Share News

దశ తిరిగేనా!

ABN , Publish Date - Jul 25 , 2024 | 07:02 AM

మహా క్రీడాసంగ్రామం ఒలింపిక్స్‌లో భారత్‌ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. టోక్యో విశ్వక్రీడల తర్వాత మన ఆటగాళ్లు, అభిమానుల్లో కొండంత ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. గత క్రీడల్లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో పసిడి పతకాన్ని...

దశ తిరిగేనా!

రేపటి నుంచే పారిస్‌ ఒలింపిక్స్‌

కోటి ఆశలతో.. కొంగొత్తగా భారత్‌

  • నీరజ్‌పై భారీ అంచనాలు ఫ నిఖత్‌ పంచ్‌ అదిరేనా?

  • గన్స్‌ గర్జిస్తే పతకాల పండుగే

మహా క్రీడాసంగ్రామం ఒలింపిక్స్‌లో భారత్‌ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. టోక్యో విశ్వక్రీడల తర్వాత మన ఆటగాళ్లు, అభిమానుల్లో కొండంత ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. గత క్రీడల్లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో పసిడి పతకాన్ని కొల్లగొట్టడం కొత్త జోష్‌ నింపింది. మనోళ్లలోనూ ప్రపంచ స్థాయి ప్రతిభ దాగుందన్న నమ్మకం కలిగించింది. ఇక, 40 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు పతకం (కాంస్యం) నెగ్గడం యావద్దేశాన్ని మురిపించింది. టోక్యోలో 7 పతకాలు సాధించిన భారత్‌పై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో పారిస్‌లో పతకాల ‘దశ’ తిరుగుతుందని ఆశిద్దాం..


అంచనాలను అందుకొనేనా?

లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి నిరాశపర్చకుండా పతకాలు అందిస్తున్న విభాగం బ్యాడ్మింటన్‌. 2012లో సైనా నెహ్వాల్‌ కాంస్యం తర్వాత.. రియో, టోక్యోల్లో పీవీ సింధు రజత, కంచు పతకాలను సాధించింది. అయితే, ఈసారి డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి మెడల్‌ కొల్లగొడతారని లెక్కలు వేస్తున్నారు. రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన సింధు ప్రస్తుతం అంతగా ఫామ్‌లో లేకపోయినా.. అత్యుత్తమ వేదికలపై అనూహ్య ప్రదర్శనలు చేయగల సత్తా ఆమెకు ఉంది. పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగనున్న హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, లక్ష్య సేన్‌ను అండర్‌ డాగ్స్‌గా అంచనా వేస్తున్నారు.

నిఖత్‌పైనే ఆశలు..

బాక్సింగ్‌లో భారత పతక ఆశలన్నీ రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌ (75 కిలోలు) పైనే ఉన్నాయి. నిఖత్‌కు సులువైన డ్రా ఎదురవడంతో ఆమె పతక రౌండ్‌కు చేరుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండగా.. లవ్లీనా పోరాడాల్సిన పరిస్థితి.

గురి కుదిరితే..

భారీగా పతకాలు సాధిస్తుందనే అంచనాలున్న ఏకైక ఈవెంట్‌ షూటింగ్‌. అయితే, గత రెండు ఒలింపిక్స్‌లో మన గన్‌లు తుస్సుమన్నాయి. కానీ, ఈసారి 21 మందితో బరిలోకి దిగుతోంది. గత కొన్నేళ్లుగా ప్రపంచకప్‌ టోర్నీలలో రికార్డుల మోత మోగిస్తున్న మన షూటర్ల గురి కుదిరితే.. పతకాల పండుగే..! పిస్టల్‌ క్వీన్‌ మను భాకర్‌, రైఫిల్‌ 3 పొజిషన్‌లో వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన షిఫ్ట్‌ కౌర్‌ పతకాలు తేగలరన్న అంచనాలు భారీగా ఉన్నాయి. హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ కూడా సంచలనాలు సృష్టించగలదు.

వినేష్‌, అమన్‌కు చాన్సు

2008 నుంచి వరుసగా పతకాలు అందిస్తున్న విభాగం రెజ్లింగ్‌. గత ఈవెంట్‌లో రవి దహియా రజతం, బజ్‌రంగ్‌ పూనియా కాంస్యం సాధించారు. అయితే, అంతర్గత విభేదాల కారణంగా రెజ్లింగ్‌ విభాగం కుదేలైంది. వినేష్‌ ఫొగట్‌ (50 కిలోలు), అంతిమ్‌ పంగల్‌ (53 కిలోలు), అమన్‌ సెహ్రావత్‌ (57 కిలోలు)పై పతక ఆశలున్నాయి.


పక్కా అంటే పక్కా

పక్కాగా పతకం లభిస్తుందని చెప్పగలిగే విభాగం జావెలిన్‌ త్రో. గతంలో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌లో పతకం అంటే.. కలలో ఊహించని విషయం. అయితే, బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 2020 ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణం అందించాడు. డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చోప్రా మళ్లీ పతకం సాధిస్తాడనే అంచనాలు భారీగా పెరిగాయి. చోప్రాతోపాటు మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన కిశోర్‌ జనా కూడా పోడియం ఫినిష్‌ చేయగలడేమో చూడాలి.

మీరాబాయి సింగిల్‌గా..

వెయిట్‌ లిఫ్టింగ్‌లో బరిలో ఉన్న ఏకైక అథ్లెట్‌ మీరాబాయి చాను. టోక్యోలో రజతం సాధించిన మీరా (49 కిలోలు) ఈసారి స్వర్ణం పట్టేయాలన్న పట్టుదలతో ఉంది. అయితే, గాయాలతో ఇబ్బందులు పడిన చానుకు ఈసారి గట్టిపోటీ ఎదురుకానుంది.


హాకీలో పోటీ తీవ్రం...

ఎట్టకేలకు హాకీలో పతక దాహం తీరింది. నాలుగు దశాబ్దాల తర్వాత గత క్రీడల్లో భారత జట్టు కంచు మోత మోగించింది. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పారిస్‌ బెర్త్‌ పట్టేసింది. అయితే, ఇటీవలి యూరోపియన్‌ టూర్‌లో పేలవ ప్రదర్శన కొంత ఆందోళన కలిగిస్తోంది. బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లున్న పూల్‌-బిలో భారత్‌ ఆడనుంది. అయితే, మెరుగైన సాధన చేసిన భారత ఆటగాళ్లు ఈసారి ఫైనల్‌ చేరతామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 07:11 AM