పతకాలు పట్టుకొచ్చేదెవరు?
ABN , Publish Date - Jul 21 , 2024 | 02:50 AM
ఒలింపిక్స్‌లో భారత పతకాలు ఆశిస్తున్న విభాగాల్లో రెజ్లింగ్ ఒకటి. గత నాలుగు ఎడిషన్లుగా మన రెజర్లు మెడల్స్ కొల్లగొడుతూనే ఉండడంతో.. దేశంలో కుస్తీ క్రీడకు క్రేజ్ పెరిగింది. 2008లో కాంస్యంతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన సుశీల్ కుమార్ ఆ తర్వాత లండన్ క్రీడల్లో...
పారిస్ ఒలింపిక్స్ 5 రోజుల్లో
కుస్తీలో ఆరుగురు
వినేష్‌పైనే దృష్టి
ఒలింపిక్స్‌లో భారత పతకాలు ఆశిస్తున్న విభాగాల్లో రెజ్లింగ్ ఒకటి. గత నాలుగు ఎడిషన్లుగా మన రెజర్లు మెడల్స్ కొల్లగొడుతూనే ఉండడంతో.. దేశంలో కుస్తీ క్రీడకు క్రేజ్ పెరిగింది. 2008లో కాంస్యంతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన సుశీల్ కుమార్ ఆ తర్వాత లండన్ క్రీడల్లో రజతం సొంతం చేసుకొన్నాడు. 2012లో యోగేశ్వర్ దత్ కాంస్యంతో మెరిశాడు. 2016లో సాక్షి మాలిక్ కంచు మోత మోగించగా.. 2020 టోక్యోలో రవి దహియా, బజ్‌రంగ్ పూనియాలు రజత, కాంస్యాలతో అదరగొట్టారు. అయితే, ఈ క్రీడకు బలమైన పునాదులు పడుతున్న క్రమంలో అంతర్గత రాజకీయాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు, తిరుగుబాట్లతో ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయింది. పారిస్ క్రీడలకు ఆరుగురు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో పతకాలు గెలిచే సత్తా ఉన్న వారు ఎవరు? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
అంతిమ్ పంగల్..: దేశానికి తొలి పారిస్ కోటా బెర్త్‌ను ఖరారు చేసింది. 53 కిలోల విభాగం బరిలోకి దిగనున్న పంగల్ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. ప్రత్యర్థుల పట్టుకు చిక్కకుండా తప్పించుకోవడం అంతిమ్ స్పెషల్. వెన్ను గాయం కారణంగా పోటీలకు దూరమవడంతో తగినంత సాధన చేయలేకపోయింది. అంతర్జాతీయ అనుభవం కూడా తక్కువే.
అన్షు మాలిక్..: దూకుడుగా ఆడే అన్షు 57 కిలోల విభాగంలో ఆడనుంది. జూనియర్ స్థాయిలో ప్రకంపనలు సృష్టించినా.. సీనియర్ విభాగంలో ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయింది. ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలున్నాయి.
నిషా దహియా..: బెదురు లేకుండా ప్రత్యర్థిపై అటాక్ చేయడం నిషా స్టైల్. 68 కిలోల విభాగంలో సైలెంట్‌గా బెర్త్ పట్టేసింది. ఎక్కువ సేపు బౌట్ సాగితే అలసిపోతుంది. తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోంటుందనే దానిపై పతక ఆశలు ఆధారపడి ఉన్నాయి.
రీతిక హుడా..: ఊహించని రీతిలో ప్రత్యర్థిపై దాడి చేయగల నేర్పు రీతిక సొంతం. 76 కిలోల్లో గట్టిపోటీ ఇవ్వగల రెజ్లర్లలో హుడా కూడా ఉంది. బౌట్ చివర్లలో ప్రత్యర్థికి పాయింట్లు ఇచ్చుకోవడం రీతికకు మైన్‌సగా మారుతోంది.
వినేష్ ఫొగట్
బరిలో ఉన్న భారత అత్యుత్తమ మహిళా రెజ్లర్ ఫొగట్ అనడంలో సందేహం లేదు. ఈసారి 50 కిలోల విభాగంలో వినేష్ బరిలోకి దిగుతోంది. అదను చూసి దాడి చేస్తూనే.. చాకచక్యంగా తనను తాను రక్షించుకోగలదు. అయితే, తక్కువ వెయిట్ విభాగానికి మారడం కోసం శరీరాన్ని ఎంతో ఒత్తిడికి గురి చేసింది. పైగా ఏడాదికి పైగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తగినంత ప్రాక్టీస్ చేయలేదనే చెప్పుకోవాలి.
అమన్ షెహ్రావత్
జట్టులో ఒకే ఒక్క పురుష రెజ్లర్. 57 కిలోల ట్రయల్స్‌లో ఒలింపిక్ పతక విజేత రవి దహియాకు షాకిచ్చి పారిస్ బెర్త్ పట్టేశాడు. ఎక్కువ సమయం పోరాడగలగడం అమన్ బలమైనా.. సాంకేతికంగా ఎంతో బలహీనం. వ్యూహాత్మకంగా ఆడలేడు. ప్లాన్-బి అనేది ఉండదు.
టీమిండియా సహాయ కోచ్‌లుగా అభిషేక్, డస్కటే!
న్యూఢిల్లీ: మాజీ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు టెన్ డస్కటే భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించే చాన్సుంది. వీరి నియామకంపై బీసీసీఐ అధికారికంగా స్పందించకపోయినా.. వీరిద్దరు కూడా శ్రీలంక పర్యటనకు జట్టుతో పాటు వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. అతడికి సహాయకులుగా వీరు వ్యవహరిస్తారు. అభిషేక్, డస్కటే ఐపీఎల్‌లోనూ గౌతీతో కేకేఆర్ తరఫున బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ కొనసాగబోతున్నాడు. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌పై బోర్డు ఆసక్తి చూపుతోంది.