హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ!
ABN , Publish Date - Nov 12 , 2024 | 01:19 AM
పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో..చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదించింది. ఈమేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు కలిగిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిస్పందన....
ప్రతిపాదించిన ఐసీసీ
పీసీబీ స్పందన కోసం ఎదురు చూపు
దుబాయ్: పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో..చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదించింది. ఈమేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు కలిగిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిస్పందన కోసం ఐసీసీ ఎదురు చూస్తోంది. ‘ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ వదులుకోకుంటే..భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో, ఫైనల్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీకి ప్రతిపాదించాం’ అని ఐసీసీ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ‘ఫైనల్‌ను పాకిస్థాన్‌లో గాకుండా దుబాయ్‌లో నిర్వహిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ పద్ధతికి బీసీసీఐ అంగీకరించింది’ అని కూడా ఆ అధికారి తెలిపారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహణకు అంగీకరిస్తే..పూర్తి ఆతిథ్య రుసుము చెల్లించడంతోపాటు మెజార్టీ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో నిర్వహించేలా ఐసీసీ హామీ ఇచ్చినట్టు సమాచారం.
భారత్ తమ దేశం రాని నేపథ్యంలో ఆతిథ్య హక్కులను పాక్ కనుక వదులుకొంటే..చాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాకు తరలించాలని కూడా ఐసీసీ ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ టోర్నీలో షెడ్యూల్ ప్రకారం పాక్ వేదికగా వచ్చే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాలి.