కొవిడ్‌తోనే కొట్టేశారు!
ABN , Publish Date - Aug 11 , 2024 | 02:02 AM
టోక్యో ఒలింపిక్స్‌కు పారిస్ గేమ్స్‌కు ఎంత భేదమో! ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కారణంగా టోక్యో క్రీడలు ఏడాదిపాటు వాయిదా పడ్డాయి. 2021లో ఆ క్రీడలను అత్యంత కఠినమైన ఆంక్షల నడుమ...
టోక్యో ఒలింపిక్స్‌కు పారిస్ గేమ్స్‌కు ఎంత భేదమో! ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కారణంగా టోక్యో క్రీడలు ఏడాదిపాటు వాయిదా పడ్డాయి. 2021లో ఆ క్రీడలను అత్యంత కఠినమైన ఆంక్షల నడుమ నిర్వహించారు. ఏ పోటీకి ఫ్యాన్స్‌ను అనుమతించలేదు. ఇకపోతే..పారి్‌సలోనూ కొవిడ్ కేసులు బయటపడకపోలేదు. కాకపోతే ఆ వ్యాధి ఓ సాధారణ ఫ్లూ స్థాయికి మారడంతో అంతా లైట్‌గా తీసుకున్నారు. అమెరికా స్ర్పింట్ స్టార్ నోవా లైల్స్ కరోనాతోనే 200 మీ. పరుగులో తలపడి కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఇంకా..క్రీడా గ్రామంలో పలు కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలనే సూచన చేశారు తప్పితే ఆంక్షలేమీ విధించలేదు. కాగా..క్రీడా గ్రామంలో 40 మంది అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.
స్విమ్మింగ్‌లో రజత పతకం సాధించిన బ్రిటన్ స్టార్ ఆడమ్ పెటీకి కూడా గతవారం కొవిడ్ సోకింది. తమ మహిళా వాటర్ పోలో జట్టులో ఐదుగురు కొవిడ్ బారిన పడ్డారని ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలిపారు. అయినా తమ జట్టు ప్రాక్టీ్‌సకు అనుమతి లభించిందన్నారు. ‘టోక్యోలో కొవిడ్‌ను తీవ్రమైనదిగా భావించాం. కానీ ఇప్పుడు అది సాధారణ ఫ్లూస్థాయికి మారింది. అందువల్ల ఈసారి ఆ వ్యాధికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక సూచనలు చేయలేదు’ అని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ బాచ్ చెప్పారు.