BCCI: జైషా స్థానంలో బీసీసీఐ సెక్రటరీగా సైకియా నియామకం
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:17 PM
జైషా రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న బీసీసీఐ సెక్రటరీ పదవికి కొత్త బాస్ వచ్చాడు. అతడి స్థానంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని అపాయింట్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొత్త సెక్రటరీ పేరును ప్రకటించింది.
ముంబై: ఐసీసీ ఛైర్మన్ గా జైషా ఎంపిక కావడంతో ఆ పదవిలో ప్రస్తుతం తాత్కాలిక సెక్రటరీగా దేవజిత్ సైకియాను నియమిస్తూ బిసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ సైకియాకు బాధ్యతలను అప్పగించాడు. ఇందుకోసం బిన్నీ తన స్పెషల్ పవర్స్ ను ఉపయోగించాడు. ఇప్పటివరకు బీసీసీఐకి సైకియా జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు. తాజా నియామకంతో సెక్రటరీగా మారాడు. బీసీసీఐ పదవికి జైషా రాజీనామా చేసిన అనంతరం ఈ పదవిలో ఎవరు కొనసాగుతారనే చర్చ నడిచింది. అయితే, ప్రస్తుతానికి సైకియా తాత్కాలిక బాధ్యతలు మాత్రమే చేపట్టనున్నాడు. శాశ్వత సెక్రటరీగా ఎవరిని నియమిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. డిసెంబర్ లో బీసీసీఐ కి ఎన్నికలు జరగనున్నాయి. బహుశా శాశ్వత సెక్రటరీ పదవిని కూడా అప్పుడే భర్తీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
బిసీసీఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 7.2 (డి) ప్రకారం.. ఆఫీసులో ఏదైనా ఖాళీ ఏర్పడిన సందర్భంలో లేదా ఏదైనా అధికారి అనారోగ్యం పాలైన సందర్భంలో, ఆ ఖాళీని సక్రమంగా భర్తీ చేసే వరకు ప్రెసిడెంట్ఇతర అధికారికి విధులను కేటాయిస్తారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బిన్నీ సైకియాకు లేఖ రాశాడు. బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలను నేను మీకు అప్పగించాలని అనుకుంటున్నాను. మీరు మీ విధులను పూర్తి విధేయతతో నిర్వర్తిస్తారని నాకు నమ్మకముంది అంటూ లేఖలో బిన్నీ పేర్కొన్నాడు. ఇక ఈ పోస్టులో సైకియా 2025 వరకు కొనసాగనున్నాడు. ఆ తర్వాత ఈ ఖాళీని శాశ్వత సెక్రటరీతో భర్తీ చేయనున్నారు.
ఎవరీ సైకియా..
ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన దేవజిత్ సైకియా 1969లో గువాహటిలో జన్మించాడు. సైకియా 1984లో అస్సాం తరఫున సీకే నాయుడు ట్రోఫీ ఆడాడు. అతడు భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కలిసి ఈస్ట్ జోన్ లో ఆడాడు. 1991లో అస్సాం తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా కెరీర్ మొదలు పెట్టాడు. 2019లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీ పదవికి ఎంపికయ్యాడు.
Rohit vs Shami: టీమిండియా స్టార్ల మధ్య చిచ్చురేపిన గాయం.. షమీ, రోహిత్ మధ్య గొడవేంటి..