చెన్నై.. అదిరెన్!
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:32 AM
గతేడాది ఫైనలిస్టుల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లో రాణిస్తూ కలిసికట్టుగా కదం తొక్కింది. బ్యాటింగ్‌లో శివమ్ దూబే (23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) మెరుపు...
వరుసగా రెండో గెలుపు
గుజరాత్ చిత్తు
శివమ్ దూబే హాఫ్ సెంచరీ
చెన్నై: గతేడాది ఫైనలిస్టుల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లో రాణిస్తూ కలిసికట్టుగా కదం తొక్కింది. బ్యాటింగ్‌లో శివమ్ దూబే (23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) మెరుపు ఆటతీరును ప్రదర్శించారు. అటు పేసర్లు పదునైన బంతులతో కట్టడి చేయగా, ఫీల్డింగ్‌లోనూ సూపర్ అనిపించుకుంది. దీంతో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎ్‌సకే 63 రన్స్‌తో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) ఆకట్టుకున్నాడు. రషీద్ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (37), మిల్లర్ (21), సాహా (21) ఫర్వాలేదనిపించారు. తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా దూబే నిలిచాడు.
పోరాటమే లేదు..: భారీ ఛేదనలో గుజరాత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు గిల్ (8), సాహా వికెట్లను కోల్పోయింది. తన వరుస ఓవర్లలో పేసర్ చాహర్ వీరిని పెవిలియన్‌కు చేర్చాడు. విజయ్ శంకర్ (12).. ధోనీ సూపర్ క్యాచ్‌తో స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా, సాయి సుదర్శన్ కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నాడు. కానీ అతడి ఆటలో ఛేదనకు తగ్గ వేగం లేకపోయింది. దీంతో ఏ దశలోనూ జట్టు ప్రమాదకరంగా కనిపించలేదు. అటు మూడు ఫోర్లతో మిల్లర్ కాస్త జోరు చూపినా రహానె అద్భుత క్యాచ్‌తో అవుటయ్యాడు. నాలుగో వికెట్‌కు సాయి, మిల్లర్ 41 పరుగులు జోడించారు. దీనికి తోడు వరుస ఓవర్లలో సాయి, అజ్మతుల్లా (11), రషీద్ ఖాన్ (1) వెనుదిరగడంతో టైటాన్స్ చేసేదేమీ లేకపోయింది.
కలిసికట్టుగా..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు సమష్ఠి ఆటతీరును కనబరిచారు. ముందుగా ఓపెనర్లు రచిన్, రుతురాజ్ మెరుపు ఆరంభాన్ని అందివ్వగా.. ఆ తర్వాత శివమ్ దూబే శివాలెత్తాడు. ఓపెనర్ల ధాటికి పవర్‌ప్లేలోనే 69 పరుగులు సాధించింది. తొలి ఓవర్‌లోనే గైక్వాడ్ క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నా.. మరో ఎండ్‌లో రచిన్ బాదుడుకు ఓవర్‌కు పదకొండు పరుగుల రన్‌రేట్‌తో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. రెండో ఓవర్‌లో 6,4తో బ్యాట్‌కు పనిజెప్పిన తను ఎక్కడా ఆగలేదు. మూడో ఓవర్‌లో రెండు ఫోర్లతో 12, నాలుగో ఓవర్‌లో 6,4తో 16, ఐదో ఓవర్‌లో 4,6తో 17 ఇలా ఎదురుదాడే లక్ష్యంగా అలరించాడు. అటు రుతురాజ్ సైతం అడపాదడపా ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అయితే రషీద్ ఓవర్‌లో రచిన్ ఓ ఫోర్ కొట్టాక స్టంపౌటయ్యాడు. కానీ అప్పటికే తొలి వికెట్‌కు 32 బంతుల్లోనే 62 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. పదో ఓవర్‌లో రుతురాజ్ 6,4 బాది స్కోరును వంద దాటించాడు. ఇక రహానె (12)ను సాయికిశోర్ అవుట్ చేశాక బరిలోకి దిగిన దూబే ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే సిక్సర్లుగా మలిచి జోష్ తెచ్చాడు. పేసర్ మోహిత్ మాత్రం 12వ ఓవర్‌లో కట్టడి చేయగా.. తర్వాతి ఓవర్‌లోనే రుతురాజ్ వికెట్ తీసిన పేసర్ జాన్సన్ 2 పరుగులే ఇచ్చాడు. ఈ దశలో దూబే రన్‌రేట్ పెంచే బ్యాధతను తీసుకుంటూ రషీద్ ఓవర్‌లో సిక్సర్, జాన్సన్ ఓవర్‌లో 4,6తో జట్టు స్కోరును ట్రాక్ మీదికి తెచ్చాడు. అతడి ధాటికి 16 ఓవర్లలో చెన్నై 165/3తో నిలిచింది. ఇక 22 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన దూబేను 19వ ఓవర్‌లో రషీద్ అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు మిచెల్ (24 నాటౌట్)తో జత పరిచిన 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సమీర్ రిజ్వీ (14) అదే ఓవర్‌లో రెండు సిక్సర్లతో 15 రన్స్ అందించాడు. ఆఖరి ఓవర్‌లో మోహిత్ 8 పరుగులే ఇచ్చి రిజ్వీ వికెట్ తీయగా.. జడేజా (7) రనౌటయ్యాడు.
స్కోరుబోర్డు
చెన్నై: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46, రచిన్ రవీంద్ర (స్టంప్డ్) సాహా (బి) రషీద్ 46, రహానె (స్టంప్డ్) సాహా (బి) కిషోర్ 12, శివమ్ దూబె (సి) శంకర్ (బి) రషీద్ 51, డారిల్ మిచెల్ (నాటౌట్) 24, రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14, జడేజా (రనౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 206/6; వికెట్ల పతనం: 1-62, 2-104, 3-127, 4-184, 5-199, 6-206; బౌలింగ్: ఒమర్జాయ్ 3-0-30-0, ఉమేశ్ 2-0-27-0, రషీద్ 4-0-49-2, సాయి కిషోర్ 3-0-28-1, జాన్సన్ 4-0-35-1, మోహిత్ శర్మ 4-0-36-1.
గుజరాత్: సాహా (సి) దేశ్‌పాండే (బి) చాహర్ 21, గిల్ (ఎల్బీ) చాహర్ 8, సాయి సుదర్శన్ (సి) రిజ్వీ (బి) పథిరన 37, విజయ్ శంకర్ (సి) ధోనీ (బి) మిచెల్ 12, మిల్లర్ (సి) రహానె (బి) దేశ్‌పాండే 21, ఒమర్జాయ్ (సి) రచిన్ (బి) దేశ్‌పాండే 11, తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తాఫిజుర్ 6, రషీద్ (సి) రచిన్ (బి) ముస్తాఫిజుర్ 1, ఉమేశ్ (నాటౌట్) 10, స్పెన్సర్ జాన్సన్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1-28, 2-34, 3-55, 4-96, 5-114, 6-118, 7-121, 8-129; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-28-2, ముస్తాఫిజుర్ 4-0-30-2, తుషార్ దేశ్‌పాండే 4-0-21-2, జడేజా 2-0-15-0, మిచెల్ 2-0-18-1, పథిరన 4-0-29-1.
1
ఐపీఎల్‌లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్‌కిదే అతి పెద్ద
పరాజయం.