Share News

మను చరిత్ర

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:55 AM

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో రెండో రోజే భారత్‌ పతకంతో మురిసింది. అందరి అంచనాలను నిజం చేస్తూ.. 140 కోట్ల భారతావనిని ఆనంద డోలికల్లో ముంచెత్తుతూ.. 22 ఏళ్ల హరియాణా షూటర్‌ మను భాకర్‌ కాంస్యం సాధించింది...

మను చరిత్ర

షూటర్‌ మను భాకర్‌కు కాంస్యం

ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ

పారిస్‌: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో రెండో రోజే భారత్‌ పతకంతో మురిసింది. అందరి అంచనాలను నిజం చేస్తూ.. 140 కోట్ల భారతావనిని ఆనంద డోలికల్లో ముంచెత్తుతూ.. 22 ఏళ్ల హరియాణా షూటర్‌ మను భాకర్‌ కాంస్యం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌లో 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. తద్వారా షూటింగ్‌లో దేశానికి పతకం అందించిన తొలి మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. టోక్యో గేమ్స్‌లో మను మూడు విభాగాల్లో పోటీ పడి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం బరిలోకి దిగిన తొలి ఈవెంట్‌లోనే పోడియం ఎక్కి శభాష్‌ అనిపించుకుంది. అలాగే ఫైనల్స్‌లో కొరియాకు చెందిన ఓహ్‌ యే జిన్‌ (243.2) ఒలింపిక్‌ రికార్డుతో స్వర్ణం సాధించగా.. ఆ దేశానికే చెందిన కిమ్‌ యెజి (241.3) రజతం అందుకుంది. ఇక 2012లో గగన్‌ నారంగ్‌, విజయ్‌ కుమార్‌ల తర్వాత షూటింగ్‌లో దేశానికి దక్కిన మరో పతకం ఇదే కావడం గమనార్హం. ఓవరాల్‌గా దేశానికి పతకం అందించిన ఐదో షూటర్‌గా మను నిలిచింది.


అంచనాలతో బరిలోకి..: వ్యక్తిగత విభాగంలో 20 ఏళ్ల తర్వాత ఫైనల్స్‌కు చేరిన తొలి భారత మహిళా షూటర్‌గా మను భాకర్‌.. పోటీల తొలి రోజే పతక ఆశలను కల్పించింది. దీనికి తగ్గట్టుగానే ఆదివారం చెదరని చిరునవ్వుతో.. పతకంపై విశ్వాసంతోనే పోటీలను ఆరంభించింది. ఇందులో ఆద్యంతం టాప్‌-3లోనే కొనసాగడం తనలోని నిలకడను చూపుతుంది. తొలి సిరీ్‌సను మను మూడు ఇన్నర్‌ 10లతో దీటుగా ఆరంభించింది. ఇక రెండో సిరీస్‌ ఐదు షాట్లతో 100.3 పాయింట్లతో చివరి వరకు కూడా టాప్‌-3 లోనే పోటీ ఇచ్చింది. ఎలిమినేషన్‌ రౌండ్‌లోనైతే కిమ్‌ ఎజితో మను రెండో స్థానం కోసం పోటీపడింది. ఆఖరి రెండు షాట్లను ప్రత్యర్థికంటే మెరుగ్గా 10.1, 10.3గా మలిచినప్పటికీ కిమ్‌ మొత్తం పాయింట్ల సంఖ్య మను కన్నా ఎక్కువగా ఉన్నాయి. దీంతో భాకర్‌ మూడో స్థానానికే పరిమితంకాగా తొలి రెండు స్థానాల కోసం కొరియా షూటర్లు తలపడ్డారు.


10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో మూడో స్థానం

ఫైనల్స్‌కు అర్జున్‌, రమిత

తొలి రోజు మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో నిరాశపర్చిన అర్జున్‌ బబుత పురుషుల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ అర్హత పోటీల్లో సత్తా చాటుకున్నాడు. 630.1 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరాడు. అయితే ఇదే విభాగంలో మరో భారత షూటర్‌ సందీప్‌ సింగ్‌ (629.3) మాత్రం 12వ స్థానంలో నిలిచి పోటీల నుంచి తప్పుకొన్నాడు. అలాగే మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో రమిత జిందాల్‌ 631.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు వెళ్లింది. చివరిసారిగా 2004లో సుమ శిరూర్‌ ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరింది. కానీ రమిత సహచరి ఎలవేనిల్‌ 630.7 పాయింట్లతో పదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.


