలకేసి కొడుతుంటే నిన్న పనమ్మాయి దుర్గని అడిగింది ‘ఎవరిని తిడుతున్నావు దుర్గా? ఏమయింది?’ అని.

‘ఇంకెవరినమ్మా. దొంగచచ్చినోడు. నా మొగుడు ముండా కొడుకుని. తాగడానికి ఆడి డబ్బులు చాల్లేదని ... నా డబ్బులు అడిగాడు. ఇవ్వనన్నానని కొట్టాడు. నేనూరుకుంటానా? నేనూ నాలుగు తగిలించాను’ అంది మోచేతి దెబ్బని చూసుకుంటూ.


‘మీ ఆయన్ని కొట్టావా?’ నమ్మలేనట్టు అడిగింది.

పేపరు చదువుకుంటూ అక్కడే ఉన్న కిరణ్‌ చురుక్కున చూశాడు.

‘ఆఁ... కొట్టక? ఆడు పది దెబ్బలు కొడితే వొడుపు చూసి ఓ నాలుగైనా వెయ్యలేకపోతానా?’ అంది దుర్గ ధీమాగా.

వెన్నెలకు కిరణ్‌ మొహం చూడడానికి కూడా ధైర్యం చాలలేదు.

తర్వాత చిన్నగా వంగి రహస్యం చెబుతున్నట్టు ‘ఏదో పెద్ద మొగాళ్లు అనుకుంటాం కానీ ఏమీ కాదమ్మా’ అంది గుసగుసగా దుర్గ.

ఆ క్షణంలో దుర్గ ఆమెకి ఎర్రజెండా పట్టుకుని ‘తిరగబడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్లు తప్ప’ అంటున్నట్టు అనిపించి భయం వేసింది.

అప్పుడు భయం వేసినా దుర్గ మాటల్ని ఆమె చెప్పిన రహస్యాన్ని గుర్తుచేసుకుంటే నవ్వొచ్చింది వెన్నెలకి.


‘నీచేతను నాచేతను వరమడిగిన కుంతిచేత’ అని కర్ణుడి చావుకి కారణాలున్నట్టు, ఆడవాళ్ళు నోరెత్తకుండా చేయడానికి భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, చుట్టూ ఉన్న సమాజం, ఆర్థిక భద్రత, ఎందుకైనా మంచిదనే పెద్దబాలశిక్ష ... ఇన్ని వ్యవస్థలు ఉన్నాయా అనిపించింది.

తన పెద్దమ్మలు, అత్తయ్యలు, పిన్నిలు, వాళ్ళ పిల్లలు ... వాళ్లందరి జీవితాలతో పోల్చి చూసుకుంటే వాళ్లందరూ ఎంతోకొంత ఇష్టంలేనివి ఇష్టంలేదని చెప్పగలుగుతున్నారు. నచ్చనివి నచ్చలేదని చెప్పగలుగుతున్నారు. వాళ్ళలో ఉద్యోగం ఇచ్చే ఆర్థిక భద్రత లేనివాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళకు వచ్చే గొడవలకు ప్రధాన కారణం డబ్బు. పెద్దమ్మ కూతుళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళే. కూతుళ్లవి, వాళ్ళ భర్తలవి ఎవళ్ళ డబ్బులు వాళ్ళవే. వెయ్యిరూపాయల కరెంటు బిల్లు కట్టడానికి కూడా నీ డబ్బులు నా డబ్బులు అని వంతులు వేసుకుంటారు.


అదృష్టం కొద్దీ తనకు అలాంటి చికాకులు లేవు. ఇద్దరి జీతాలు కలిపి అన్ని ఖర్చులూ మేనేజ్‌ చేసుకుంటారు. తను తెచ్చే జీతం ఇంట్లోకి వాడుతున్నప్పుడు, ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు అనే సౌకర్యాన్ని అనుభవిస్తున్నపుడు దాని తాలూకు సమస్యలు, గొడవలు నాకు సంబంధంలేదని పట్టించుకోకపోవడం ఏమిటనేది ఆమె బాధ. తనేమన్నా కావాలని గొడవలు పెట్టుకుంటుందా? ఎంత సర్దుకుపోయినా కొన్ని వచ్చి చుట్టుముడుతుంటాయి.

అతని ఉద్యోగంలో ఇలాంటి చికాకులు ఉండవు. అతని ఉద్యోగ స్వభావం అది. అతనికి చికాకులు ఉండవని అందరికీ అలా ఉండడం ఎలా సాధ్యం? చిన్న ఎమోషనల్‌ సపోర్ట్‌.

అది లేకపోబట్టే కదా ఎవరేమన్నా ఎదురు చెప్పలేక తగ్గి బతుకుతోంది?


తనది ఇంకా అదృష్టం. పిల్లలు లేరు.

వాళ్ల మూలంగా కలిగే టెన్షన్లు, సర్దుబాట్లు లేవు. తనకన్నా ఇంకా వత్తిడి ఉండీ, టెన్షన్‌ ఉండే ఉద్యోగాలలో, నైట్‌ షిఫ్ట్‌లలో పనిచేసే ఆడవాళ్ళున్నారు. సస్పెన్షన్లు, కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుని ఇబ్బంది పడే వాళ్ళున్నారు. వాళ్ల భర్తలు కూడా వాళ్ళ సంపాదన తాలూకూ సౌకర్యాలు అన్నీ అనుభవించి మీ సమస్యలు మీవే. మీ చావు మీరే చావండంటే వాళ్లకు ఎలా ఉంటుంది.

వీళ్ళకి ఉద్యోగం చేసే భార్యలు కావాలి కానీ వాటి తాలూకూ సమస్యలు అక్కరలేదు. కిరణ్‌తో ఏదన్నా వాదించడం అంటే చాలా కష్టం.

ఏదైనా గట్టిగా అడగటం మొదలుపెట్టగానే ఒక చూపు చూసి బైటకు వెళ్ళిపోతాడు. ఆ కోపం ఒక పదిహేను ఇరవై రోజులపాటు అలాగే ఉంటుంది. మాట్లాడడు, వండింది తినడు, పొద్దున్నే వెళ్లిపోయి ఏ అర్ధరాత్రికో వస్తాడు. ఇంకా గట్టిగా అడిగితే నాలుగు జతలు బట్టలు ఒక బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపోవడానికి బయలుదేరతాడు. ఎక్కడికో ఎప్పుడు వస్తాడో తెలియదు.


ఆ భయంతో ఆమె కిరణ్‌తో గొడవ పెట్టుకోవడమే మానేసింది. ఆ పిరికితనం చిన్నగా ఆఫీసుకూ పాకింది. ఇవాళ ఆయన ఫైలు టేబుల్‌ మీదకు విసిరికొట్టినపుడు అది తన మొహంమీదే విసిరికొట్టినట్టు అనిపించింది.

అప్పుడు తను ఏదన్నా అని ఉండాలి. అడగగలిగి ఉండాలి.

కిరణ్‌ మూలంగా నరనరాల్లో ఎక్కిన పిరికితనం ఏదన్నా అయితే రేపు ఎట్లా అనే పిరికితనం తనను నోరెత్తకుండా చేసింది. కనీసం ఆ దుర్గపాటి కూడా చేయలేదా తను?

‘నీకు నచ్చనిది నచ్చలేదని చెప్పగలగాలి పాపా’ వెన్నెల తలలో ఏదో హోరు.

ఆమె సీట్లోంచి లేచి మేనేజర్‌ గదిలోకి అడుగు పెట్టింది.

- 94907 35322

Updated Date - Oct 27 , 2024 | 11:01 AM