మెరిసిన హర్మన్, మంధాన
ABN , Publish Date - Oct 10 , 2024 | 05:14 AM
కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో.. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్), స్మృతి మంధాన (38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) అదిరే హాఫ్ సెంచరీలతో.....
నేటి మ్యాచ్
బంగ్లాదేశ్ X వెస్టిండీస్, రా. 7.30 నుంచి
82 పరుగులతో లంక చిత్తు
మహిళల టీ20 వరల్డ్‌కప్
దుబాయ్: కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో.. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్), స్మృతి మంధాన (38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) అదిరే హాఫ్ సెంచరీలతో.. బుధవారం గ్రూప్-ఎలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకొన్న హర్మన్ సేన గ్రూప్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు చేసింది. షఫాలీ వర్మ (40 బంతుల్లో 4 ఫోర్లతో 43) కూడా రాణించింది. ఛేదనలో లంక 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. కవిష (21), అనుష్క (20) టాప్ స్కోరర్లు. అరుంధతి, శోభన చెరో 3 వికెట్లు పడగొట్టగా.. రేణుక 2 వికెట్లు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా హర్మన్ నిలిచింది.
దెబ్బకొట్టిన రేణుక..: లంక భారీ ఛేదనలో ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ గుణరత్నె (0)ను డకౌట్ చేసిన రేణుక.. తన తర్వాతి ఓవర్‌లో హర్షిత (3)ను పెవిలియన్ చేర్చింది. రెండో ఓవర్‌లో చమరి ఆటపట్టు (1)ను శ్రేయాంక అవుట్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టింది. దీంతో లంక 6/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కవిష, అనుష్క ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, శోభన బౌలింగ్‌లో అనుష్కను రిచా స్టంపౌట్ చేయడంతో.. నాలుగో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 12వ ఓవర్‌లో నీలాక్షిక (8), కవిషను అరుంధతి అవుట్ చేయడంతో.. లంక 58/6తో పరాజయం దిశగా పయనించింది.
బ్యాటర్ల జోరు..: టాపార్డర్ బ్యాటర్లు హర్మన్, మంధాన బ్యాట్‌లు ఝుళిపించడంతో.. భారత్ సవాల్ విసరగలిగే స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్‌కు ఓపెనర్లు షఫాలీ, మంధాన శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 77 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేయగా.. డెత్ ఓవర్లలో కెప్టెన్ హర్మన్ దూకుడుతో టీమ్ స్కోరు 170 పరుగులు దాటింది. పవర్‌ప్లేలో భారత్ 41/0తో నిలిచింది. కాగా, 13వ ఓవర్‌లో ఆటపట్టు బౌలింగ్‌లో భారత్‌కు గట్టిదెబ్బ తగిలింది. మంధానను రనౌట్ చేసిన ఆటపట్టు.. ఆ తర్వాతి బంతికి షఫాలీని పెవిలియన్ చేర్చింది. జెమీమా రోడ్రిగ్స్ (16) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. చివరి ఓవర్లలో హర్మన్ భారీ షాట్లతో విరుచుకుపడింది. కౌర్ దెబ్బకు లంక బౌలర్లు చివరి 5 ఓవర్లలో 59 పరుగులు సమర్పించుకొన్నారు.
స్కోరు బోర్డు
భారత్: షఫాలీ (సి) గుణరత్నె (బి) ఆటపట్టు 43, మంధాన (రనౌట్) 50, హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 52, జెమీమా (సి) ప్రబోధిని (బి) కాంచన 16, రిచా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు:5; మొత్తం: 20 ఓవర్లలో 172/3; వికెట్ల పతనం: 1-98, 2-98, 3-128; బౌలింగ్:ప్రియదర్శిని 2-0-11-0, సుగంధిక 3-0-29-0, ప్రబోధిని 3-0-32-0, కవిష 2-0-11-0, రణవీర 3-0-26-0, ఆటపట్టు 4-0-34-1, కాంచన 3-0-29-1.
శ్రీలంక: విష్మి గుణరత్నె (సి/సబ్) రాధ (బి) రేణుక 0, ఆటపట్టు (సి) దీప్తి (బి) శ్రేయాంక 1, హర్షిత (సి) రిచా (బి) రేణుక 3, కవిష (సి) రేణుక (బి) అరుంధతి 21, అనుష్క (స్టంప్) రిచా (బి) శోభన 20, నీలాక్షిక (సి) షఫాలీ (బి) అరుంధతి 8, కాంచన (సి/సబ్) రాధ (బి) అరుంధతి 19, సుగంధిక (సి) రిచా (బి) శోభన 1, ప్రియదర్శిని (సి/సబ్) రాధ (బి) శోభన 1, ప్రబోధిని (సి) మంధాన (బి) దీప్తి 9, రణవీర (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.5 ఓవర్లలో 90 ఆలౌట్; వికెట్ల పతనం: 1-0, 2-4, 3-6, 4-43, 5-57, 6-58, 7-61, 8-65, 9-86; బౌలింగ్: రేణుక 4-0-16-2, శ్రేయాంక 4-0-15-1, దీప్తి 3.5-0-16-1, అరుంధతి 4-0-19-3, శోభన 4-0-19-3.
80 పరుగులతో సౌతాఫ్రికా గెలుపు
దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బిలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 80 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. కాప్ (43), బ్రిట్స్ (43), లారా వొల్వార్డ్ (40) రాణించారు. ఛేదనలో స్కాట్లాండ్ 17.5 ఓవర్లలో 86 పరుగులకు కుప్పకూలింది.