Share News

భళా.. రుబీనా

ABN , Publish Date - Sep 01 , 2024 | 05:58 AM

పారాలింపిక్స్‌లో భారత షూటర్లు హవా సాగిస్తున్నారు. వీరి గురి తప్పని తూటా కారణంగా మూడో రోజు కూడా పతక భాగ్యం కలిగింది. మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1లో షూటర్‌ రుబీనా ఫ్రాన్సిస్‌ కాంస్యం అందుకుంది...

భళా.. రుబీనా

కాంస్యం గెలిచిన షూటర్‌

శీతల్‌కు నిరాశ పారాలింపిక్స్‌

భారత్‌ ఖాతాలో ఐదో పతకం

పారిస్‌ పారాలింపిక్స్‌లో వరుసగా రెండోరోజూ భారత్‌ పతకంతో మురిసింది. షూటర్‌ రుబీనా ఫ్రాన్సిస్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్యం అందుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో ఐదో పతకం చేరింది. ఇక ఆర్చరీలో ఆశలు రేపిన 17 ఏళ్ల సంచలనం శీతల్‌ దేవి, సరితా దేవిల పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో కేవలం పాయింట్‌ తేడాతో శీతల్‌ వెనుదిరగగా.. సరిత క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. తెలుగు క్రీడాకారులైన రోయర్‌ నారాయణ, సైక్లిస్ట్‌ షేక్‌ అర్షద్‌ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.

పారిస్‌: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు హవా సాగిస్తున్నారు. వీరి గురి తప్పని తూటా కారణంగా మూడో రోజు కూడా పతక భాగ్యం కలిగింది. మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1లో షూటర్‌ రుబీనా ఫ్రాన్సిస్‌ కాంస్యం అందుకుంది. ఇప్పటికే షూటింగ్‌లో అవనికి స్వర్ణం, మనీశ్‌కు రజతం, మోనాకు కాంస్యం దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో 25 ఏళ్ల రుబీనా కూడా చేరింది. ఓవరాల్‌గా భారత్‌ ఖాతాలో ఐదు పతకాలు చేరగా ఇందులో నాలుగు షూటర్ల ద్వారానే రావడం విశేషం. డిఫెండింగ్‌ చాంపియన్‌తో పాటు వరల్డ్‌ రికార్డు షూటర్‌ పాల్గొన్న శనివారం జరిగిన ఫైనల్లో రుబీనా కఠిన పోటీని తట్టుకుంటూ 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. స్టేజి 1లో 10 షాట్లు ముగిసేసరికి మూడో స్థానంలో నిలిచింది. అయితే 14వ షాట్‌ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది.


ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా చివరి సిరీ్‌సలో 9.2, 8.9 స్కోరుతో కంచు మోత మోగించింది. అంతకుముందు క్వాలిఫై రౌండ్‌లో తను 556 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. టోక్యో పారాగేమ్స్‌లోనూ రుబీనా ఫైనల్‌కు వెళ్లినప్పటికీ ఏడో స్థానంలో నిలిచి వెనుదిరిగింది. మరోవైపు పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1లో స్వరూప్‌ ఉన్హాల్కర్‌ క్వాలిఫై ఈవెంట్‌లో 14వ స్థానంలో నిలిచి నిరాశపర్చాడు.

విఫలమైన తెలుగు అథ్లెట్లు

పారాగేమ్స్‌లో తెలుగు అథ్లెట్లు నారాయణ, అర్షద్‌ ఆకట్టుకోలేకపోయారు. ఏపీకి చెందిన సైక్లిస్ట్‌ షేక్‌ అర్షద్‌ పురుషుల 1000 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ సీ1-3 క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో ఆఖరి, 17వ స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన 3000 మీటర్ల సీ2 ఈవెంట్‌లోనూ అర్షద్‌ ఆఖరి స్థానం (9)లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక మహిళల 500 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ సీ1-3లో జ్యోతి గడెరియా కూడా 11వ స్థానంలో ఆఖరున నిలిచింది. కాగా.. అర్షద్‌, జ్యోతి రోడ్‌ సైక్లింగ్‌ ఈవెంట్‌లోనూ పోటీపడనున్నారు. ఇక రోయింగ్‌లో మిక్స్‌డ్‌ పీఆర్‌3 డబుల్స్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో అనిత-నారాయణ జోడీ మెడల్‌ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. రెపిచేజ్‌2లో ఈ జంట 7 నిమిషాల 54.33 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌ బికి చేరింది. దీంట్లో ఈ ద్వయం 7 నుంచి 12వ స్థానం కోసం పోటీపడనుంది.


పాయింట్‌ తేడాతో..

అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనతో పారాగేమ్స్‌లోనూ పతక ఆశలు రేపిన 17 ఏళ్ల టీనేజ్‌ ఆర్చర్‌ శీతల్‌ దేవికి నిరాశే ఎదురైంది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్‌లో ఆమె కేవలం పాయింట్‌ తేడాతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. చిలీకి చెందిన మరియాన జునిగ చేతిలో శీతల్‌ 137-138 తేడాతో ఓడింది. తొలి సెట్‌ను 10,10 పాయింట్లతో దీటుగా ఆరంభించిన శీతల్‌ గెలుపు దిశగానే సాగింది. అటు ప్రత్యర్థి కూడా గట్టిపోటీ ఇవ్వడంతో నాలుగు సెట్లు ముగిసేసరికి 111 స్కోరుతో ఇరువురూ సమంగా నిలిచారు. ఇక చివరిదైన ఐదో సెట్‌లో శీతల్‌ 8,10,8తో 26 పాయింట్లు సాధించగా, జునిగ 27 పాయింట్లతో విజేతగా నిలిచింది. మరోవైపు ఇదే విభాగంలో క్వార్టర్స్‌ చేరిన భారత ఆర్చర్‌ సరితా దేవి 140-145తో వరల్డ్‌ చాంపియన్‌ ఒజ్నర్‌ (తుర్కియే) చేతిలో ఓటమిపాలైంది.

Updated Date - Sep 01 , 2024 | 05:58 AM