Share News

హర్విందర్‌ గురి.. తెచ్చింది పసిడి

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:43 AM

పారాలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. అథ్లెటిక్స్‌, ఆర్చరీలో బుధవారం రెండు పతకాలు మన ఖాతాలో చేరాయి. ఆర్చరీ పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో హర్విందర్‌ సింగ్‌ అదరగొట్టాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో హర్విందర్‌ 6-0తో లుకాస్‌ సిజెక్‌ (పోలెండ్‌)ను...

హర్విందర్‌ గురి.. తెచ్చింది పసిడి

ఆర్చరీలో భారత్‌కు చారిత్రక స్వర్ణం

షాట్‌పుట్‌లో సచిన్‌కు రజతం

వహ్‌వా.. హర్విందర్‌ సింగ్‌! పురుషుల రికర్వ్‌

వ్యక్తిగత విభాగంలో ఆరంభం నుంచి ఫైనల్‌ వరకు..అదీ ఒకేరోజు వరుసగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో 33 ఏళ్ల ఈ ఆర్చర్‌ రాణించిన తీరు అద్భుతం..

అమోఘం.. ప్రీక్వార్టర్స్‌, ఆపై సెమీఫైనల్లో వెనుకంజలో నిలిచినా అతడు ఒత్తిడికి లోనవలేదు..పట్టు వీడలేదు..ప్రశాంత చిత్తంతో బాణాలు వేసి ఫైనల్‌కు దూసుకొచ్చాడు..అదే ఊపులో తుది పోరును ఏకపక్షం చేసి విజేతగా నిలిచాడు..

తద్వారా పారాలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన భారత తొలి ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతకుముందు పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 విభాగంలో వరల్డ్‌ చాంపియన్‌ సచిన్‌ సర్జేరావ్‌ ఖిలారి రజత పతకం కొల్లగొట్టాడు. దాంతో ఏడో రోజు పోటీలను భారత్‌ స్వర్ణ, రజత పతకాలతో ముగించింది.


పారిస్‌: పారాలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. అథ్లెటిక్స్‌, ఆర్చరీలో బుధవారం రెండు పతకాలు మన ఖాతాలో చేరాయి. ఆర్చరీ పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో హర్విందర్‌ సింగ్‌ అదరగొట్టాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో హర్విందర్‌ 6-0తో లుకాస్‌ సిజెక్‌ (పోలెండ్‌)ను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచాడు. పారాలింపిక్స్‌లో హర్విందర్‌కిది వరుసగా రెండో పతకం కావడం విశేషం. టోక్యో క్రీడల్లో హర్విందర్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. లుకాస్‌ రజతానికే పరిమితం కాగా, ఇరాన్‌ ఆర్చర్‌ రెజా కాంస్య పతకం నెగ్గాడు. అంతకుముందు సెమీఫైనల్లో 7-3తో మహ్మద్‌ రెజా(ఇరాన్‌)ను హర్విందర్‌ చిత్తు చేశాడు. క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నెం. 9 హెక్టార్‌ జూలియో రమిరేజ్‌ (కొలంబియా)కు 6-2తో హర్విందర్‌ షాకిచ్చాడు.

ఫైనల్లో సిమ్రాన్‌: మహిళల 100 మీటర్ల టీ12లో సిమ్రాన్‌ శర్మ (12.17సె.) సీజన్‌ అత్యుత్తమ సమయంతో రేస్‌ను పూర్తి చేయడంతోపాటు తన హీట్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్మత సాధించింది. మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌46 ఫైనల్లో భారత్‌కు చెందిన అమిషా రావత్‌ (9.25మీ.) 14వ స్థానంలో నిలిచింది. పురుషుల పవర్‌ లిఫ్టింగ్‌ 49 కి. ఫైనల్లో ఎనిమిదో స్థానంలో, మహిళల 45 కిలోల్లో సకినా ఖటూన్‌ ఏడో స్థానంతో నిరాశపరిచారు.


ప్చ్‌..అర్షద్‌: ఏపీ సైక్లిస్ట్‌ అర్షద్‌ షేక్‌ టైమ్‌ ట్రయల్‌ విభాగంలోనూ విఫలమయ్యాడు. పురుషుల సీ2 టైమ్‌ ట్రయల్‌ రేస్‌లో 25 నిమిషాల 20.11 సెకన్లలో గమ్యం చేరిన అర్షద్‌ 11వ, ఆఖరి స్థానంలో నిలిచాడు. పురుషుల 1000 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ సీ1-3 క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో అర్షద్‌ ఆఖరి, 17వ స్థానం సాధించిన విషయం విదితమే.

డెంగ్యూతో వైకల్యానికి గురై..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

హరియాణాలోని అజిత్‌ నగర్‌కు చెందిన హర్విందర్‌ సింగ్‌.. ఏడాదిన్నర వయసున్నప్పుడు డెంగ్యూ వ్యాధి బారిన పడ్డాడు. ఆ సందర్భంగా ఇచ్చిన కొన్ని ఇంజెక్షన్‌లు వికటించడంతో అతని కాళ్లు పనిచేయడం మానేశాయి. ఇలా, చిరు ప్రాయంలోనే వైకల్యానికి గురైనా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాడు హర్విందర్‌. 2012 లండన్‌ పారాలింపిక్స్‌లో ఆర్చర్లను చూసి స్ఫూర్తిపొందిన అతను.. ఆర్చరీని కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2017 పారా ప్రపంచ చాంపియన్‌షి్‌పతో అంతర్జాతీయ ఆర్చరీలోకి అరంగేట్రం చేసిన హర్విందర్‌.. ఆ టోర్నీలో ఏడోస్థానంలో నిలిచాడు. మరుసటి ఏడాది ఆసియా పారా క్రీడల్లో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత కొవిడ్‌ లాక్‌డౌన్‌ విధించడంతో హర్విందర్‌ సాధన కోసం తన పొలంలోనే ఆర్చరీ రేంజ్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడ కఠోరంగా శ్రమించిన హర్విందర్‌ టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్య పతకంతో మురిపించాడు. ఇప్పుడు పారి్‌సలో ఏకంగా స్వర్ణంతో విజయనాదం చేశాడు.

Updated Date - Sep 05 , 2024 | 02:43 AM