Share News

Ind vs Aus: నేను నాటౌట్‌గా ఉండాలనుకున్నా.. ఫాలో ఆన్ గురించి ఆలోచించలేదు: ఆకాశ్ దీప్

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:37 PM

గబ్బా టెస్ట్‌లో బౌలర్లు ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా పోరాడి ఆస్ట్రేలియాకు విజయాన్ని దూరం చేశారు. టీమిండియాను ఫాలో ఆన్ ఆడించి త్వరగా ఔట్ చేయాలని భావించిన ఆసీస్‌ను వీరు ప్రతిఘటించారు. బుమ్రాతో కలిసి ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు.

Ind vs Aus: నేను నాటౌట్‌గా ఉండాలనుకున్నా.. ఫాలో ఆన్ గురించి ఆలోచించలేదు: ఆకాశ్ దీప్
Akash Deep

ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన మూడో టెస్ట్‌లో (Gabba Test) టీమిండియా ఓటమి నుంచి బయటపడిన విధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో బౌలర్లు ఆకాశ్ దీప్ (Akash Deep ), జస్ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) అద్భుతంగా పోరాడి ఆస్ట్రేలియాకు విజయాన్ని దూరం చేశారు. టీమిండియాను ఫాలో ఆన్ ఆడించి త్వరగా ఔట్ చేయాలని భావించిన ఆసీస్‌ను వీరు ప్రతిఘటించారు. బుమ్రాతో కలిసి ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడి 31 పరుగులు చేశాడు. దాంతో ఆ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి గండం తప్పింది (Ind vs Aus Test Series).


ఆ మ్యాచ్‌లో తన అద్భుత ప్రతిభ గురించి తాజాగా ఆకాశ్ దీప్ మాట్లాడాడు. ``దేవుడి దయతో ఫాలో అన్ గండం నుంచి బయటపడ్డాం. లోయర్ ఆర్డర్‌లో మేం బ్యాటింగ్ చేసే సమయంలో ఫాలో ఆన్ గురించి ఆలోచించలేదు. 30 పరుగుల భాగస్వామ్యం అందించాలని మాత్రమే అనుకున్నాం. ఆస్ట్రేలియాలో ఆడడం నాకు అదే మొదటిసారి. బుమ్రా నాలో ధైర్యం నింపాడు. ఎక్కువగా ఆలోచించకుండా ఆడాలని సూచించాడు. ఆ పరిస్థితుల నుంచి మ్యాచ్ కాపాడుకోవడం మాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో జోష్ వచ్చింద``ని ఆకాశ్ దీప్ చెప్పాడు.


ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరగాల్సిన నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ ప్రాక్టీస్‌లో భాగంగా రోహిత్ శర్మ గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ గాయంపై కూడా ఆకాశ్ దీప్ స్పందించాడు. ``క్రికెట్‌లో గాయాలు సర్వ సాధారణం. అయితే రోహిత్‌కు అయిన గాయం పెద్దదేమీ కాదు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో రోహిత్ సత్తా చాటుతాడ``ని ఆకాశ్ దీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 22 , 2024 | 03:37 PM