Share News

బంగ్లా.. ఘనంగా

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:49 AM

బౌలర్ల అద్భుత రాణింపుతో బంగ్లాదేశ్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో ప్రవేశించింది. తమ స్వల్ప స్కోరును కాపాడే క్రమంలో బంగ్లా పేసర్లు తన్‌జీమ్‌ హసన్‌ షకీబ్‌ (4-2-7-4), ముస్తాఫిజుర్‌ (4-1-7-3) కళ్లు చెదిరే గణాంకాలు నమోదు చేశారు...

బంగ్లా.. ఘనంగా

టీ20 ప్రపంచకప్‌లో నేడు

వెస్టిండీస్‌ X అఫ్ఘానిస్థాన్‌ ( ఉ. 6. గం.)

చెలరేగిన తన్‌జీమ్‌, ముస్తాఫిజుర్‌

నేపాల్‌ చిత్తు

కింగ్స్‌టౌన్‌: బౌలర్ల అద్భుత రాణింపుతో బంగ్లాదేశ్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో ప్రవేశించింది. తమ స్వల్ప స్కోరును కాపాడే క్రమంలో బంగ్లా పేసర్లు తన్‌జీమ్‌ హసన్‌ షకీబ్‌ (4-2-7-4), ముస్తాఫిజుర్‌ (4-1-7-3) కళ్లు చెదిరే గణాంకాలు నమోదు చేశారు. దీంతో సోమవారం గ్రూప్‌ ‘డి’లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. అలాగే ఈ మెగా టోర్నీ చరిత్రలో తక్కువ స్కోరును కాపాడుకున్న తొలి జట్టుగా బంగ్లా నిలవడం విశేషం. ఆరు పాయింట్లతో తమ గ్రూప్‌ నుంచి సౌతాఫ్రికా తర్వాత సూపర్‌-8లో ప్రవేశించిన రెండో జట్టుగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను నేపాల్‌ బౌలర్లు వణికించడంతో 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. వీరి ఇన్నింగ్స్‌లో షకీబ్‌ (17) టాప్‌ స్కోరర్‌ కావడం గమనార్హం. పవర్‌ప్లేలోనే ఈ జట్టు 30/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా బ్యాటర్లకు ఇబ్బంది తప్పలేదు. ఆఖరి వికెట్‌కు టస్కిన్‌ (12 నాటౌట్‌), ముస్తాఫిజుర్‌ (3) 18 పరుగులు జత చేయడంతో అతి కష్టమ్మీద స్కోరు వంద పరుగులు దాటగలిగింది. సోమ్‌పాల్‌ కమి, లామిచానె, రోహిత్‌, దీపేంద్రలకు రెండేసి వికెట్లు దక్కాయి.


పేసర్ల హవా: దక్షిణాఫ్రికాపై ఒక్క పరుగు తేడాతో ఓడిన నేపాల్‌.. ఈసారి స్వల్ప ఛేదనలో బంగ్లాకు షాక్‌ ఇవ్వగలదని అంచనా వేశారు. కానీ ప్రత్యర్థి పేసర్ల తడాఖాతో 19.2 ఓవర్లలో 85 పరుగులే చేసి ఓడింది. తన్‌జీమ్‌ అద్భుత బౌలింగ్‌తో టాపార్డర్‌ పనిబట్టడంతో పవర్‌ప్లేలో 24/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. అయితే మిడిలార్డర్‌లో కుశాల్‌ మల్ల (27), దీపేంద్ర సింగ్‌ (25) పోరాటంతో ఆశలు రేపారు. కానీ 24 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన వేళ 17వ ఓవర్‌లో కుశాల్‌ను ముస్తాఫిజుర్‌ అవుట్‌ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు 52 పరుగుల కీలక భాగస్వామ్యం ముగియడంతో పాటు చివరి వికెట్లు టపటపా నేలకూలాయి. ఏకంగా ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమతం కాగా.. చివరి నలుగురు డకౌట్లుగా వెనుదిరగడం గమనార్హం.


సంక్షిప్త స్కోర్లు

బంగ్లాదేశ్‌: 19.3 ఓవర్లలో 106 ఆలౌట్‌ (షకీబ్‌ 17, రిషద్‌ 13, మహ్ముదుల్లా 13; సోమ్‌పాల్‌ 2/10, లామిచానె 2/17, రోహిత్‌ 2/20, దీపేంద్ర 2/22).

నేపాల్‌: 19.2 ఓవర్లలో 85 ఆలౌట్‌ (కుశాల్‌ 27, దీపేంద్ర 25, ఆసిఫ్‌ 17;తన్‌జీమ్‌ 4/7, ముస్తాఫిజుర్‌ 3/7, షకీబ్‌ 2/9).

Updated Date - Jun 18 , 2024 | 04:55 AM