Share News

Rohit Sharma: రోహిత్ కావాలంటే ఏ జట్టైనా ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? అశ్విన్ చెప్పినది వింటే..

ABN , Publish Date - Oct 15 , 2024 | 02:27 PM

వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈ మెగా వేలానికి ముందు ఒక్కో జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతించింది. దీంతో ఏయే జట్లు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటాయి? ఎవరిని వదులుకుంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది.

Rohit Sharma: రోహిత్ కావాలంటే ఏ జట్టైనా ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? అశ్విన్ చెప్పినది వింటే..
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రాబోయే ఐపీఎల్‌లో (IPL 2025) ఏ జట్టు తరఫున ఆడతాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం (IPL Auction) జరగబోతోంది. ఈ మెగా వేలానికి ముందు ఒక్కో జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతించింది. దీంతో ఏయే జట్లు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటాయి? ఎవరిని వదులుకుంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మను ముంబై (Mumbai Indians) జట్టు రిటైన్ చేసుకోకపోవచ్చనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కెప్టెన్‌గా చేసినప్పటి నుంచి ముంబై మేనేజ్‌మెంట్‌తో రోహిత్‌కు గ్యాప్ వచ్చిందని సమాచారం.


దాదాపు 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్‌తో ఉన్న అనుబంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి వేరే ఫ్రాంఛైజీలో చేరాలని రోహిత్ భావిస్తున్నట్టు సమాచారం. రోహిత్ కనుక వేలానికి అందుబాటులో ఉంటే చాలా ఫ్రాంఛైజీలు అతడిపై ఆసక్తి ప్రదర్శిస్తాయి. ప్రస్తుతానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ రోహిత్ శర్మను తీసుకునేందుకు ఆసక్తిగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (R Ashwin) ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ రోహిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ``ఐపీఎల్‌లో రోహిత్‌ను, కోహ్లీని ఒకే జట్టులో చూసే అవకాశముందా`` అనే ప్రశ్నకు అశ్విన్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.


``రోహిత్‌ను దక్కించుకోవాలంటే ఆర్సీబీ టీమ్ కనీసం రూ.20 కోట్లను పక్కన పెట్టుకోవాల్సిందే. అంతకంటే తక్కువ ధరకు రోహిత్‌ను దక్కించుకోవడం అసాధ్యం`` అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇక, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఆర్సీబీ తరఫున వచ్చే సీజన్‌లో ఆడతాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై రాహుల్ గతంలో స్పందిస్తూ.. ``అదే జరుగుతుందని ఆశిద్దాం`` అంటూ కామెంట్స్ చేశాడు. ఏదేమైనా వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 02:27 PM