Share News

సిరీస్‌పైనే గురి!

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:00 AM

నాలుగు టీ20ల సిరీస్‌ ఆఖరి అంకానికి చేరింది. శుక్రవారం వాండరర్స్‌ మైదానంలో భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య చివరిదైన నాలుగో మ్యాచ్‌ జరుగనుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు సిరీస్‌ దక్కాలంటే మరో విజయం....

సిరీస్‌పైనే గురి!

నేడు నాలుగో టీ20

రాత్రి 8.30 గం. నుంచి స్పోర్ట్స్‌18, జియో సినిమాలో

గెలుపే ధ్యేయంగా భారత్‌

సమం కోసం దక్షిణాఫ్రికా

జొహాన్నె్‌సబర్గ్‌: నాలుగు టీ20ల సిరీస్‌ ఆఖరి అంకానికి చేరింది. శుక్రవారం వాండరర్స్‌ మైదానంలో భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య చివరిదైన నాలుగో మ్యాచ్‌ జరుగనుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు సిరీస్‌ దక్కాలంటే మరో విజయం చాలు. బ్యాటింగ్‌ పూర్తి స్థాయిలో పటిష్టంగా కనిపించకపోయినా.. బౌలర్లు మాత్రం అండగా నిలుస్తున్నారు. అటు ఆతిథ్య జట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ను చేజారనీయకూడదనే కసితో ఉంది. మూడో టీ20లో విజయానికి చేరువగా వచ్చినా ఫలితం సాధించలేకపోయింది. దీంతో నేటి మ్యాచ్‌లో నెగ్గి సిరీ్‌సను సమం చేయాలన్న ఆలోచనలో ఉంది. మరోవైపు వాండరర్స్‌లో భారత్‌కు మెరుగైన రికార్డే ఉంది. ఇక్కడే తొలి టీ20 వరల్డ్‌కప్‌ గెలవడంతో పాటు, ఈ ఫార్మాట్‌లో సూర్య తన చివరి శతకాన్ని కూడా ఇక్కడే సాధించాడు.


రింకూపై ఆందోళన: ఫినిషర్‌ రింకూ సింగ్‌ ఆటతీరుపై జట్టు ఆందోళనలో ఉంది. ఐపీఎల్‌లో సంచలన ఆటతీరుతో టీమిండియాలో చోటు దక్కించుకున్న తను కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఈ సిరీ్‌సలో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 28 పరుగులే సాధించాడు. ఆత్మవిశ్వాసం లోపించడంతో సెంచూరియన్‌లో వేగంగా ఆడాలని చూసినా బంతిని సరిగ్గా కనెక్ట్‌ చేయలేకపోయాడు. ఆరు, ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగడం కూడా అతడి బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తోంది. రింకూ ఉత్తమ ఇన్నింగ్స్‌ అన్నీ ఐదో నెంబర్‌లో ఆడినప్పుడే వచ్చాయి. క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం చిక్కితే ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో హార్దిక్‌కన్నా ముందుగా పంపితే ఫలితం ఉంటుందేమో. ఇక ఓపెనర్‌ శాంసన్‌ రెండు వరుస డకౌట్లతో నిరాశపరిచినా.. అభిషేక్‌ బ్యాట్‌ ఝుళిపించడం సానుకూలాంశం. వన్‌డౌన్‌లో దిగిన తిలక్‌ వర్మ శతకంతో అదరగొట్టాడు. నేటి మ్యాచ్‌లో ఈ ముగ్గురూ చెలరేగితే మరోసారి భారీ స్కోరు ఖాయమే. కెప్టెన్‌ సూర్యకుమార్‌ మాత్రం బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉంది. బౌలింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా పేసర్లు వైశాఖ్‌, యష్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుందా అనేది వేచిచూడాల్సిందే.


అన్ని విభాగాల్లో రాణిస్తేనే..: చివరి రెండు టీ20ల్లో ఆతిథ్య జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉంది. రెండో టీ20లో సఫారీ బౌలర్లు తేలిపోయినా బ్యాటర్లు మాత్రం భారత్‌ను కాసేపు భయపెట్టారు. విఫలమవుతున్న క్లాసెన్‌ తన బ్యాట్‌ పవరేంటో చాటుకున్నాడు. అలాగే జాన్సెన్‌ అనూహ్య బ్యాటింగ్‌తో దాదాపు గెలుపు దిశగా మ్యాచ్‌ను తీసుకెళ్లాడు. మిల్లర్‌ ఒక్కడే స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదు. బౌలింగ్‌లో స్పిన్నర్‌ కేశవ్‌ అండగా నిలుస్తుండగా పేసర్లు కొట్జీ, సిమెలానె ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. జాన్సెన్‌ మాత్రం పొదుపుగా బౌలింగ్‌ చేయగలిగాడు. నేటి మ్యాచ్‌ జట్టుకు అత్యంత కీలకం కావడంతో అన్ని విభాగాల్లోనూ చెలరేగితేనే భారత్‌ను ఓడించి సిరీ్‌సను సమం చేసే అవకాశం ఉంటుంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: శాంసన్‌, అభిషేక్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్‌, రింకూ సింగ్‌, రమణ్‌దీప్‌, అక్షర్‌, అర్ష్‌దీప్‌, బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తి.

దక్షిణాఫ్రికా: రికెల్టన్‌, హెన్‌డ్రిక్స్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), స్టబ్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌, జాన్సెన్‌, కొట్జీ, సిమెలానె, కేశవ్‌, సిపామ్ల.

పిచ్‌, వాతావరణం

వాండరర్స్‌ వికెట్‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆఖరి పది మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 174గా ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు ఖాయమే. ఇక్కడ ఆడిన చివరి పోరులో భారత్‌ 200+ స్కోరు చేయగా.. కుల్దీప్‌ ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను 100లోపే కట్టడి చేశాడు. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది.

Updated Date - Nov 15 , 2024 | 03:00 AM