ఆసీస్ ఆడేసుకుంది
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:27 AM
బాక్సింగ్ డే టెస్టును ఆతిథ్య ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. సిరీ్‌సలో ఇప్పటిదాకా అంతగా ప్రభావం చూపని టాపార్డర్ మెల్‌బోర్న్ మైదానంలో కలిసికట్టుగా కదం తొక్కింది. లబుషేన్ (72), స్మిత్ (68 బ్యాటింగ్), అరంగేట్ర టీనేజర్ కాన్‌స్టా్‌స (60), ఖవాజా (57) ఇలా తొలి నలుగురు బ్యాటర్లు...
టాప్-4 బ్యాటర్ల హాఫ్ సెంచరీలు
ఆకట్టుకున్న టీనేజర్ కాన్‌స్టా్‌స
తొలి ఇన్నింగ్స్ 311/6
బాక్సింగ్ డే టెస్టు
మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టును ఆతిథ్య ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. సిరీ్‌సలో ఇప్పటిదాకా అంతగా ప్రభావం చూపని టాపార్డర్ మెల్‌బోర్న్ మైదానంలో కలిసికట్టుగా కదం తొక్కింది. లబుషేన్ (72), స్మిత్ (68 బ్యాటింగ్), అరంగేట్ర టీనేజర్ కాన్‌స్టా్‌స (60), ఖవాజా (57) ఇలా తొలి నలుగురు బ్యాటర్లు అర్ధసెంచరీలతో బ్యాట్లు ఝుళిపించారు. దీంతో గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 6 వికెట్లకు 311 పరుగులు సాధించింది. క్రీజులో స్మిత్‌తో పాటు కమిన్స్ (8 బ్యాటింగ్) ఉన్నాడు. బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. ఇక రెండో రోజు శుక్రవారం ఆటలో జోరు మీదున్న స్మిత్‌ను ఆరంభంలోనే కట్టడి చేయడంతో పాటు మిగతా వికెట్లను కూడా వేగంగా తీయాల్సి ఉంటుంది. లేకుంటే ఆసీస్ భారీ స్కోరును అడ్డుకోవడం కష్టమే.
కాన్‌స్టా్‌స కేక..
19 ఏళ్లకే టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ సామ్ కాన్‌స్టా్‌స అరంగేట్రం మ్యాచ్‌లో అదరగొట్టాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోగలడా? అనే సందేహాలు వ్యక్తమైనా.. బరిలోకి దిగాక అతడి జోరును చూసి క్రికెట్ పండితులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అపార అనుభవజ్ఞుడిలా అతడు ఆడిన షాట్లకు ఎంసీజీలో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజా సిరీ్‌సలో భారత స్టార్ పేసర్ బుమ్రాను ఎదుర్కొనేందుకు ఆసీస్ బ్యాటర్లు అష్టకష్టాలు పడుతుండగా.. కాన్‌స్టా్‌స మాత్రం అతడిని ఓ సాధారణ బౌలర్‌గా మార్చివేశాడు. తాను ఎదుర్కొంటోంది ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్‌ననే ఒత్తిడి, జంకు ఏమాత్రం లేకుండా స్కూప్, రివర్స్ స్కూప్ షాట్లతో అతనాడిన తీరు భారత జట్టును షాక్‌కు గురిచేసింది. ఇంకా క్రీజులో కుదురుకోకముందే ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో అతడు ఇదే తరహాలో వికెట్ల వెనకాల 4,6,4 బాది అవాక్కయ్యేలా చేశాడు. బుమ్రా మరో ఓవర్‌లోనూ 4,6,4తో వేగంగా పరుగులను రాబట్టాడు. ఈజోరుతో కాన్‌స్టా్‌స 52 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ జడేజా అతడి దూకుడును అడ్డుకోవడంతో తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. లంచ్ విరామానికి ఆసీస్ 112/1తో నిలిచింది.
బౌలర్ల కట్టడి
కొత్త బంతితో ప్రభావం చూపని భారత బౌలర్లు రెండో సెషన్‌లో మాత్రం కట్టడి చేయగలిగారు. అర్ధసెంచరీ పూర్తి చేశాక మరో ఓపెనర్ ఖవాజాను బుమ్రా అవుట్ చేశాడు. ఈ సెషన్‌లో ఆసీస్ కోల్పోయిన వికెట్ ఇదొక్కటే. లబుషేన్, స్మిత్ జాగ్రత్తగా ఆడడంతో ఈ సెషన్‌లో ఆసీస్ 23 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆఖరి సెషన్‌లో మాత్రం వికెట్లను పడగొట్టగలిగారు. స్మిత్, లబుషేన్ దీటుగా ఆడుతూ బౌలర్లను విసిగించారు. డ్రింక్స్ విరామం తర్వాత లబుషేన్ స్పిన్నర్ సుందర్ ఓవర్‌లో ఫ్రంట్‌ఫుట్ ఆడే ప్రయత్నంలో విరాట్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ప్రమాదకర హెడ్ (0)తో పాటు మార్ష్ (4)ను బుమ్రా వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో భారత శిబిరంలో జోష్ కనిపించింది. కానీ క్యారీ అండతో స్మిత్ చెలరేగాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 53 రన్స్ జోడించింది. ఆట చివర్లో క్యారీని పేసర్ ఆకాశ్ అవుట్ చేశాడు.
స్కోరుబోర్డు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: కాన్‌స్టా్‌స (ఎల్బీ) జడేజా 60; ఖవాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లీ (బి) సుందర్ 72; స్మిత్ (బ్యాటింగ్) 68; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; క్యారీ (సి) పంత్ (బి) ఆకాశ్ 31; కమిన్స్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 86 ఓవర్లలో 311/6. వికెట్ల పతనం: 1-89, 2-154, 3-237, 4-240, 5-246, 6-299; బౌలింగ్: బుమ్రా 21-7-75-3; సిరాజ్ 15-2-69-0; ఆకాశ్ 19-5-59-1; జడేజా 14-2-54-1; నితీశ్ 5-0-10-0; సుందర్ 12-2-37-1.
గిల్‌ను అందుకే తప్పించాం..
శుభ్‌మన్ గిల్‌ను నాలుగో టెస్టులో ఆడించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి స్థానంలో రెండో స్పిన్నర్‌గా సుందర్‌ను ఎంపిక చేశారు. గిల్‌పై వేటు విషయమై బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు. ‘ఇక్కడి పిచ్‌ను పరిశీలిస్తే బంతి పాతదిగా మారాక సుందర్ వైవిధ్యమైన బౌలింగ్ ప్రయోజకరంగా ఉంటుందని భావించాం. అందుకే జడ్డూతో కలిసి సుందర్‌ను ఆడించాలనుకున్నాం. ఇక రోహిత్ టాపార్డర్‌లో వస్తాడు’ అని నాయర్ తెలిపాడు.
1
భారత్‌పై టెస్టు అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడి (19)గా కాన్‌స్టా్‌స. అలాగే ఈ ఫార్మాట్‌లో ఆసీస్ తరఫున 50+ స్కోరు సాధించిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇయాన్ క్రెయిగ్ (17) టాప్‌లో ఉన్నాడు.
4483
బుమ్రా ఓవర్‌లో ఓ బ్యాటర్ సిక్సర్ బాదక మూడేళ్లవుతోంది. తాజాగా బాక్సింగ్ డే టెస్టులో ఆ రికార్డును టీనేజర్ కాన్‌స్టా్‌స బ్రేక్ చేశాడు. దీంతో సరిగ్గా బుమ్రా తన 4483 బంతుల తర్వాత టెస్టుల్లో సిక్సర్ సమర్పించుకోవడం గమనార్హం.
ముందుగా అనుకున్నదే..
‘బుమ్రా ఓ దిగ్గజ బౌలర్. అతడిని దీటుగా ఎదుర్కొని ఒత్తిడిలో పడేయాలని భావించా. అందుకే ఆరంభంలోనే ర్యాంప్ షాట్లతో ఎదురుదాడికి దిగా. ఆ షాట్లే నా బలం. వాటి కోసం తీవ్రంగా సాధన చేశా. చివరికి అనుకున్నది సాధించా. కెప్టెన్ కమిన్స్ నా సహజశైలిలోనే ఆడాలని సూచించాడు’
సామ్ కాన్‌స్టా్‌స