అల్కారజ్ వన్స్‌మోర్!
ABN , Publish Date - Jul 15 , 2024 | 05:45 AM
బిగ్‌ఫైట్‌గా భావించిన వింబుల్డన్ ఫైనల్.. వన్‌సైడ్‌గా ముగిసింది. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన స్పెయిన్ యువ కెరటం, 21 ఏళ్ల కార్లోస్ అల్కారజ్ టైటిల్ నిలబెట్టుకొన్నాడు. గత టోర్నీ ఫైనల్లో ఓటమికి...
వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకొన్న కార్లోస్
ఫైనల్లో జొకోవిచ్ ఓటమి
ప్రైజ్‌మనీ
అల్కారజ్‌కు: రూ. 28 కోట్ల 35 లక్షలు
జొకోవిచ్‌కు: రూ. 14 కోట్ల 70 లక్షలు
సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికి : చెరి 7 కోట్ల 50 లక్షలు
21 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన అల్కారజ్..బోర్గ్, బోరిస్ బెకర్, మాట్స్ విలాండర్ సరసన చేరాడు.
లండన్: బిగ్‌ఫైట్‌గా భావించిన వింబుల్డన్ ఫైనల్.. వన్‌సైడ్‌గా ముగిసింది. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన స్పెయిన్ యువ కెరటం, 21 ఏళ్ల కార్లోస్ అల్కారజ్ టైటిల్ నిలబెట్టుకొన్నాడు. గత టోర్నీ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవడమే కాకుండా.. 8వసారి గ్రాస్ కోర్టులో నెగ్గి ఫెడరర్ రికార్డును సమం చేయాలనుకొన్న రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు మరోసారి నిరాశే ఎదురైంది. అలాగే 25వ టైటిల్‌తో చరిత్రలో నిల్చిపోదామనుకున్న జొకోవిచ్‌కు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో మూడో సీడ్ అల్కారజ్ 6-2, 6-2, 7-6(4)తో వరుస సెట్లలో జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన అతడు.. కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడాడు. మోకాలి ఆపరేషన్ చేయించుకొన్న 37 ఏళ్ల నొవాక్ మునుపటి తరహాలో అలరించలేక పోయాడు. పదేపదే అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకొన్నాడు. 2 గంటల 27 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో 42 విన్నర్లు కొట్టిన కార్లోస్.. 5 బ్రేక్‌పాయింట్లు సాధించాడు.
కాగా, జొకో 26 విన్నర్లు మాత్రమే కొట్టాడు. తొలిసెట్ మొదటి గేమ్‌లోనే నొవాక్ సర్వీ్‌సను బ్రేక్ చేసిన స్పెయిన్ బుల్ 2-0 ఆధిక్యం సాధించాడు. తర్వాత ఐదో గేమ్‌లో మరోసారి బ్రేక్ పాయింట్ సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకొన్నాడు. రెండో సెట్‌లోనూ అల్కారజ్ జోరు ముందు నిలవలేక పోయాడు. అయితే, మూడో సెట్‌లో మాత్రం నొవాక్ కొంతమేర పోటీ ఇచ్చాడు. అల్కారజ్ 5-4తో చాంపియన్‌షి్‌ప పాయింట్‌పై ఉన్నప్పుడు.. పోరాడి సర్వీ్‌సను నిలబెట్టుకొన్న నొవాక్ 5-5తో సమం చేశాడు. సెట్ ఫలితం టైబ్రేక్‌కు దారి తీయడంతో జొకో మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడని అభిమానులు ఆశించారు. టైబ్రేక్‌లో 3-3తో సమమైనా.. ఆ తర్వాత అల్కారజ్ జోరు చూపాడు. 6-4తో చాంపియన్‌షి్‌ప పాయింట్‌పై ఉన్నప్పుడు నొవాక్ రిటర్న్ నెట్‌కు తగలడంతో.. సంబరాలు చేసుకొన్నాడు.
రికార్డుల కుర్రాడు
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ నెగ్గిన పిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 70 రోజులు) అల్కారజ్ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతకుముందు బోర్గ్ (1978) 22 ఏళ్ల 32 రోజులు, నడాల్(2008) 22 ఏళ్ల 33 రోజుల వయసులో ఈ టైటిల్స్ నెగ్గారు.
పిన్న వయసులో వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న వారిలో మూడో ఆటగాడు అల్కారజ్. బోరిస్ బెకర్ (18 ఏళ్ల 227 రోజులు), బోర్గ్ (21 ఏళ్ల 26 రోజులు) ముందున్నారు.