3rd Test IND VS ENG : వాళ్లూ మొదలెట్టారు
ABN , Publish Date - Feb 17 , 2024 | 04:57 AM
పిచ్ ఎలాంటిదైనా బజ్‌బాల్ గేమ్‌తో దూసుకెళ్లే ఇంగ్లండ్‌కు ఫ్లాట్ వికెట్ ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న ఎస్‌సీఏ స్టేడియంలో స్టోక్స్ సేన ఓవర్‌కు 6 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళుతూ ఔరా..

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 207/2
డకెట్ మెరుపు శతకం
భారత్ తొలి ఇన్నింగ్స్ 445
రాజ్‌కోట్: పిచ్ ఎలాంటిదైనా బజ్‌బాల్ గేమ్‌తో దూసుకెళ్లే ఇంగ్లండ్‌కు ఫ్లాట్ వికెట్ ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న ఎస్‌సీఏ స్టేడియంలో స్టోక్స్ సేన ఓవర్‌కు 6 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళుతూ ఔరా.. అనిపిస్తోంది. ఓపెనర్ బెన్ డకెట్ (118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 బ్యాటింగ్) సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగుతున్నాడు. స్వీప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్.. వాట్ నాట్ అనే తరహాలో స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా బ్యాట్ ఝుళిపిస్తూ అజేయ సెంచరీతో నిలిచాడు. దీంతో ఈ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 35 ఓవర్లలోనే 207/2 స్కోరుతో నిలిచింది. డకెట్ ఇన్నింగ్స్‌లో బౌండరీ రూపంలోనే 96 పరుగులు నమోదు కావడం విశేషం. పోప్ (39) సహకరించాడు. క్రీజులో డకెట్‌తో పాటు రూట్ (9 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. జడేజా (112) ఆరంభంలోనే వెనుదిరగ్గా.. ధ్రువ్ జురెల్ (46), అశ్విన్ (37), బుమ్రా (26) ఇంగ్లండ్ బౌలర్లను విసిగించారు. ఉడ్‌కు 4, రెహాన్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఆకట్టుకున్న జురెల్: 326/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ తొలి అర్ధగంటలోనే వరుస ఓవర్లలో కుల్దీప్ (4), జడేజా వికెట్లను కోల్పోయింది. కానీ తొలి సెషన్‌లో జట్టును అరంగేట్ర జురెల్-అశ్విన్ కాపాడారు. జురెల్ ఒత్తిడి లేకుండా ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడం ఆకట్టుకుంది. స్కోరు 400 దాటాక అశ్విన్, జురెల్‌లను స్పిన్నర్ రెహాన్ స్వల్ప తేడాలో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత చివర్లో బుమ్రా కాస్త దూకుడుగా ఆడి సిరాజ్‌తో పదో వికెట్‌కు 30 రన్స్ జోడించి ఉడ్ చేతిలో అవుటయ్యాడు.
డకెట్ సూపర్ సెంచరీ: మరో ఆరు ఓవర్లలో రెండో సెషన్ ముగుస్తుందనగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభమైంది. మొదటి 4 ఓవర్లలో డకెట్, క్రాలే (15) ఆచితూచి ఆడారు. ఇక చివరి సెషన్ తొలి ఓవర్ నుంచే డకెట్ గేరుమార్చి ఎదురుదాడికి దిగాడు. 14వ ఓవర్‌లో క్రాలేను అశ్విన్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిరాజ్ ఓవర్‌లో డకెట్ రెండు వరుస ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. చివరకు పోప్‌ను సిరాజ్ ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రూట్‌తో కలిసి డకెట్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
ఇంగ్లండ్‌కు ఎక్స్‌ట్రా రన్స్
భారత్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ కారణంగా ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో జత చేరాయి. దీంతో ఆ జట్టు బ్యాటింగ్‌కు దిగకుండానే ఖాతా తెరిచినట్టయ్యింది. 102వ ఓవర్‌లో అశ్విన్ ఆఫ్ సైడ్ దిశగా ఆడి పిచ్ మధ్య భాగం గుండా పరుగు కోసం వెళ్లి వెనక్కి వచ్చాడు. ఇది గమనించిన అంపైర్ వెంటనే భారత్ కు 5 రన్స్ పెనాల్టీ విధించాడు. ఎంసీసీ రూల్ ప్రకారం బ్యాటర్ ఏ కారణంతోనైనా పిచ్ పాడయ్యేలా ఇలా మధ్యలో నుంచి రన్ తీయకూడదు. ఇలా రెండుసార్లు చేస్తే పెనాల్టీ విధిస్తారు. తొలి రోజు ఆటలో జడేజా కూడా ఇలాగే చేయడంతో పెనాల్టీ తప్పలేదు.
భారత గడ్డపై ఒకే సెషన్‌లో 100+ పరుగులు సాధించిన తొలి విదేశీ బ్యాటర్‌గా డకెట్. అలాగే భారత్‌పై వేగంగా (88 బంతుల్లో) టెస్టు సెంచరీ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్. గ్రాహం గూచ్ (95 బంతులు) రికార్డు దాటాడు.
టెస్టు బౌలర్లలో అత్యధిక పరుగులు (18,371) సమర్పించుకున్న బౌలర్‌గా అండర్సన్. అనిల్ కుంబ్లే (18,355)ను అధిగమించాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రూట్ (బి) ఉడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) ఉడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) ఉడ్ 0; పటీదార్ (సి) డకెట్ (బి) హార్ట్‌లీ 5; జడేజా (సి అండ్ బి) రూట్ 112; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 4; జురెల్ (సి) ఫోక్స్ (బి) రెహాన్ 46; అశ్విన్ (సి) అండర్సన్ (బి) రెహాన్ 37; బుమ్రా (ఎల్బీ) ఉడ్ 26; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 130.5 ఓవర్లలో 445 ఆలౌట్. వికెట్ల పతనం: 1-22, 2-24, 3-33, 4-237, 5-314, 6-331, 7-331, 8-408, 9-415, 10-445. బౌలింగ్: అండర్సన్ 25-7-61-1; ఉడ్ 27.5-2-114-4; హార్ట్‌లీ 40-7-109-1; రూట్ 16-3-70-1; రెహాన్ 22-2-85-2.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి) రజత్ (బి) అశ్విన్ 15; డకెట్ (బ్యాటింగ్) 133; పోప్ (ఎల్బీ) సిరాజ్ 39; రూట్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 35 ఓవర్లలో 207/2. వికెట్ల పతనం: 1-89, 2-182. బౌలింగ్: బుమ్రా 8-0-34-0; సిరాజ్ 10-1-54-1; కుల్దీప్ 6-1-42-0; అశ్విన్ 7-0-37-1; జడేజా 4-0-33-0.