Kavya Maaran: కావ్య మారన్ ముఖంలో చిరునవ్వు.. వైరల్ అవుతున్న ఫోటోలు
ABN , Publish Date - Feb 11 , 2024 | 04:24 PM
‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ ఫ్రాంచైజీ సహ-యజమాని కావ్య మారన్ మైదానంలో ఎప్పుడూ చూసిన దుఃఖంతోనే కనిపిస్తారు. ఐపీఎల్‌లో తన జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చనప్పుడు.. ఆమె ఆవేదన చెందుతుంటారు. నోటితో చెప్పకపోయినా.. తన భావాలతోనే ‘సరిగ్గా ఆడండిరా బాబు’ అంటూ నిట్టూరుస్తుంటారు.
‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ ఫ్రాంచైజీ సహ-యజమాని కావ్య మారన్ మైదానంలో ఎప్పుడూ చూసిన దుఃఖంతోనే కనిపిస్తారు. ఐపీఎల్‌లో తన జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చనప్పుడు.. ఆమె ఆవేదన చెందుతుంటారు. నోటితో చెప్పకపోయినా.. తన భావాలతోనే ‘సరిగ్గా ఆడండిరా బాబు’ అంటూ నిట్టూరుస్తుంటారు. ఇది చూసి అభిమానులు తట్టుకోలేక.. కనీసం కావ్య కోసమైనా బాగా ఆడండంటూ నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమంగా జట్టు ఆటగాళ్లను కోరుతుంటారు. ఏదో ఒక రోజు కావ్య మారన్ ముఖంలో ఆనందం చూస్తామంటూ కామెంట్లు కూడా పెడుతుంటారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చేసింది. సంతోషంతో ఆమె గంతులేస్తూ ఫోటోలకు చిక్కింది.
కావ్య ముఖంలో ఈ ఆనందానికి కారణం.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి, SA20 టైటిల్ సాధించడమే. గ్రూప్ దశలోనే అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు, ఫైనల్స్‌లో మరింత గొప్ప ప్రదర్శనని అందించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడు విభాగాల్లోనూ సూపర్ పెర్ఫార్మెన్స్‌తో సన్‌రైజర్స్ జట్టు చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్.. 17 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. ఎస్‌ఈసీ జట్టు 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఎస్ఈసీ జట్టులో ఒక్క డేవిడ్ మలన్ (6) మినహాయిస్తే.. మిగిలిన నలుగురు బ్యాటర్లూ తాండవం చేశారు. టామ్ అబెల్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (56) అర్థశతకాలతో దుమ్ముదలిపేయగా.. జోర్డాన్ (42), మార్క్‌రమ్ (42) మెరుపులు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఇక బౌలర్లలో.. మార్కో యాన్‌సెన్ ప్రధాన పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో కేవలం 30 పరుగులే ఇచ్చిన అతగాడు.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి, ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. డేనియల్, బార్ట్‌మాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. సిమన్ ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో వియాన్ మల్డర్ ఒక్కడే 38 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.