‘ఆసియా’ పోరుకు అమ్మాయిలు సై
ABN , Publish Date - Jul 19 , 2024 | 03:46 AM
ఈ ఏడాది అక్టోబరులో మహిళా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే ఆసియాక్‌పతో అలరించేందుకు ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి...
బరిలో ఎనిమిది జట్లు
ఆరంభ మ్యాచ్‌లో
నేపాల్ x యూఏఈ
మధ్యాహ్నం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
దంబుల్లా: ఈ ఏడాది అక్టోబరులో మహిళా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే ఆసియాక్‌పతో అలరించేందుకు ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు జరుగుతుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి నేపాల్-యూఏఈ.. రాత్రి 7.30 నుంచి భారత్-పాక్ తలపడనున్నాయి. ఇక టోర్నీలోని ఫైనల్ సహా మొత్తం 15 మ్యాచ్‌లూ రణ్‌గిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. మొత్తంగా పాల్గొనే 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, నేపాల్, పాక్, యూఏఈ ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, మలేసియా, శ్రీలంక, థాయ్‌లాండ్ జట్లున్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూపులో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీ్‌సకు అర్హత సాధిస్తాయి.
మనదే ఆధిపత్యం: ఆసియాకప్ ఆరంభం నుంచే భారత మహిళల జట్టు తమ హవాను కొనసాగిస్తోంది. మొత్తం 8సార్లు ఈ టోర్నీ జరగ్గా కేవలం 2018ని మినహాయిస్తే అన్నిసార్లూ భారత జట్టే చాంపియన్‌గా నిలిచింది. మొదట 2004 నుంచి 2008 వరకు వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్.. 2012 నుంచి పొట్టి ఫార్మాట్‌కు మారింది. రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియాక్‌పలోనూ హర్మన్‌ప్రీత్ సేన గెలిచింది. అలాగే టీ20 ఆసియాక్‌పలో 20 మ్యాచ్‌లు ఆడగా 17 గెలిచింది. ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్‌గా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటోంది. మరోవైపు నేపాల్ జట్టు 2016 తర్వాత ఆసియాక్‌పలో చోటు దక్కించుకోగా.. యూఏఈకిది వరుసగా రెండో టోర్నీ.