Jasprit Bumrah: బుమ్రాను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆసిస్ దిగ్గజం
ABN , Publish Date - Nov 27 , 2024 | 10:09 AM
బుమ్రా బౌలింగ్ అటాక్ ను తట్టుకోలేక కంగారూలు అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు లేవనెత్తుతున్నారు. బుమ్రా చెక్ చేస్తున్నాడని.. బంతిని త్రో చేస్తున్నాడని తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నారు.

ముంబై: పెర్త్ వేదికగా ఆసిస్ తో జరిగిన తొలి టెస్టులో జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రా తన బౌలింగ్ తోనూ నిప్పుల వర్షం కురిపించాడు. 150 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత బుమ్రా మ్యాజిక్ చేశాడు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను చెదరగొడుతూ ఏకంగా ఐదు వికెట్లు నేలమట్టం చేశాడు. బుమ్రా బౌలింగ్ అటాక్ ను తట్టుకోలేక కంగారూలు తోకముడిచారు. కేవలం 104 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌట్ అయ్యింది. బుమ్రా 18 ఓవర్లు బౌలింగ్ చేసి 6 మెయిడెన్లు వేసి 30 పరుగుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఓవరాల్ గా మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇది మింగుడుపడని ఆసిస్ జట్టు, అభిమానులు బుమ్రాను టార్గెట్ చేశారు.
అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు లేవనెత్తుతున్నారు. బుమ్రా చెక్ చేస్తున్నాడని.. బంతిని త్రో చేస్తున్నాడని తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆస్ట్రేలియన్ లెజెండ్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ స్పందించాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను తప్పుపట్టడానికి వీల్లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చాడు. ది సిడ్నీ మోరింగ్ హెరాల్డ్ అనే పత్రిక బుమ్రా బౌలింగ్ పై ప్రశ్నార్థకం గుర్తు వేయడం తనను బాధించిందన్నాడు. ఇది బుమ్రా వంటి ఛాంపియన్ నైపుణ్యాలకు మాయని మచ్చ అని ఓ క్రికెటర్ కు ఇంతకు మించిన అవమానం మరోటి ఉండదన్నాడు.
‘‘బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను ప్రశ్నించడం ఓ అర్థం లేని చర్య. ఆస్ట్రేలియా బౌలర్లు భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇది మంచి ప్రారంభం. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రదర్శన మరింత ఆందోళన కలిగించింది. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ ఎటాక్ మరింత పదునుగా , మరింత ఖచ్చితమైనదిగా కనిపించింది. అతడిని విమర్శించడం మానుకోండి’’ అంటూ గ్రెగ్ చాపెల్ తన మద్దతునిచ్చాడు. బుమ్రా ప్రమాదకరంగా మారడంతో ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌటైంది. 34 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆలౌట్ అయి 295 పరుగుల తేడాతో ఓడిపోయింది.