T20 World Cup USA Team ; అమెరికా స్టార్లు మనోళ్లే !
ABN , Publish Date - Jun 08 , 2024 | 06:09 AM
మాజీ చాంపియన్ పాకిస్థాన్‌ను చిత్తు చేయడం ద్వారా ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య అమెరికా జట్టు పెను సంచలనం సృష్టించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు టాప్ బ్యాటర్లు,
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) : మాజీ చాంపియన్ పాకిస్థాన్‌ను చిత్తు చేయడం ద్వారా ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య అమెరికా జట్టు పెను సంచలనం సృష్టించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు టాప్ బ్యాటర్లు, బౌలర్లతో కూడిన పాకిస్థాన్‌కు షాకివ్వడంతో యూఎస్‌ఏపై అందరి దృష్టి నిలిచింది. ఇక ఆ జట్టు స్టార్ క్రికెటర్లంతా భారత మూలాలున్న వారే. దీంతో టోర్నీలో ఆడుతోంది ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ జట్టు కాదు.. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా’ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా జట్టులోని మనోళ్లపై ఓ లుక్కేద్దాం..
మోనంక్ పటేల్
అహ్మదాబాద్‌లో పుట్టిన మోనంక్ పటేల్ గుజరాత్ తరపున వివిధ వయస్సు గ్రూపుల క్రికెట్ ఆడాడు. మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వెళ్లిన అతడు..ఆ జట్టుకు ఎంపిక కావడమేకాదు కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. వికెట్ కీపర్, బ్యాటర్ మోనంక్ పటేల్ పాక్‌తో పోరులో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.
సౌరవ్ నేత్రావల్కర్
పాకిస్థాన్‌తో సూపర్ ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠను అదిమిపట్టి అద్భుత బౌలింగ్ చేసిన లెఫ్టామ్ పేసర్ సౌరవ్ నేత్రావల్కర్ .. 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్, ఉనాద్కట్, హర్షల్ పటేల్, సందీప్ శర్మతో కలిసి భారత్‌కు ఆడాడు. రంజీల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం అమెరికాలో ఎమ్మెస్ చేసి ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే క్రికెట్ కెరీర్ కొనసాగించి ఆ దేశ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
హర్మీత్ సింగ్
ఇతడు యువ భారత్‌కు ఆడిన క్రికెటరే. లెఫ్టామ్ స్పిన్నర్ అయిన హర్మీత్.. 2010, 12 అండర్-19 ప్రపంచ కప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిభావంతుడైన బౌలరే అయినా..క్రమశిక్షణా రాహిత్యంతో అవకాశాలను చేజార్చుకున్నాడు. అనంతరం అమెరికాకు వలస వెళ్లి క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు.
నోస్తుష్ కెంజిగే
ఆల్‌రౌండర్ కెంజిగే అమెరికాలో పుట్టాడు. వ్యవసాయ పరిశోధకుడైన అతడి తండ్రి భారత్ తిరిగి రావడంతో కెంజిగే క్రికెట్ కెరీర్‌కు భారత్‌లో అడుగులు పడ్డాయి. కర్ణాటకలో ఫస్ట్ డివిజన్ క్రికెట్ పోటీలు ఆడాడు. బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ చదివేందుకు అమెరికా వెళ్లిన కెంజిగే.. ఉద్యోగం చేస్తూనే క్రికెట్ ఆడుతూ జాతీయ జట్టులో స్థానం పొందాడు.
మిలింద్ కుమార్
ఢిల్లీ, సిక్కిం జట్ల తరపున రంజీలు ఆడిన మిలింద్.. క్రికెటర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు కొవిడ్‌కు ముందు అమెరికా వెళ్లి విజయవంతమయ్యాడు.
నితీష్ కుమార్
టాపార్డర్ బ్యాటర్ నితీష్ కుమార్ కెనడా జాతీయ జట్టు మాజీ కెప్టెన్. 2010 అండర్-19 ప్రపంచ కప్‌లో కెనడాకు ఆడిన అతడు..2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆ జట్టు తరపున పాల్గొన్నాడు. ఆపై అమెరికా వెళ్లి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
జస్దీప్ సింగ్
న్యూయార్క్‌లో పుట్టి గ్రామీణ పంజాబ్‌లో పెరిగిన జస్దీ్‌ప..తల్లిదండ్రులు తిరిగి అమెరికా వెళ్లడంతో అక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. కుడి చేతి వాటం పేసర్ అయిన జస్దీప్ 2015లో అమెరికా జట్టుకు ఎంపికయ్యాడు.