Mohammad Shami: షమీకి బీసీసీఐ డెడ్‌లైన్.. ఆ రెండు కఠిన పరీక్షలు దాటితేనే..
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:55 PM
గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టీమిండియాలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇదంత సులువు కాదని.. బీసీసీఐ షమీకి కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది..
ముంబై: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి బీసీసీఐ వారం రోజుల డెడ్ లైన్ విధించింది. ఈ లోపు షమీ తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాలంటే ఈ ఆటగాడు మరో రెండు కఠిన పరీక్షలను సైతం దాటుకుని ముందుకు వెళ్లాల్సి ఉందని బీసీసీఐ షరతులు విధించినట్టు తెలుస్తోంది.
గాయం కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరమైన షమీ ఇటీవలే కాంపిటేటివ్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. అతడి ఆరోగ్యాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వైద్య బృందం తీవ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. బెంగాల్‌కు తిరిగి వచ్చిన షమీ.. అతని మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 లోనూ అతడు పాల్గొననున్నాడు. అయితే, గాయం కారణంగా లభించిన విశ్రాంతి వల్ల షమీ కాస్త బరువు పెరిగాడు. ఫిట్ నెస్ విషయంలోనూ తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఈ రెండు పరీక్షలు దాటి షమీ నిరూపించుకోగలిగితేనే అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తదుపరి మ్యాచ్ లో ఆడే అవకాశం లభించనుంది.
ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని షమీకి ఇప్పుడప్పుడే అవకాశాలు ఇవ్వకపోవచ్చునని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షమీ పూర్తిగా కోలుకుంటే, అతను డిసెంబర్ 14 నుండి ప్రారంభమయ్యే మూడో టెస్టు నుండి ఆడే అవకాశాలున్నాయి. షమీ గైర్హాజరీలో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా సత్తా చాటింది. స్టాండ్-ఇన్-కెప్టెన్, పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీశాడు. అరంగేట్ర ఆటగాడు హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీసి మెప్పించాడు. ఇందులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.