నిలకడే మంత్రంగా..
ABN , Publish Date - Jul 15 , 2024 | 05:26 AM
బిగ్-3 తర్వా త ఎవరు అనే ప్రశ్న చాలా కాలంగా అలాగే మిగిలి పోయింది. ఫెడరర్ రిటైర్ కాగా.. నడాల్, జొకోవిచ్ వీడ్కోలు అంచున ఉన్నారు. సరికొత్త హీరో ఎవరన్న ప్రశ్నకు కార్లోస్ అల్కారజ్ అనే సమాధానం వినిపిస్తోంది..
బిగ్-3 తర్వా త ఎవరు అనే ప్రశ్న చాలా కాలంగా అలాగే మిగిలి పోయింది. ఫెడరర్ రిటైర్ కాగా.. నడాల్, జొకోవిచ్ వీడ్కోలు అంచున ఉన్నారు. సరికొత్త హీరో ఎవరన్న ప్రశ్నకు కార్లోస్ అల్కారజ్ అనే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో కార్లోస్ అంతటి నిలకడ ఎవరిలోనూ కనిపించలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆట తీరును మార్చుకోవడం అతడి ప్రత్యేకత. వింబుల్డన్‌ను రెండోసారి నెగ్గడంతోపాటు.. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకొన్నాడు. పిన్నవయసులో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో సరికొత్త రికార్డు సృష్టించాడు. కార్లోస్ తండ్రి గొంజాలెజ్ టెన్నిస్ కోచ్ కావడంతో.. నాలుగేళ్ల వయసు నుంచే రాకెట్ పట్టాడు. 16 ఏళ్ల వయసులో ఏటీపీ టోర్నీ రియో ఓపెన్‌లో మెయిన్ డ్రాకు అర్హత సాధించిన అల్కారజ్.. ఆ తర్వాతి ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ ఎంట్రీ ఇచ్చాడు. 18 ఏళ్ల వయసులో టాప్-100లోకి దూసుకెళ్లిన కార్లోస్.. కెరీర్‌లో వేగంగా ఎదిగాడు. 2021 యూఎస్ ఓపెన్‌లో వరల్డ్ నెం:3 సిట్సిపా్‌సను ఓడించాడు.
2022 ఏప్రిల్‌లో టాప్-10లో చోటుదక్కించుకొన్న అతడు.. అదే ఏడాది యూఎస్ ఓపెన్‌లో కాస్పర్ రూడ్‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడాడు. 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్‌లో చుక్కెదురైనా.. ఆ తర్వాత వరుసగా రెండు టైటిళ్లతో సత్తాచాటాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో క్లే, గ్రాస్ కోర్టుల్లో విజేతగా నిలిచిన ఆరో ఆటగాడిగా అరుదైన ఘనతను అందుకొన్నాడు.