భావోద్వేగ వీడ్కోలు..
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:43 AM
అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో మూడో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పూర్తిగా ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. సహచరులంతా అశ్విన్‌ను హత్తుకొని భావోద్వేగ వీడ్కోలు పలికారు...
అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో మూడో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పూర్తిగా ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. సహచరులంతా అశ్విన్‌ను హత్తుకొని భావోద్వేగ వీడ్కోలు పలికారు. అతనికోసం కేక్ తెప్పించి కట్ చేశారు. అసీస్ ఆటగాళ్లు కమిన్స్, లియోన్ వచ్చి తమ జట్టు ఆటగాళ్లంతా కలిసి సంతకాలు చేసిన జెర్సీని అశ్విన్‌కు అందజేశారు. ఇక, తీవ్ర భావోద్వేగానికి గురైన అశ్విన్.. ‘రోహిత్, విరాట్, గౌతీ భాయ్‌కు థ్యాంక్స్. ఈరోజు సంతోషంగా ఉంది. ఇప్పుడే మొదటిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినట్టు అనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో దిగ్గజాలతో కలిసి ఆడా. క్రమంగా రాహుల్ పాజీ (ద్రవిడ్), సచిన్ పాజీ ఇలా.. ఒక్కొక్కరు రిటైర్ అయ్యారు. ప్రతి ఒక్కరికీ వీడ్కోలు సమయం వస్తుంది. ఈరోజు నాకొచ్చింది.
నేను తిరిగి ఇంటికి వెళ్తున్నా. మీరు మెల్‌బోర్న్‌లో ఎలా ఆడతారో టీవీలో చూస్తా.మీకెప్పుడైనా నాతో అవసరమనిపిస్తే ఫోన్ కాల్‌కు అందుబాటులో ఉంటా’ అని సహచరులతో వీడ్కోలు సందేశంలో అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.