టోక్యో ఓటమి వెంటాడింది

‘చివరి ఒలింపిక్స్‌లో నా ప్రదర్శన నిరుత్సాహపరిచింది. ఆ పరాభవం నుంచి బయటపడేందుకు చాలా సమయమే పట్టింది. అందుకే ప్రస్తుత ఫలితంతో సంతోషంగా ఉన్నా. అలాగే షూటింగ్‌లో మెడల్‌ కోసం దేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. నా ద్వారా ఆ లోటు తీరినందుకు సంతృప్తిగా అనిపిస్తోంది. కఠోర శ్రమతోనే ఇది సాధ్యమైంది. అయితే చివరి షాట్‌ సమయంలో నాలో శక్తినంతా కూడదీసుకోవాల్సి వచ్చింది. వచ్చేసారి మరింత ఉత్తమ ప్రదర్శన కనబరుస్తాను.

మను భాకర్‌


మనుకు మోదీ ఫోన్‌

పతకం సాధించిన వెంటనే మను భాకర్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అభినందించారు. ‘టోక్యో ఒలింపిక్స్‌లో రైఫిల్‌లో సమస్య ఏర్పడడంతో నీకు పతక అవకాశం చేజారింది. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించావు. ఈ ఒలింపిక్స్‌లో మిగిలిన విభాగాల్లోనూ నువ్వు రాణిస్తావని నమ్మకముంది’ అని మోదీ అన్నారు. పారి్‌సలో క్రీడా సౌకర్యాలు ఎలా ఉన్నాయని భాకర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. అథ్లెట్లకు సకల సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని మోదీ చెప్పారు. పతకం గెలిచాక కుటుంబ సభ్యులతో మాట్లాడావా..అని భాకర్‌ను ప్రధాని ప్రశ్నించారు. గేమ్స్‌ విలేజ్‌లోని రూమ్‌కు వెళ్లాక అమ్మతో మాట్లాడతానని భాకర్‌ బదులిచ్చింది.

‘కాంస్యంతో పతక బోణీ చేసినందుకు మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ ఫీట్‌ సాధించిన తొలి మహిళా షూటర్‌గా నిలవడం ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నా’

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


మను భాకర్‌ సాధించింది. పుష్కర కాలం ఎదురుచూపులకు తెర దించుతూ షూటింగ్‌లో దేశానికి ఓ పతకం అందించింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టుగా, మూడేళ్ల క్రితం టోక్యో గేమ్స్‌లో ఎదురైన ఓటమికి పారి్‌సలో బదులు తీర్చుకుంది. కుంగుబాటును అధిగమిస్తూ.. లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ.. అంతులేని ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్స్‌కు చేరిన ఈ 22 ఏళ్ల యువ షూటర్‌ ఈసారి అంచనాలను వమ్ము చేయలేదు. గురి తప్పని తూటాలతో ఇప్పుడు ఒలింపిక్‌ కాంస్య పతకాన్ని సగర్వంగా అందుకుంది. అంతేనా.. ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గానూ చరిత్ర సృష్టించింది.

ఒలింపిక్స్‌లో మన పతక షూటర్లు

రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ డబుల్‌ ట్రాప్‌ రజతం 2004 ఏథెన్స్‌

అభినవ్‌ బింద్రా 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ స్వర్ణం 2008 బీజింగ్‌

గగన్‌ నారంగ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ కాంస్యం 2012 లండన్‌

విజయ్‌ కుమార్‌ 25మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ రజతం 2012 లండన్‌

మను భాకర్‌ 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ కాంస్యం 2024 పారిస్‌

Updated Date - Jul 29 , 2024 | 03:55 AM